‘పొద్దు’తిరిగేనా..!

Published: Fri, 20 May 2022 00:19:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పొద్దుతిరిగేనా..!మావిళ్ళవారిపల్లె వద్ద కోతకొచ్చిన పొద్దుతిరుగుడు పంట

నాడు కళకళ.. నేడు వెలవెల 

కనుమరుగవుతున్న సన్‌ఫ్లవర్‌ పంట

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆకాశాన్నంటుతున్న నూనె ధరలు


ములకలచెరువు, మే 19: ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంతో నూనె ధరలకు రెక్కలొచ్చాయి. పొద్దుతిరుగుడు నూనె సలసల కాలుతోంది. నిత్యం ఽధర పెరుగుతూనే ఉంది. కారణం యుద్ధ దేశాలపై ఆధారపడడమే. మన దగ్గర వేలాది ఎరకాల్లో సాగయ్యే పొద్దుతిరుగుడు పంట ప్రస్తుతం ఎక్కడా కనపడడం లేదు. ఒకప్పుడు ఊరూరా పొద్దుతిరుగుడు పంట పండించిన రైతులు ఇప్పుడు దూరమయ్యారు. ప్రస్తుతం మార్కెట్లలో పొద్దుతిరుగుడు పంటకు మంచి ధర ఉన్నా పంట మాత్రం ఎక్కడా సాగవ్వలేదు. రైతులు పొద్దుతిరుగుడు సాగుకు సంశయిస్తున్నారు. నాటి నష్టాలను తలచుకుని పంట సాగుకు భయపడుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు, తంబళ్ళపల్లె, పెద్దతిప్పసముద్రం, కురబలకోట, పెద్దమండ్యం, బి.కొత్తకోట మండలాల్లో 13 ఏళ్ల క్రితం పొద్దుతిరుగుడు పంట వేలాది ఎకరాల్లో సాగయ్యేది. పంట సాగుతో గ్రామాలు కళకళలాడేవి. ఎక్కడ చూసినా పసుపు పంటతో పచ్చదనం పరుచుకునేది. అంత స్థాయిలో పండిన పొద్దుతిరుగుడు పంట ప్రస్తుతం వెతికినా కన్పించడం లేదు. వేలాది ఎకరాల్లో పండిన పంట ప్రస్తుతం కనుమరుగైంది. అక్కడక్కడ ఒకరిద్దరు రైతులు మాత్రమే పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా పొద్దుతిరుగుడు నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పొద్దుతిరుగుడు పంట సాగు తెరమీదకు వచ్చింది. మార్కెట్‌లో ఈ పంటకు ధరలు బాగున్నా రైతులు సాగుకు ఆసక్తి చేపకపోవడం గమనార్హం. గతంలో పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 

మావిళ్లవారిపల్లెలో అరకొరగా సాగు

ములకలచెరువు మండలం దేవళచెరువు పంచాయతీ మావిళ్లవారిపల్లె వద్ద అరకొరగా పంట సాగైంది. పలువురు రైతులు నామమాత్రంగా ఐదు ఎకరాల్లో పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. పొద్దుతిరుగుడు ఎకరా సాగు చేస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఖర్చవుతోంది. పంట సాగు చేసిన మూడు నెలలకు కోతకొస్తుంది. ఎకరాకు 8-10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం సాగు చేస్తున్న అన్ని పంటల కంటే ఇది పెట్టుబడి తక్కువే. మూడు నెలలకు ముందు క్వింటా ధర రూ.2 వేల నుంచి రూ.3 వేలు మాత్రమే పలికేది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా ధర రూ.6 వేల నుంచి రూ.7 వేలు పలుకుతోంది. 

ఆకాశాన్నంటుతున్న నూనె ధరలు

ప్రస్తుతం సన్‌ఫ్లవర్‌ నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం జరగకముందు లీటర్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రూ.140 నుంచి రూ.145 వరకు ఉండేది. ప్రస్తుతం లీటరు ధర రూ.200కు చేరింది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై నూనె ధర అధిక ప్రభావం చూపుతోంది. 


పెట్టుబడి తక్కువ.. శ్రమ ఎక్కువ..

పొద్దుతిరుగుడు పంట సాగు చేసేందుకు పెట్టుబడి తక్కువగా ఉన్నా శ్రమ ఎక్కువగా ఉంటుంది. రెండు నెలల పాటు పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు జాగారం చేయాల్సి ఉంటుంది. పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అర ఎకరా పంట సాగు చేశా. ఐదు క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. 

- కె.అర్జున, రైతు, మావిళ్లవారిపల్లె, ములకలచెరువు మండలం


నూనె పంటల సాగుపై అవగాహన..

నూనె పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తాం. ఖరీ్‌ఫలో నీటి సౌకర్యం ఉన్న పొలా ల్లో ఒకే పంట సాగు చేయకుండా పంట మార్పిడి చేసి సన్‌ఫ్లవర్‌, ఆముదాలు, కుసుమాల పంట సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. వచ్చే రబీకి బోర్ల కింద నూనె పంటలు సాగు చేసుకునేలా రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దోస, ఖర్భూజ పంటలు సాగు చేసే రైతులు నూనె రకాల పంటలు సాగు చేస్తే దిగుబడులు అధికంగా వస్తాయి. ములకలచెరువు మండలంలో సన్‌ఫ్లవర్‌ పంట సాగు పూర్తిగా తగ్గింది. మండలం అంతా తీసుకున్నా కనీసం పది ఎరకాల్లో కూడా సాగుకు నోచుకోలేదు. 

- రమణకుమార్‌, వ్యవసాయశాఖాధికారి, ములకలచెరువు మండలం

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.