ఆర్థికాభివృద్ధిలో భారత్ పరుగులు : మోదీ

ABN , First Publish Date - 2022-02-08T18:30:49+05:30 IST

ప్రపంచ దేశాలన్నిటినీ ద్రవ్యోల్బణం ప్రభావితం చేసిందని,

ఆర్థికాభివృద్ధిలో భారత్ పరుగులు : మోదీ

న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలన్నిటినీ ద్రవ్యోల్బణం ప్రభావితం చేసిందని, యూరో కరెన్సీ అమల్లో ఉన్న దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం అధికంగా ఉందని, కేవలం మన దేశంలో మాత్రమే దీనిని అదుపులో ఉంచగలిగామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు. 


కోవిడ్ వల్ల భారీ సంక్షోభం

100 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత విపత్తు కోవిడ్-19 మహమ్మారి రూపంలో వచ్చిందన్నారు. ఇటువంటి విపత్తును వందేళ్ళలో మానవాళి కనీ వినీ ఎరుగదని చెప్పారు. ఈ సంక్షోభం తన రూపాలను మార్చుకుంటూ, ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. యావత్తు భారత దేశం, ప్రపంచం దీనితో పోరాడుతోందని చెప్పారు. సమాజంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలందరికీ ఈ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. 


ప్రభుత్వ చర్యలతో భరోసా

ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఈ మహమ్మారి నుంచి బయట పడటం కోసం కొత్త విధానాలతో చర్యలు తీసుకోవచ్చుననే భరోసా కలిగిందన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వడం ద్వారా ప్రపంచానికి ఓ ఉదాహరణగా మన దేశం నిలిచిందన్నారు. భారత దేశంలోనే తయారైన వ్యాక్సిన్లను ఇస్తూ, కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను అత్యధికంగా చేపట్టిన దేశంగా భారత దేశం నిలిచిందని తెలిపారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా మన పొరుగు దేశాలకు కూడా అందించినట్లు తెలిపారు. 


మితమైన ద్రవ్యోల్బణం, ఘనమైన ఆర్థికాభివృద్ధి

ద్రవ్యోల్బణం యావత్తు ప్రపంచాన్ని కుదిపేస్తోందని చెప్పారు. 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయి ద్రవ్యోల్బణం అమెరికాలో ఉందని, 30 ఏళ్ళ గరిష్ఠ స్థాయిలో బ్రిటన్‌లో ఉందన్నారు. యూరో కరెన్సీ అమల్లో ఉన్న దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాము 2015-2020 మధ్య కాలంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నించామన్నారు. ఈ కాలంలో ద్రవ్యోల్బణం రేటు 4 శాతం నుంచి 5 శాతం వరకు ఉండేదన్నారు. కాంగ్రెస్ నేత‌ృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యలో ఉండేదని చెప్పారు. నేడు మితమైన ద్రవ్యోల్బణం, అధిక వృద్ధి రేటు ఉన్న ఏకైక భారీ ఆర్థిక వ్యవస్థ భారత దేశమేనని చెప్పారు. 


Updated Date - 2022-02-08T18:30:49+05:30 IST