
న్యూఢిల్లీ : మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన అసాధారణ నాయకత్వం, సాంఘిక సంక్షేమం పట్ల ఆయన వైఖరి అనేక తరాల ప్రజలకు ప్రేరణనిస్తాయన్నారు. ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాల సందర్భంగా మోదీ శనివారం ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు.
ఛత్రపతి శివాజీ దార్శనికతను, స్వప్నాన్ని సాకారం చేయడం కోసం తన ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సత్యం, న్యాయం విలువల కోసం ఆయన దృఢ వైఖరితో నిలిచారని కొనియాడారు.
ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కూడా ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు నివాళులర్పించారు. మరాఠా యోధుడు, సుప్రసిద్ధ మహారాజు ఛత్రపతి శివాజీకి ఆయన జయంత్యుత్సవాల సందర్భంగా నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన సాటిలేని ధైర్యసాహసాలకు ప్రతీక అని, అసాధారణ యుద్ధ వ్యూహాలకు ప్రసిద్ధి చెందినవారని కొనియాడారు. ఆయన ఆధునిక భావాలుగల పరిపాలకుడని పేర్కొన్నారు. మాతృభూమి పట్ల ఆయన ప్రదర్శించిన ప్రేమాభిమానాలు ప్రతి భారతీయునికి ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ 1630లో జన్మించారు. ఆయనకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి