అందరి అభివృద్ధి వర్సెస్ కుటుంబ స్వార్థం : మోదీ

ABN , First Publish Date - 2021-12-27T21:57:25+05:30 IST

అభివృద్ధి నమూనాలు రెండు ఉన్నాయని, వాటిలో ఒకటి

అందరి అభివృద్ధి వర్సెస్ కుటుంబ స్వార్థం : మోదీ

న్యూఢిల్లీ : అభివృద్ధి నమూనాలు రెండు ఉన్నాయని, వాటిలో ఒకటి అందరి అభివృద్ధిని కోరుకుంటుందని, మరొకటి కుటుంబ స్వార్థానికి ఉపయోగపడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం’’ నమూనా అని తెలిపారు. ఈ దార్శనికతతో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేస్తోందన్నారు. 


హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జల విద్యుత్తు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలో రెండు అభివృద్ధి నమూనాలు ఉన్నాయన్నారు. వాటిలో ఒకటి ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం’’ అని తెలిపారు. ‘‘నా స్వార్థం, కుటుంబ స్వార్థం’’ అనే మరొక నమూనా కూడా ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మొదటి నమూనాను అమలు చేస్తోందన్నారు. 


రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ, గత ప్రభుత్వ నేతలు రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, తమ స్వప్రయోజనాలు, సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చారన్నారు. స్వప్రయోజనాల కోసమే పని చేసే నమూనాను మీరు చూశారన్నారు. ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం దక్కడం లేదని, ఆ పార్టీ నేతల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. 


నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ జరగాలనే లక్ష్యాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. 15-18 సంవత్సరాల వయసుగలవారికి టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని పునరుద్ఘాటించారు. ఆరోగ్య సేవలను అందజేసే ఉద్యోగులకు, వయో వృద్ధులకు జనవరి 10 నుంచి ముందు జాగ్రత్త టీకా డోసులను ఇస్తామన్నారు. 


Updated Date - 2021-12-27T21:57:25+05:30 IST