మోదీజీ...మీ ఫ్రండ్ అబ్బాస్ ఉంటే ఆమాట అడగండి: Owaisi

ABN , First Publish Date - 2022-06-20T21:47:30+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై నూపర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎంఐఎం అధినేత..

మోదీజీ...మీ ఫ్రండ్ అబ్బాస్ ఉంటే ఆమాట అడగండి: Owaisi

న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై నూపర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. నూపర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని మోదీ తన చిన్ననాటి మిత్రుడుగా చెప్పుకుంటున్న అబ్బాస్‌ను అడగాలని అన్నారు.


మోదీ తన తల్లి హీరాబెన్ 99వ పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లాగ్‌ పోస్ట్‌లో అబ్బాస్‌తో తనకున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ''మా తండ్రిగారి సన్నిహత మిత్రుడు ఒకరు మా పొరుగు గ్రామంలో ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత మా నాన్నగారు తన మిత్రుడి కొడుకుని ఇంటికి తీసుకువచ్చాడు. అతను మాతోనే ఉండి చదువుకున్నాడు. అబ్బాస్‌ను మా అమ్మ ఎంతో ప్రేమగా చూసుకునేది. మమ్మల్ని కవలలుగా చూసేది. ఏటా ఈద్ రోజు అబ్బాస్‌కు ఇష్టమైన వంటకాలను అమ్మ చేసిపెట్టేది'' అని మోదీ ఆ బ్లాగ్‌లో రాశారు.


దీనిపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. ''ప్రధానికి ఎనిమిదేళ్ల తర్వాత తన మిత్రుడు గుర్తుకొచ్చాడు. ఇలాంటి మిత్రుడు మీకు ఉన్నాడని మాకు తెలియదు. మేము ప్రధానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అబ్బాస్‌కు ఫోను చేసి అసదుద్దీన్ ఒవైసీ, ఉలేమాలు (మతపెద్దలు) చేసిన ప్రసంగాలు వినిపించండి. మేము అబద్ధాలు ఆడుతున్నామా అనేది అడిగి తెలుసుకోండి. మీరు మీ  ఫ్రెండ్ అడ్రెస్ చెప్పినా చాలు. నేనే వెళ్లి అబ్బాస్‌ను కలుస్తాను. మహమ్మద్ ప్రవక్తపై నూపర్ శర్మ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేవా అనే విషయం నేనే అడుగుతాను. ఆయన కూడా నూపర్ శర్మ వ్యాఖ్యలు నిరపయోగమైనవని అంగీకరిస్తారు'' అని ఒవైసీ అన్నారు. ప్రధాని తన ఫ్రెండ్‌ను  గుర్తు చేసుకున్నారని, అది ఒక కథ కూడా కావచ్చని, అవునో కాదో తనకెలా తెలుస్తుందని ఒవైసీ ప్రశ్నించారు.

Updated Date - 2022-06-20T21:47:30+05:30 IST