హక్కు దక్కేనా..!?

ABN , First Publish Date - 2022-09-29T05:53:37+05:30 IST

హక్కు దక్కేనా..!?

హక్కు దక్కేనా..!?
గంగారం మండలంలో పోడు సాగు చేస్తున్న రైతులు

రాష్ట్ర సర్కార్‌ నిర్ణయంతో పోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు 

జిల్లాలో 1.15 లక్షల ఎకరాలలో సాగు 

పట్టాల కోసం ఇప్పటికే 34,689 మంది దరఖాస్తులు 


మహబూబాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 28 : పోడు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్గదర్శకాలతో జీవోను విడుదల చేసి.. పోలీస్‌, రెవెన్యూ, అటవీశాఖల అధికారులు సర్వే నిర్వహించి.. సాగుదారులకు హక్కుపత్రాలు ఇచ్చేందుకు సిద్ధం చేయాలని రాష్ట్రసర్కారు ఇటీవల నిర్ణయం తీసుకొంది. దీంతో పోడు సమస్యతో సతమతమవుతున్న రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదైనా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అనేక ఏళ్లుగా సాగులో ఉన్న తమకు పట్టాలిచ్చి ఆదుకోవాలని పోడు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో సర్కారుతో పాటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.


అందని ప్రభుత్వ పథకాలు..

తరతరాలు మారినా పోడు రైతులు తలరాతలు మారడం లేదు. అనేక ఏళ్లుగా పోడుసాగు చేసుకుంటూ పుడమి తల్లిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న అడవిబిడ్డలకు మాత్రం ఆ భూమిలపై హక్కులు లభించకపోవడంతో సర్కార్‌ పథకాల లబ్ధి చేకూరడం లేదు. వ్యవసాయం పెట్టుబడి కోసం ఇచ్చే  రైతుబంధు, రైతుబీమా దక్కడం లేదు. పోడు రైతుల కష్టాలు ఈ నాటివి కాదు.. నాటి  ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి స్వరాష్ట్రం వరకు అవే కష్టాలు. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని ఉద్యమాలు కొనసాగినప్పటికి పరిష్కారం లభించడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే పోడుభూములకు హక్కుపత్రాలు, పట్టాలిప్పిస్తామని చెబుతూ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక హామీని విస్మరిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.  పోడు రైతులంతా హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పరిశీలించి పట్టాలిస్తామని ప్రభుత్వం చెబితే మహబూబాబాద్‌ జిల్లాలో 34, 689 మంది దరఖాస్తులు చేసుకుని నెలలు గడుసున్నా పాలకుల నోట పట్టాలమాట రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఇటీవల పోడు రైతులకు హక్కు పత్రాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ఆరంభించడం, జిల్లాలో మంత్రి సత్యవతిరాథోడ్‌ సమీక్ష నిర్వహించి హక్కు పత్రాలివ్వడానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  అయితే జిల్లాలో 120 బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి రోజు 3 వేల ఎకరాలను సర్వే చేసి మూడునెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. దీంతో పోడు రైతుల్లో మళ్లీ ఆశలు చిగుర్తిస్తున్నాయి. మరోపక్క ఈ సారైనా తమకు హక్కు పత్రాలు వస్తాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 


1.15 లక్షల ఎకరాలకు 34,689 దరఖాస్తులే..

రాష్ట్రప్రభుత్వం పోడు భూములకు హుక్క పత్రాలు, పట్టాలిస్తామని అందుకోసం దరఖాస్తులు చేసుకోవాలని 2021 నవంబర్‌లో అవకాశం ఇచ్చింది. దీంతో 1.15 లక్షల ఎకరాల్లో సాగు లో ఉన్న 34, 689 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గిరిజన జిల్లా మానుకోటలోని ఏజెన్సీ మండలాలు బయ్యారం, గం గారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, కేసముద్రం, కురవి, మహబూబాబాద్‌, నెల్లికుదురు మండలాల పరిధిలోని 164 గ్రామ పంచాయతీలు 344 హాబిటేషన్లలో పోడు సాగు చేసుకుంటు న్న 34,689 మంది రైతులు 1,15 లక్షల ఎకరాల్లో సాగులో ఉన్న ట్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా ఆదివాసీ గిరిజనులుండగా ఇతరులు మరి కొంతమంది ఉన్నారు. అనేక ఏళ్లుగా భూమిని నమ్ముకుని సాగులో ఉంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని తమకు హక్కు పత్రాలిచ్చి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


ఈ ఏడాదైనా పరిష్కారం లభించేనా? 

ఎన్నికల సమయంలో పోడు సమస్యను పరిష్కరిస్తామని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఊకదంపుడు ప్రసంగాలతో అధికారంలోకి వచ్చాక, దానిని విస్మరించడంతో పోడుసాగుదారులు పాలకుల హామీలపై నమ్మకం కోల్పోయారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం విధివిధానాలు ప్రకటించి జిల్లా స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఈనెల 19వ తేదీన మానుకోట జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యవతిరాథోడ్‌ అధికారులతో సమీకా సమావేశాన్నినిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పోడు సాగుదారులకు హక్కు పత్రాలిచ్చేందుకు అటవీ, పోలీస్‌ అటవీశాఖ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని  సూచించారు.  దీంతో పోడు రైతులకు భరోసా కలిగింది. పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులు ఎప్పుడు తమకు పోడు హక్కులు లభిస్తాయోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు చేసుకుని పది నెలలు గడుస్తున్నప్పటికి ఇప్పటి వరకు ఆదిశగా ప్రభు త్వం నుంచి కదలికలు లేకపోవడంతో రైతులు ఇంతకాలం నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం పట్టాలిస్తామని చెప్పాక కూడ పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ సమస్యపౌ రైతులు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో రాష్ట్రపభుత్వ నిర్ణయం కాస్త వారిలో సంతోషాన్ని నింపుతోంది. 

Updated Date - 2022-09-29T05:53:37+05:30 IST