Work-From-Home: ఇంటి నుంచే పని చేసే వాతావరణం భవిష్యత్తుకు అవసరం : మోదీ

ABN , First Publish Date - 2022-08-26T19:09:35+05:30 IST

భారత దేశ అభివృద్ధిలో కార్మిక, ఉద్యోగ వర్గాలు అత్యంత కీలక

Work-From-Home: ఇంటి నుంచే పని చేసే వాతావరణం భవిష్యత్తుకు అవసరం : మోదీ

న్యూఢిల్లీ : భారత దేశ అభివృద్ధిలో కార్మిక, ఉద్యోగ వర్గాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. పని చేసేవారికి అనువైన పని ప్రదేశాలు (flexible workplaces), పని వేళలు (flexible work hours), ఇంటి వద్ద నుంచే పని చేయడానికి అవకాశం ఉండటం (work-from-home ecosystem) వంటివన్నీ భవిష్యత్తులో చాలా అవసరమని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక శాఖ మంత్రుల జాతీయ సమావేశంలో గురువారం (ఆగస్టు 25న) ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. 


భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం కోసం భారత దేశ కలలు, ఆకాంక్షలను సాకారం చేయడంలో దేశంలోని కార్మిక వర్గం పోషించవలసిన పాత్ర చాలా పెద్దదని తెలిపారు. దేశం కోట్లాది మంది కార్మికుల కోసం నిరంతరం ఈ ఆలోచనతో పని చేస్తోందన్నారు. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లోని కార్మికుల కోసం ఈ కృషి జరుగుతున్నట్లు తెలిపారు. 


ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. ప్రధాన మంత్రి శ్రమ యోగి మంథన్ యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్మికుల శ్రమ, కృషిలకు గుర్తింపు లభించే విధంగా ఈ పథకాలు భరోసానిస్తున్నాయన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 1.5 కోట్ల ఉద్యోగాలను ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ( అత్యవసర రుణ హామీ పథకం) కాపాడినట్లు ఓ అధ్యయనం వెల్లడించిందన్నారు. ఉద్యోగులు, కార్మికులకు అవసరమైనపుడు దేశం ఏ విధంగా అండగా నిలిచిందో, అదేవిధంగా కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకోవడానికి వారు కూడా తమ సంపూర్ణ బలాన్ని వినియోగించాలని పిలుపునిచ్చారు. 


నేడు భారత దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ అత్యంత వేగంగా వృద్ధి చెందే వ్యవస్థగా మారిందని, దీనిలో అత్యధిక ఘనత ఉద్యోగ, కార్మిక వర్గానికే చెందుతుందని తెలిపారు.


 

Updated Date - 2022-08-26T19:09:35+05:30 IST