ఈ నెల 20 నుంచి మోదీ కర్ణాటక పర్యటన : CM Basavaraj Bommai

ABN , First Publish Date - 2022-06-18T21:36:14+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20 నుంచి రెండు రోజులపాటు

ఈ నెల 20 నుంచి మోదీ కర్ణాటక పర్యటన : CM Basavaraj Bommai

బెంగళూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20 నుంచి రెండు రోజులపాటు కర్ణాటకలో పర్యటిస్తారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ శనివారం చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలతోపాటు బెంగళూరు, మైసూరులలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం బొమ్మయ్ కొమ్మఘట్టలో విలేకర్లతో మాట్లాడారు. 


ఈ నెల 20, 21 తేదీల్లో మోదీ బెంగళూరు, మైసూరులలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూలు తమకు వచ్చిందన్నారు. ఈ పర్యటన సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. పోలీసులు ప్రధాని భద్రతను పర్యవేక్షించే  స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)తో సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. 


మోదీ ఈ నెల 20న ఉదయం 11.55 గంటలకు బెంగళూరులోని యెలహంక వాయు సేన స్టేషన్‌కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఎయిర్ ఫోర్స్ కమాండ్‌కు వెళ్తారని తెలిపారు. అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో జరిగే రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. IIScలో బ్రెయిన్ సెల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సెంటర్ కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, ఆయన కుటుంబ సభ్యులు రూ.450 కోట్లు విరాళం ఇచ్చారన్నారు. ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ ఏర్పాటు చేస్తున్న 850 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 


IIScలో కార్యక్రమాల తర్వాత మోదీ కొమ్మఘట్టలో బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.15,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాతే దీనిపై గట్టి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇది బెంగళూరు, దాని శివారు ప్రాంతాల ప్రజలకు మోదీ ఇచ్చే గొప్ప కానుక అని పేర్కొన్నారు. నేషనల్ హైవే ప్రాజెక్టులతోపాటు ఆరు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. డోబుస్‌పేట్ నుంచి హోస్కేటో వరకు శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత మైసూరులో జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం చాముండి హిల్స్‌లో చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. అనంతరం సుత్తూరు మఠాన్ని సందర్శిస్తారని చెప్పారు. 


జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాల సందర్భంగా మైసూరు పేలస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 

Updated Date - 2022-06-18T21:36:14+05:30 IST