సోనోవాల్ ఇంటి వద్ద డోలు వాయించిన మోదీ

ABN , First Publish Date - 2022-04-24T16:43:32+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రొంగలి బిహు

సోనోవాల్ ఇంటి వద్ద డోలు వాయించిన మోదీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రొంగలి బిహు పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అస్సాం సహజసిద్ధ స్థానికులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా మోదీ కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ నివాసానికి వెళ్లి, అందరికీ రొంగలి బిహు శుభాకాంక్షలు తెలిపారు. 


రొంగలి బిహు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా ఈ కార్యక్రమాలను వీక్షించారు. అస్సాం కళాకారులు ప్రదర్శించిన బిహు నృత్యాన్ని, ఇతర కార్యక్రమాలను తిలకించారు. సర్బానంద్ సోనోవాల్‌తో కలిసి డోలు, కొమ్ము బూరలను వాయించారు. మోదీ నవ్వుతూ ఈ వాద్య పరికరాలను వాయిస్తూ ఉంటే సర్బానంద్ సోనోవాల్ సంతోషంతో కరతాళ ధ్వనులు చేశారు.


అనంతరం మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నా మంత్రివర్గ సహచరుడు సర్బానంద సోనోవాల్ నివాసంలో బిహు ఉత్సవాల్లో పాల్గొన్నాను. అద్భుతమైన అస్సాం సంస్కృతి భారత దేశానికి గర్వకారణం’’ అని పేర్కొన్నారు. 


సోనోవాల్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఉత్సవాల్లో పాల్గొనడంతో ఆయనకు అస్సామీ ప్రజల పట్ల, అస్సామీ సంస్కృతి పట్ల గల ప్రేమాభిమానాలు వ్యక్తమైనట్లు తెలిపారు. బిహు ఉత్సవాలకు హాజరై, ఆశీర్వదించినందుకు తాను క‌ృతజ్ఞుడినని తెలిపారు. గడచిన ఎనిమిదేళ్ళలో అస్సాం సర్వతోముఖాభివృద్ధి కోసం ఆయన చూపిన చొరవ, శ్రద్ధాసక్తులు సాటిలేనివని పేర్కొన్నారు. 


అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఆనందోత్సాహాలతో కూడిన క్షణాలు! మన బిహు డోలు, పెపా (కొమ్ము బూర)లను గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వాయిస్తుండటం చూసి ప్రతి అస్సామీ హృదయం ఆనందంతో నిండిపోయింది’’ అని పేర్కొన్నారు. 


సోనోవాల్ నివాసంలో బిహు ఉత్సవాల్లో పాల్గొన్నవారిలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నరేంద్ర సింగ్ తోమర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తదితరులు ఉన్నారు. 


అస్సామీల నూతన సంవత్సరం సందర్భంగా రొంగలి బిహు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలను ఏప్రిల్ 14 నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తారు. పంట కోతల సమయం ప్రారంభం సందర్భంగా దీనిని జరుపుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా ఆవులకు పూజలు చేస్తారు.  ఏప్రిల్ 14న ప్రధాని మోదీ బిహు సందర్భంగా అస్సామీలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఆయురారోగ్యాలు, సంతోషం కలగాలని ఆకాంక్షించారు. 


Updated Date - 2022-04-24T16:43:32+05:30 IST