పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మోదీ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-04-27T23:43:40+05:30 IST

ఉస్ణోగ్రతలు పెరుగుతుండటంతోపాటు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న

పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మోదీ హెచ్చరిక

న్యూఢిల్లీ : ఉస్ణోగ్రతలు పెరుగుతుండటంతోపాటు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలను హెచ్చరించారు. దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిపై బుధవారం వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, ప్రజోపయోగకరమైన ఇతర భవనాల్లో ఫైర్-సేఫ్టీ ఆడిట్స్ నిర్వహించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 


మన దేశంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని, మామూలుగా కన్నా చాలా త్వరగానే ఈ పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. అడవులు, ముఖ్యమైన భవనాలు, ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు పెరుగుతుండటం ఇటీవల మనం చూస్తున్నామన్నారు. 


ఈ సమావేశం ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందు తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. 33 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. మరోవైపు ఢిల్లీలో గురువారం 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 


రానున్న ఐదు రోజుల్లో తూర్పు, మధ్య, వాయవ్య భారత దేశంలో వడగాడ్పుల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాలలు, వృద్ధులు, తీవ్ర స్థాయిలో వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. 


ఇటీవల తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ వద్ద ఉన్న చెత్తను నిల్వ చేసే స్థలంలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. అదే విధంగా భల్సాలోని డంప్‌యార్డులో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇప్పటికే తీవ్ర కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ నగరవాసులు మరిన్ని ఇబ్బందులకు గురయ్యారు. 


ఉత్తరాది, ముంబై ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో కూడా ఇటీవల అగ్ని ప్రమాదాలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 1 నుంచి 500కుపైగా అటవీ దహనాలు నమోదయ్యాయి. 3,575 హెక్టార్లలో అడవులు నాశనమయ్యాయి. ఈ వారంలో హర్యానాలోని ఓ మురికివాడలో అగ్ని ప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2022-04-27T23:43:40+05:30 IST