Modi : 70 మంది కేంద్ర మంత్రులకు మోదీ ‘స్పెషల్ టాస్క్’

ABN , First Publish Date - 2021-09-04T03:05:15+05:30 IST

వారి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలు అక్కడ ఏమాత్రం అమలవుతున్నాయో కూడా తెలుసుకోవాలని మోదీ ఆదేశాలు జారీ చేశారు.

Modi : 70 మంది కేంద్ర మంత్రులకు మోదీ ‘స్పెషల్ టాస్క్’

శ్రీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం జమ్మూ కశ్మీర్‌కు చెందిన అన్ని పార్టీల నేతలతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పూర్ణమైన రాష్ట్ర హోదాతో పాటు జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలను నిర్వహించే విషయంలోనూ ప్రధాని వీరందరితో చర్చించినట్లు వార్తలొచ్చాయి. అతి త్వరలోనే జమ్మూ కశ్మీర్‌కు పూర్ణమైన రాష్ట్ర హోదాను ఇవ్వడంతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాని మోదీతో సహా అగ్రనేతలందరూ సిద్ధమయ్యారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మాత్రం కేంద్రం ఈ విషయంపై సైలెంట్ అయిపోయింది. అయితే ప్రధాని మోదీ మాత్రం జమ్మూ కశ్మీర్‌పై నిశితమైన దృష్టిని నిలిపే ఉంచారని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఓ ‘ప్రత్యేకమైన వ్యూహం’తోనే మోదీ ముందుకు సాగుతున్నారని ఢిల్లీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.


ఏకంగా 70 మంది కేంద్ర మంత్రులను జమ్మూ కశ్మీర్‌కు పంపుతున్న మోదీ

డిసెంబర్ 10 నుంచి జమ్మూ కశ్మీర్‌లో ప్రత్యేకంగా పర్యటించాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ టాస్క్‌ కోసం 70 మంది కేంద్ర మంత్రుల జాబితాను మోదీ తయారు చేయించారు. వీరందరూ జమ్మూ కశ్మీర్‌లోని ప్రతి మూలలోనూ పర్యటించి, ప్రజలతో మమేకం కావాలని మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. వారి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలు అక్కడ ఏమాత్రం అమలవుతున్నాయో కూడా తెలుసుకోవాలని మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఈ 70 మంది కేంద్ర మంత్రులు కూడా తొమ్మిది సార్లు జమ్మూ కశ్మీర్‌ను చుట్టి రావాలన్న నిబంధనను కూడా మోదీ విధించారు. ఇదంతా ముగిసిన తర్వాత చివరాఖరకు మోదీ సమీక్ష జరపనున్నారు.  


Updated Date - 2021-09-04T03:05:15+05:30 IST