Bjpలో ఉత్సాహం నింపిన ప్రధాని పర్యటన

ABN , First Publish Date - 2022-05-27T13:49:54+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీలో గతంలో ఎన్నడూ లేనంత జోష్‌ నింపింది. గతంలో పలుమార్లు ప్రధాని పర్యటించినప్పటికీ .. ఈసారి ఆయన రాకకు ప్రజల

Bjpలో ఉత్సాహం నింపిన ప్రధాని పర్యటన

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీలో గతంలో ఎన్నడూ లేనంత జోష్‌ నింపింది. గతంలో పలుమార్లు ప్రధాని పర్యటించినప్పటికీ .. ఈసారి ఆయన రాకకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చినట్లు కనిపిస్తోంది. వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన చారిత్రక ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, అంతకంటే మిన్నగా పలు ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడం తదితరాలను రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విస్త్రతంగా ప్రచారం చేసింది. అంతేగాక మోదీ ప్రసంగంలో సైతం తమిళ భాషను, తమిళ సంస్కృతీ సంప్రదాయాలను ప్రశంసించడం, రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల పేర్లను అవలీలగా ఉచ్ఛరించడం తదితర అంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేగాక మెరీనాబీచ్‌ రోడ్డు సమీపంలోని అడయార్‌ ఐఎన్‌ఎ్‌స హెలిప్యాడ్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం వరకు దారి పొడవునా బీజేపీ కార్యకర్తలతో పాటు సాధారణ పౌరులు సైతం రోడ్డుకిరువైపులా నిలబడి ప్రధానికి స్వాగతం పలకడం విశేషం. అన్నాడీఎంకే కార్యకర్తలు సైతం పోటీపడి మోదీకి స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వాహనం వెళ్లేటప్పుడు ఆమె దృష్టిలో పడేందుకు ఒకప్పుడు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు పోటీ పడేవారు. గురువారం మోదీ రాక సందర్భంగానూ పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలు ఇదే విధంగా మోదీ వాహనం దరి చేరేందు కు పోటీ పడ్డారు. ఆయన దృష్టిలో పడేందుకు వంగి వంగి దండాలు పెడుతూ ఆయన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించడం విశేషం. కొన్నిమార్లు వారిని అదుపు చేయడం పోలీసులకు శక్తికి మించిన భారంగా మారింది. నిజానికి ప్రజల నుంచి ఇంత స్పందన రావడం బీజేపీ నేతల్ని సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మోదీకి అపూర్వ స్వాగతం లభించడం, అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రావడం పట్ల బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 


బీజేపీ వలలో చిక్కామా?..

డీఎంకేలో అంతర్మథనం!

రూ.2900 కోట్లతో పూర్తయిన రాష్ట్రానికి చెందిన ఐదు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు ‘లైట్‌ హౌస్‌ ప్రాజెక్టు’ కింద రూ.116 కోట్లతో నిర్మించిన 1,152 గృహాలను ప్రధాని గురువారం ప్రారంభించారు. అదే విధంగా రూ.28,500 కోట్లతో చేపట్టనున్న ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో కొంతమేరకు రాష్ట్ర వాటా వున్నప్పటికీ మొత్తం కేంద్రప్రభుత్వ పథకాలే అన్న తరహాలో విస్త్రత ప్రచారం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్రేమీ లేదన్న విధంగా ప్రజల్లోకి ప్రచారం వెళ్లింది. గురువారం కార్యక్రమాలన్నీ ప్రధాని చుట్టూనే తిరిగాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం చుట్టూ ప్రధాని వాల్‌పోస్టర్లు, బీజేపీ తోరణాలే కనిపించాయి తప్ప, పెద్దగా డీఎంకే ప్రభావం కనిపించలేదు. వేదికపైనా ప్రధాని ఆధిక్యతే కనిపించింది. మోదీ వేదికపైకి వస్తూనే మొత్తం కలియ తిరుగుతూ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేయడంతో పాటు తలొంచి మరీ నమస్కరించడంతో సభికులు అరుపులు, కేకలు, కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ జోష్‌తో డీఎంకే నేతలు డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. తాము అధికారం చేపట్టిన తరువాత తొలిసారిగా ప్రధాని వస్తుండడంతో బీజేపీ స్వాగత ఏర్పాట్లకు అన్ని విధాలా సహకరించాలని ఆదిలోనే డీఎంకే నేతలు భావించారు. అయితే ఈ ‘సహకారం’ బీజేపీ బలోపేతానికి, ప్రజల్లో ఆ పార్టీ చొచ్చుకుపోవడానికి కొంతమేర దోహదపడినట్లు డీఎంకే నేతలు అనుమానిస్తున్నారు. దీంతో బీజేపీ వలలో చిక్కామా?.. ప్రాజెక్టుల కార్యక్రమం పేరుతో బీజేపీ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా విస్త్రత ప్రచారం పొందిందా అని డీఎంకే నేతలు లోలోన మథనపడుతున్నారు. స్టేడియానికి వచ్చిన డీఎంకే సీనియర్‌ నేతలు సైతం కాస్త అసహనంగానే కనిపించడం గమనార్హం. బహుశా సీఎం స్టాలిన్‌ సైతం దీనిని గ్రహించడం వల్లనే వేదికపై ఎక్కడా ప్రధానిని కించిత్‌ కూడా ప్రశంసించకుండా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఏకరువు పెట్టినట్లు రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నేతలు మాత్రం పూర్తి జోష్‌లో కనిపించారు.

Updated Date - 2022-05-27T13:49:54+05:30 IST