పోడు.. పోరు...

ABN , First Publish Date - 2021-02-27T05:57:19+05:30 IST

ఆదివాసీల బతుకులు ఆగమవుతున్నాయి. ప్రకృతికి దగ్గరగా అడవినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీల పోడు గోడు తీర్చే ప్రయత్నాలేవీ ప్రభుత్వం చేపట్టడం లేదు. దీంతో వారి భూముల్లో అటవీశాఖ రట్రెంచ్‌తో సాగుకు చెక్‌ పెడుతోంది. కేసులతో ఆదివాసీలు కోర్టులు చుట్ట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. సాగు భూమి లేక.. కేసుల్లోంచి బయట పడలేక.. గిరిజనుల్లో ఆత్మస్తైర్యం దెబ్బతింటోంది. మరోవైపు పోడు గోడు భరించలేక గిరిజన మహిళ ఆత్మహత్యతో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది.

పోడు.. పోరు...
గొత్తికోయల గుడిసెలను ధ్వంసంచేస్తున్న దృశ్యం(ఫైల్‌)

అడవుల్లో భూములపై హక్కుల కోసం గిరిజనుల పోరాటం
ఏళ్ల తరబడి కాస్తులో ఉన్నా వర్తించని హక్కులు
పట్టాలిచ్చిన కొన్ని చోట్ల సాగు చేయకుండా అటవీ శాఖ అడ్డంకులు
వేధింపులు, కేసులతో మనస్తాపం చెందుతున్న ఆదివాసీలు
గిరిజన మహిళ ఆత్మహత్యతో ఏజెన్సీలో ఉద్రిక్తత


ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి : ఆదివాసీల బతుకులు ఆగమవుతున్నాయి. ప్రకృతికి దగ్గరగా అడవినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీల పోడు గోడు తీర్చే ప్రయత్నాలేవీ ప్రభుత్వం చేపట్టడం లేదు. దీంతో వారి భూముల్లో అటవీశాఖ రట్రెంచ్‌తో సాగుకు చెక్‌ పెడుతోంది. కేసులతో ఆదివాసీలు కోర్టులు చుట్ట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. సాగు భూమి లేక.. కేసుల్లోంచి బయట పడలేక.. గిరిజనుల్లో ఆత్మస్తైర్యం దెబ్బతింటోంది. మరోవైపు పోడు గోడు భరించలేక గిరిజన మహిళ ఆత్మహత్యతో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది.
రాష్ట్రంలోనే అత్యధికంగా భూపాలపల్లి-ములుగు జిల్లాల్లో అత్యధికంగా అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిలో భూపాలపల్లి జిల్లాలో 1,69,244 ఎకరాల్లో అటవీ భూములు ఉన్నాయి.  భూపాలపల్లి డివిజన్‌లో 90,620 ఎకరాలు, మహదేవపూర్‌ డివిజన్‌లో 78,624 ఎకరాల్లో అడవులు ఉన్నాయి. ములుగు జిల్లాలో నాలుగు అటవీ డివిజన్‌లు ఉన్నాయి. వీటిలో ములుగు డివిజన్‌లో 57,843 ఎకరాలు, తాడ్వాయి డివిజన్‌లో 83,183 ఎకరాలు, ఏటూరునాగారం 79,140 ఎకరాలు, వెంకటాపురం డివిజన్‌లో 84,076 ఎకరాల్లో అటవీ భూములు ఉన్నాయి. ములుగు జిల్లాలో 3,04,241 ఎకరాల అటవీ భూమి ఉంది. భూపాలపల్లి, ములుగు జిల్లాలో మొత్తంగా 4,73,485 ఎకరాల్లో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి.

ఆదివాసీలు వర్సెస్‌ అటవీశాఖ
పోడు పేరుతో ఆదివాసీలు అడవిలో చెట్లను నరికి వేస్తున్నారని అటవీ శాఖ కన్నెర్రజేస్తోంది. అయితే కొత్తగా పోడు చేసుకోవటం లేదని, పాతవాటినే సాగు చేసుకుంటున్న అటవీ శాఖ దాడులు, కేసులతో వేదింపులకు దిగుతోందని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామ శివారు రాయబంధంలో గిరిజన మహిళ పదం ఎర్రమ్మ (38)  ఆత్మహత్మకు అటవీశాఖ అధికారుల వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం రుద్రారం గ్రామ పంచాయతీ శివారు చీగురుపల్లిలో 2006లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 25 మంది గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి మూడున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు పట్టాలు ఇచ్చారు. పదేళ్ల వరకు ఆ భూముల్లో రైతులు సాగు చేసుకున్నారు. అయితే ఆ పట్టాలు చెల్లవని అటవీ శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వర్షాకాలంలో హరితహారం మొక్కలు నాటేందుకు ప్రయత్నించగా, అటవీ శాఖ అధికారులకు, గిరిజనులకు మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో ఆరుగురిపై  కేసు నమోదు చేయటంతో వారు కోర్టుల చుట్టూ తిరుగాల్సి వస్తోందని అంటున్నారు.  

అలాగే పలిమెల మండలం ముకునూరు, కిష్టాపూర్‌ గ్రామాల పరిధిలోని రెండు వేల ఎకరాల పోడు భూములపై ఆందోళన సాగుతోంది. గత పదేళ్లకు పైగా పట్టాలు ఇవ్వాలని ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఛత్తీ్‌సగఢ్‌ నుంచి పదేళ్ల కిందట పలిమెల మండల కేంద్రానికి వచ్చి స్థిరపడిన 30 కుటుంబాలు ఏర్పాటు చేసుకున్న గుడెసెలను తొలింగించేందుకు వారం రోజుల కిందట అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో ఓ గిరిజన మహిళపై అటవీ శాఖ అధికారులు దాడి చేసి, చితకబాదారని గిరిజనులు ఆందోళనకు దిగారు.  మహముత్తారం మండలం కునుకునూరులో శివారులో కొత్తూరులో ఇటీవల గిరిజనులు వేసుకున్న 80 గుడిసెలను తొలిగించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా, గిరిజనులు ఎదురుతిరిగారు. అలాగే గిరిజనులు సాగు చేసుకుంటున్న 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడ ఉద్రిక్తతను పెంచుతున్నాయి.

ఇక ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి, మల్యాల, చిన్నబోయినపల్లి, రాయబంధం, షాపల్లి, చెల్పాక, అల్లంవారిఘనపురం, శివాపురం, ముల్లకట్ట, రాంపూర్‌ తదితర గ్రామాల్లో పోడు భూముల లొల్లి నిత్యకృత్యమైంది. సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూముల్లో గిరిజనులకు, అటవీ శాఖ అధికారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొందరికి ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టాలు ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు వాటిని లాక్కొని పొలా ల్లో కందకాలు తవ్వుతూ.. సాగుకు అడ్డుపడుతున్నారని గిరిజనులు అంటున్నారు.  తాడ్వాయి మం డలం బందాలలో 2,500 ఎకరాల పోడు భూమి సమస్య తిష్టవేసే ఉంది. లింగాల పరిధిలో 300 ఎకరాల గొడవ కొనసాగుతోంది.   కన్నాయిగూడెం మండలం పరిధిలో ముప్పనపల్లి, సర్వాయి, బుట్టాయిగూడెం, చింతగూడెం తదితర గ్రామా ల్లో 30ఏళ్లకు పైగా సాగులో ఉన్న గిరిజనుల భూములను లాక్కోవటంతో పాటు 15మందికిపైగా కేసులు నమోదు చేశారు.     భూపాలపల్లి, ములుగు జిల్లాలో సుమారు 25వేల నుంచి 30వేల ఎకరాల వరకు పోడు భూముల సమస్య గిరిజనులు వర్సెస్‌ అటవీ శాఖగా మారింది.

కేసీఆర్‌ చేతిలోనే భవితవ్యం
 పోడు భూముల సమస్య పరిష్కారానికి కొంతకాలంగా గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొంతమంది గిరిజనులకు పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చింది. అయితే చాలామంది గిరిజనులకు అవి అందలేదు. మరో విడతలో హక్కు పత్రాలు ఇచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి  వైఎ్‌స.రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల ముందు పోడు భూముల సమస్య పరిష్కారిస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ములుగులో జరిగిన బహిరంగ సభలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తానే ములుగులో కుర్చీ వేసుకొని కూర్చొని పోడు సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికి కేసీఆర్‌ హామీ కూడా అమలు కావటం లేదు. కనీసం పోడు సమస్య పరిష్కరించేందుకు ఆ దిశగా అడుగుల పడటం లేదు. దీంతో గిరిజనుల్లో ఆందోళన వ్యకమవుతోంది.  


చర్చనీయాంశంగా మారిన హెచ్చార్సీ నోటీసులు
ములుగు, ఫిబ్రవరి 26: పోడు భూముల విషయంలో అటవీశాఖ అధికారుల తీరుతో మనస్థాపానికి గురై ఏటూరునాగారం మండలంలోని రాయబంధం గొత్తికోయ గుంపుకు చెందిన పదం ఎర్రమ్మ  బలవన్మరణానికి పాల్పడగా, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ములుగు జిల్లా కలెక్టర్‌ క్రిష్ణఆదిత్యకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అడవిబిడ్డలు పౌరులు కాదా..?! గొత్తికోయలకు జీవించే హక్కు లేదా...?! అంటూ వారిపై జరిగిన ఫారెస్టు దాడులు, రోడ్లు సరిగ్గాలేక సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోయిన పలుసందర్భాల్లో కోర్టులు, మానవ హక్కుల కమిషన్‌లు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. అడవుల్లోని వారి నివాసాలను కూల్చొద్దని, భూములు లాక్కోవద్దని తీర్పులిచ్చినా క్షేత్రస్థాయిలో అమలుకావడంలేదు. గొత్తికోయలపై ఏదో ఒకమూల భౌతిక దాడులు, మానసిక వేదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. 2017లో  తాడ్వాయి మండలంలోని మొండ్యాలతోగు, జలగలంచ గొత్తికోయ గూడాలపై జరిగిన దాడులు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.  నాడు ప్రజాస్వామ్యవాదులు, మానవహక్కుల వేదిక ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు.  ఈ సంఘటనపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. గొత్తికోయల్లో చాలామందికి ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. 2018అసెంబ్లీ ఎన్నికలు, అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటుకూడా వేశారు. ఒకరిద్దరు పంచాయతీ వార్డుసభ్యులుగా కూడా ఎన్నికయ్యారు. ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా తమను పౌరులుగా గుర్తించినప్పటికీ పోడు పేరుతో అటవీశాఖ జరుపుతున్న దాడులు, బెదిరింపులపై ఆదివాసీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.



Updated Date - 2021-02-27T05:57:19+05:30 IST