మోదీ వజ్ర సంకల్పం

ABN , First Publish Date - 2021-01-05T05:50:54+05:30 IST

కరోనా మహమ్మారి విరుచుకుపడి ఏడాది పూర్తి కాకముందే మన ఫార్మాస్యూటికల్ కంపెనీలు వాక్సిన్‌తో సిద్ధం కావడం, ఆత్మనిర్భర్ పేరిట అనేక పథకాలు, ప్యాకేజీలతో దేశం ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడం అభివృద్ధికీ, శాస్త్రీయ దృక్పథానికీ....

మోదీ వజ్ర సంకల్పం

కరోనా మహమ్మారి విరుచుకుపడి ఏడాది పూర్తి కాకముందే మన ఫార్మాస్యూటికల్ కంపెనీలు వాక్సిన్‌తో సిద్ధం కావడం, ఆత్మనిర్భర్ పేరిట అనేక పథకాలు, ప్యాకేజీలతో దేశం ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడం అభివృద్ధికీ, శాస్త్రీయ దృక్పథానికీ మోదీ ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనం. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దేశ ఆర్థిక, సామాజిక పునర్నిర్మాణాన్ని అనుకున్న సమయంలో అనుకున్న విధంగా అమలు చేయడమే మోదీ సంకల్పం. కొత్త సంవత్సరంలో ద్విగుణీకృత ఉత్సాహంతో ఈ సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తారనడంలో సందేహమేమీ లేదు.


కొత్తసంవత్సరం ప్రవేశిస్తుండగానే భారత ప్రజలకు శుభవార్త అందింది. గత కొన్ని నెలలుగా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న క్రియాశీలక చర్యల మూలంగా కరోనా మహమ్మారిని అంతం చేసే వాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ఈ వాక్సిన్ తయారీకీ భారత శాస్త్రవేత్తలను, ఫార్మా కంపెనీలను ప్రోత్సహించడం దగ్గరనుంచి స్వయంగా పర్యవేక్షించడం వరకూ మోదీ అడుగడుగునా ఆసక్తి చూపారు. వాక్సిన్ పంపిణీకి సంబంధించి ఒక పకడ్బందీ ప్రణాళికను రూపొందించేలా చేశారు. వాక్సిన్ తయారీపై త్వరిత గతిన చర్యలు తీసుకునేందుకు గత ఏప్రిల్‌లోనే ప్రధానమంత్రి ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారంటేనే ఆయన ఎంత దూరదృష్టితో చర్యలు తీసుకున్నారో మనకు అర్థమవుతుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్లుగా శాస్త్ర సాంకేతిక సలహాదారు కె. విజయరాఘవన్, నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్‌లతో పాటు వైద్య పరిశోధనా మండలి, బయోటెక్నాలజీ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, డీఆర్‌డీఓ, డ్రగ్ కంట్రోలర్ జనరల్, ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్ జనరల్ ప్రతినిధులను సభ్యులుగా నియమించిన మోదీ అనేక సార్లు వారితో సమావేశమై వాక్సిన్ పురోగతిని సమీక్షించారు. వాక్సిన్ తయారీ విషయంలో అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలతో భారత ప్రయత్నాలను సమన్వయపరిచే కీలక బాధ్యతను బయోటెక్నాలజీ విభాగానికి అప్పగించారు.


కరోనాను అరికట్టే విషయంలో రాష్ట్రాలకు ఎప్పటికప్పుడూ మార్గ నిర్దేశకత్వం అందించిన మోదీ వాక్సిన్ విషయంలో కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తగిన సూచనలను ఇచ్చారు. మోదీ సర్కార్ తీసుకున్న పకడ్బందీ చర్యల మూలంగా కరోనా మహమ్మారికి మన దేశంలో అతి తక్కువ శాతం మంది మృత్యువాత పడ్డారు. ఇవాళ 135 కోట్లకు పైగా ఉన్న భారతదేశ జనాభాకు దశలవారీగా వాక్సిన్ ఇచ్చేందుకు ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక బృహత్తర కార్యక్రమం సిద్ధంగా ఉన్నదంటే అందుకు పూర్తి ఘనత నరేంద్రమోదీ నాయకత్వానికే దక్కుతుందనడంలో సందేహం లేదు. అనేక దేశాల్లో ఇంకా లాక్‌డౌన్‌లూ, రాత్రి కర్ఫ్యూలు కొనసాగుతుండగా భారత్‌లో ఇన్ని కోట్ల మందికి ఏ విధంగా టీకాలను అందజేస్తారా అన్న విషయాన్ని మొత్తం ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ కార్యక్రమం ఇవాళ వాక్సిన్ తయారీ, పంపిణీ రూపంలో పూర్తిగా సాకారమై మన కళ్ల ముందు సాక్షాత్కరించబోతున్నది. ఇది ఎక్కడో విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న వాక్సిన్ కాదు. మన దేశంలో మన శాస్త్రవేత్తలు మన కంపెనీల్లో తయారు చేసిన వాక్సిన్.


ఏమైతేనేం, మరి కొద్ది రోజుల్లో భారత ప్రజలు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తులై, కొత్త సంవత్సరంలో తమ ఆకాంక్షలను యథా ప్రకారం నెరవేర్చుకునేందుకు సంసిద్ధమవుతున్నారు. మోదీ ప్రభుత్వం అనేక దశలుగా ప్రకటించిన ఆత్మనిర్భర్, గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంది. వాక్సిన్ పంపిణీ తర్వాత జన జీవనం మరింత సాధారణమై ఆర్థిక సామాజిక కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయనడంలో సందేహం లేదు. గత ఏడాది కాలాన్ని పీడకలగా భావించి భారత ప్రజలు మోదీ సారథ్యంలో మరిన్ని విజయాలను సాధిస్తూ మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటూ అగ్రరాజ్యాల్లో ఒకటిగా మన దేశాన్ని మారుస్తారనడం కూడా అతిశయోక్తి కాదు.


విచిత్రమేమంటే ఈ పరిణామాన్ని మన దేశంలో ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయి. కరోనా వాక్సిన్‌పై రకరకాల దుష్ప్రచారాలకు లంకించుకుని ప్రజల్లో అశాంతిని రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచమంతా భారత శాస్త్రవేత్తలను కొనియాడుతుంటే, వాక్సిన్‌కు తొందరపడి అనుమతులు ఇచ్చారని, ఇది ప్రమాదకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించడం దారుణం. ఇప్పటికే మైనారిటీలను, రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించిన ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం భారతీయ శాస్త్రవేత్తలను అవమానిస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలనుకుంటున్నాయి.


ఈ దేశ ప్రజలు భారతీయ జనతాపార్టీకి కేవలం భావోద్వేగాల ఆధారంగానే ఓటు వేస్తారని, మత అంశాలపైనే ప్రచారం చేసి బిజెపి రాజకీయ ప్రయోజనం పొందుతుందని ప్రతిపక్షాలు చేసే ప్రచారంలో ఎలాంటి అర్థం లేదు. భారతీయ జనతాపార్టీకి భారతీయత అనేది ప్రధాన సిద్ధాంతం అయినప్పటికీ దేశ ఆర్థికాభివృద్ధికీ, ఈ సైద్ధాంతిక దృక్పథానికీ ఎలాంటి వైరుధ్యం లేదు. కరోనా మహమ్మారి మన దేశంలో ప్రవేశించి ఏడాది పూర్తి కాకముందే మన కంపెనీలు వాక్సిన్‌తో సిద్ధం కావడం, ఆత్మనిర్భర్ పేరిట అనేక పథకాలు. ప్యాకేజీలతో దేశం ఆర్థికంగా క్రుంగిపోకుండా కాపాడడం అభివృద్ధికీ, శాస్త్రీయ దృక్పథానికి మోదీ ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనం. అందుకే గడచిన కొద్దినెలల్లో ఆయన ఈ దేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నో కీలక చర్యలు తీసుకున్నారు. ఒక్క పశుపోషణ రంగంలోనే 2021 జూన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.15వేల కోట్లు కేటాయించారు. జూలైలో మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. రైతు సంఘాలకు ఆర్థిక సహాయం చేయడం కోసం ఆగస్టులో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి రూ.లక్ష కోట్లు కేటాయించారు. సెప్టెంబర్‌లో బిహార్‌లో 14వేల కోట్ల మేరకు జాతీయ రహదారి ప్రాజెక్టులు, పెట్రోలియం ప్రాజెక్టులకు అంకురార్పణ చేయడమే కాక చరిత్రాత్మకమైన కోసీ మహాసేతును ప్రారంభించారు.


సెప్టెంబర్‌లోనే ఆయన దేశంలోని వేలాది మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చే జాతీయ మత్స్యసంపద యోజనను రూ.20వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించారు. అక్టోబర్‌లో సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అతి పొడవైన హైవే సొరంగం అటల్ టన్నెల్‌ను మనాలీలో ఆయన జాతికి అంకితం చేశారు. ఇదే నెలలో స్వమిత్వ పథకం ప్రారంభించి దేశంలో ప్రజలందరికీ ఆస్తి కార్డులను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మోదీ నవంబర్‌లో ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులకు నూతన నివాస బంగళాలను ప్రారంభించారు. డిసెంబర్‌లో పార్లమెంట్ నూతన భవనంతో పాటు దేశ రాజధానికి గర్వకారణంగా నిలిచే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన మోదీ న్యూభావపూర్- న్యూ ఖుర్జా సెక్షన్‌లో వినూత్న రవాణా కారిడార్‌ను ప్రారంభించారు. డిసెంబర్‌లోనే ఆరు రాష్ట్రాల్లో అధునాతనమైన టెక్నాలజీతో కూడిన లైట్‌హౌజ్ ప్రాజెక్టులను, సంబల్‌పూర్‌లో ఐఐటి, రాజ్‌కోట్‌లో ఎయిమ్స్‌ను ప్రారంభించారు. కరోనా మహమ్మారి మనను పీడిస్తున్న దుర్భర సమయంలో కూడా మోదీ కార్యక్రమాల్ని పరిశీలిస్తే వివిధ రంగాల్లో కొన్ని లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన తలపెట్టారని అర్థమవుతుంది.


2020లోనే దేశ ప్రజల మనోభావాలకు ప్రతీకగా నిలిచిన రామమందిర నిర్మాణానికి అయోధ్యలో శంకుస్థాపన చేసిన మోదీ ఇదే ఏడాది దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖల్ని మార్చే కార్మిక వ్యవసాయ సంస్కరణలను చేపట్టారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజల శ్రేయస్సును, దేశ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని దేశ ఆర్థిక, సామాజిక పునర్నిర్మాణాన్ని అనుకున్న సమయంలో అనుకున్న విధంగా అమలు చేయడమే మోదీ సంకల్పం. కొత్త సంవత్సరంలో ద్విగుణీకృత ఉత్సాహంతో ఈ సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.





వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-01-05T05:50:54+05:30 IST