పీఎం స్వనిధి రుణం.. వీధి వ్యాపారులకు వరం

ABN , First Publish Date - 2022-08-17T04:15:20+05:30 IST

వీధి వ్యాపారులకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి ఆత్మ నిర్భర్‌ పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్ల క్రితం కరోనా కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు బ్యాంకుల ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా నేరుగా 10వేల రూపా యలు మంజూరు చేశారు. మొదట్లో కొందరే ముందుకు రాగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు మెప్మా ఆధ్వర్యంలో సిబ్బంది రంగంలోకి దిగారు

పీఎం స్వనిధి రుణం.. వీధి వ్యాపారులకు వరం
లోగో

- మున్సిపాలిటీలో 3,168 మంది గుర్తింపు 

- మొదటి విడతలో 2,800 మందికి రుణం మంజూరు 

- వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికే రెండో విడత

కాగజ్‌నగర్‌, ఆగస్టు 16: వీధి వ్యాపారులకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి ఆత్మ నిర్భర్‌ పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్ల క్రితం కరోనా కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు బ్యాంకుల ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా నేరుగా 10వేల రూపా యలు మంజూరు చేశారు. మొదట్లో కొందరే ముందుకు రాగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు మెప్మా ఆధ్వర్యంలో సిబ్బంది రంగంలోకి దిగారు. వీధి వ్యాపారం చేసే చోటుకు వెళ్లి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో ఎక్కువ మందికి రుణాలు అందించారు. తీసుకున్న రుణం ఏడాదిలోపు చెల్లించాల్సి ఉంటుంది. వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి మళ్లీ 20వేల రూపాయల రుణం ఇచ్చారు. 

మెప్మా ఆధ్వర్యంలో సర్వే..

పీఎం స్వనిధికి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మున్సిపాలిటీలో  పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సిబ్బంది  సర్వే నిర్వహించారు. పూర్తి వివరాలు తీసుకొని వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. లావాదేవీలు, ఇతరాత్ర అంశాలపై కూలంకుషంగా చేసిన తర్వాతనే సంబంధిత వివరాలు నేరుగా బ్యాంకుకు పంపిస్తారు. అనంతరం బ్యాంకు వారు నేరుగా సంబంధిత ఖాతాల్లో 10వేల రూపాయలు జమ చేస్తారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 3,168 మందిని ఎంపిక చేశారు. ఇందులో 2,800 వ్యాపారులకు 10వేల రూపాయల రుణాన్ని ఎలాంటి పూచికత్తు లేకుండా 2.80కోట్ల రూపాయల రుణాన్ని చిరువ్యాపారులకు అందజేశారు. 12 వాయిదాల్లో ఈ రుణాన్ని 1,743 మంది చెల్లించారు. మిగితా వారు కూడా దశల వారీగా చెల్లిస్తున్నారు. 

రెండో విడతలో..

మొదటి విడతలో వాయిదాలు చెల్లించన వారికి రెండో విడతలో సైతం రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండో దఫాలో 20వేల రూపాయల రుణం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి 1,743 మందిని గుర్తించారు. ఈ మేరకు రూ.3.48కోట్ల మేర రుణాన్ని వివిధ బ్యాంకుల ద్వారా వీధి వ్యాపారం చేసుకునే వారికి అందజేశారు. నిర్ణీత కాలంలో రుణం చెల్లిస్తే వారికి ప్రొత్సాహకంగా 7 శాతం వడ్డీ రాయితీ అమలు చేస్తున్నారు. వీటితో పాటు క్యూఆర్‌ కోడ్‌తో డిజిటిల్‌ లావాదేవీలు నిర్వహిస్తే నెలకు 100 నుంచి 300 రూపాయల వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా వర్తింప జేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు క్యాష్‌ బ్యాక్‌ రూపంలో 2లక్షల రూపాయల మేర వీధి వ్యాపారుల ఖాతాల్లో జమ అయ్యాయి. లబ్ధిదారుల రుణం చెల్లింపులను ఎప్పటిక ప్పుడు తనిఖీ చేసేందుకు ప్రభుత్వం కమ్యూనిటీ బెస్ట్‌ రివకరీ మెకానిజం(సీఆర్‌ఎం) సెల్‌ యాప్‌ అందుబాటులోకి తెచ్చింది. దీని ఆధారంగా రుణ వాయిదాలు చెల్లించని వీధి వ్యాపారిని సంప్రదించి అవగాహన కల్పిస్తున్నారు. రెండో విడతల రుణాల వాయిదాలను సక్రమంగా చెల్లిం చిన వారికి 50వేల రూపాయలు అందజేసేందుకు 15 రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 వడ్డీ రాయితీ ఇచ్చారు..

- రమేశ్‌, చిరువ్యాపారి, కాగజ్‌నగర్‌ 

నాకకు పీఎం స్వనిధి పథకం కింద తొలుత 10వేల రూపాయలు రుణం మంజూరు చేశారు. వాయిదాలు సక్రమంగా చెల్లిస్తే  7 శాతం వ డ్డీ రాయితీ కల్పించారు. రెండో విడతలో 20వేల రుణం మంజూరు చేశా రు. బ్యాంకు నుంచి పూచికత్తు లేకుండా ఇవ్వడంతో ఇబ్బందులు లేవు. 

వాయిదాలు సక్రమంగా చెల్లిస్తే మేలు..

-జె.మోతీరాం, డీఎంసీ (డిస్ట్రిక్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌), కాగజ్‌నగర్‌

చిరు వ్యాపారులు తీసుకున్న రుణం వాయిదాలు సక్రమంగా చెల్లిస్తే మేలు జరుగుతుంది. భవిష్యత్తులో మరో రుణం పొందేందుకు ఇబ్బం దులు లేకుండా ఉంటుంది. రెండో విడత రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి 50వేల రూపాయలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.  

Updated Date - 2022-08-17T04:15:20+05:30 IST