బీజేపీ ఎంపీలతో మోదీ breakfast...లక్నోలో అమిత్ షా rally

ABN , First Publish Date - 2021-12-17T15:30:05+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అగ్ర నేతలైన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు....

బీజేపీ ఎంపీలతో మోదీ breakfast...లక్నోలో అమిత్ షా rally

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అగ్ర నేతలైన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. బీజేపీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు వీలుగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం బీజేపీ ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎంపీలతో జరిగిన అల్పాహార విందు సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ నేతలు ప్రహ్లాద్ జోషి, అర్జున్ మేఘ్వాల్, పి. మురళీధరన్‌లు పాల్గొన్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ మిత్రపక్షమైన నిషాద్ పార్టీతో కలిసి యూపీలో శుక్రవారం మధ్యాహ్నం ‘సర్కార్ బనావో, అధికార్ పావో’ ర్యాలీలో ప్రసంగించనున్నారు.


 లక్నోలో జరిగే ఈ ర్యాలీలో హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవ్ సింగ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ తదితరులు పాల్గొంటారు.డిసెంబర్ నెల చివరి వరకు యూపీలోని మొత్తం 403 నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ఆరు ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇటీవల కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించారు.అక్టోబర్ 20న ప్రధాని మోదీ ఖుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 25న తూర్పు ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రధాని మోదీ ప్రారంభించారు. 



నవంబర్ 16న తూర్పు ఉత్తరప్రదేశ్ జిల్లాలను రాష్ట్ర మధ్య భాగంతో కలిపే మెగా-హైవే ప్రాజెక్ట్ అయిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ఆయన ప్రారంభించారు.డిసెంబర్ 7న ప్రధానమంత్రి మోడీ తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఎయిమ్స్ సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.గోరఖ్‌పూర్‌లో ఒక ఎరువుల కర్మాగారానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.డిసెంబర్ 28న ప్రధాని కాన్పూర్‌లో పర్యటించనున్నారు.

Updated Date - 2021-12-17T15:30:05+05:30 IST