ప్రధాని మోదీ పర్యటనపై ఎస్‌పీజీ నిఘా

ABN , First Publish Date - 2022-06-29T06:45:16+05:30 IST

అల్లూరి సీతారామరాజు 125 జయంత్యుత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4న భీమవరం వస్తున్నందున పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని భారత జాతీయ భద్రతా విభాగం ఎస్‌పీజీ ఏఐజీ హిమాన్షుగుప్తా అధికారులను ఆదేశించారు.

ప్రధాని మోదీ పర్యటనపై ఎస్‌పీజీ నిఘా
పెదఅమిరం మైదానం ప్రాంతంలో మాట్లాడుతున్న ఎస్పీజీ బృందం, కలెక్టర్‌ ప్రశాంతి

ఏర్పాట్ల పరిశీలన.. అధికారులకు సూచనలు

భీమవరం, జూన్‌ 28 : అల్లూరి సీతారామరాజు 125 జయంత్యుత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4న భీమవరం వస్తున్నందున పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని భారత జాతీయ భద్రతా విభాగం ఎస్‌పీజీ ఏఐజీ హిమాన్షుగుప్తా అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మంగళవారం పెద అమిరంలో ఎంపిక చేసిన హెలీప్యాడ్‌ స్థలం, బహిరంగ వేదిక స్థలాలను కేంద్ర కల్చరల్‌ డైరెక్టర్‌ అతుల్‌ మిశ్రా, కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్‌లతో ఎస్పీజీ బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఐజీ హిమాన్షుగుప్త మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, సెక్యూరిటీ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు.  

మూడు ప్రాంతాల్లో పరిశీలన..

పెద అమిరం వద్ద ఎంపిక చేసిన స్థలాలు వర్షపు నీటితో ఉండడాన్ని సెక్యూరిటీ గమనించి నీరు వెంటనే తొలగించేలా చూడాలని ఆదేశించింది. అక్కడి నుంచి డీఎన్నార్‌ క్యాంపస్‌కు వెళ్లి మైదానాన్ని పరిశీలించారు. తదుపరి విష్ణు విద్యా సంస్థల క్యాంపస్‌కు వెళ్లి క్రీడా మైదానం తిలకించారు. ఎస్‌పీజీ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీఐజీ పాలరాజు, సెక్యూరిటీ ఐజీ శశిధర్‌రెడ్డి, ఎస్పీ యు.రవిప్రకాష్‌, ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రబాబు, కోనసీమ జిల్లా ఎస్పీ సుదీప్‌కుమార్‌రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా, జేసీ జేవీ మురళి, నరసాపురం సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ అధికారులు ఉన్నారు. 

అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్‌ 

భీమవరం, జూన్‌ 28 : మోదీ పర్యటన రోజున వర్షం వచ్చినా కార్యక్రమానికి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం విష్ణు క్యాంపస్‌ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులకు కేటాయించిన విధులను తమ శాఖ పరిధిలో మైక్రోప్లాన్‌ చేసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. మంచినీటి వసతులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, మొబిలైజేషన్‌ తదితర ఏర్పాట్లను సమీక్షించారు. 

Updated Date - 2022-06-29T06:45:16+05:30 IST