కవి పండితుడు ఆచార్య బుద్ధన్న కన్నుమూత

ABN , First Publish Date - 2022-06-25T06:34:30+05:30 IST

శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం మాజీ ఆచార్యులు, డీన్‌, పాఠ్య ప్రణాళికా సంఘం మాజీ అధ్యక్షుడు ఆచార్య బుద్ధన్న (67) శుక్రవారం కన్నుమూశారు.

కవి పండితుడు ఆచార్య బుద్ధన్న కన్నుమూత

కర్నూలు(కల్చరల్‌), జూన్‌ 24: శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం మాజీ ఆచార్యులు, డీన్‌, పాఠ్య ప్రణాళికా సంఘం మాజీ అధ్యక్షుడు ఆచార్య బుద్ధన్న (67) శుక్రవారం కన్నుమూశారు. బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ప్రస్తుతం ఆయన నివసిస్తున్న అనంతపురంలో కుటుంబసభ్యులు నిర్వహించారు. కర్నూలు జిల్లా, పత్తికొండలోని వుప్పాలదొడ్డి గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఆయన 1955లో జన్మించారు. శివకవి యుగ వైశిష్ట్యం అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తిచేసి సిద్ధాం త గ్రంథాన్ని ప్రచురించారు. 1985లో కళాశాల ఉపన్యాసకునిగా జీవితాన్ని ప్రారంభించి అనేక పదవులు చేపట్టారు. ఎస్కేయూ ఆచార్యులుగా, ప్రత్యేక అధికారిగా, డీన్‌గా, సమన్వయకర్తగా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌, పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షులుగా, ఎస్కేయూ సెనెట్‌ సభ్యులుగా అనేక పదవులను అలంకరించారు. ఉర్దూ సాహిత్యంపై 35 వ్యాసా లు, 40 గ్రంథాలకు పీఠికలు రాశారు. 30 మంది పరిశోధకులకు, 15 మంది ఎంఫిల్‌ పట్టాలకు మార్గదర్శకులయ్యారు. టీటీడీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మహాభారతం ప్రాజెక్టుకు ఆయన సలహాదారుగా సేవలు అందించారు. పలు సత్కారాలు పొం దారు. అక్షర వైజయంతిక, అంబేడ్కర్‌, ప్రభాతశోభ, ఉదయరాగము, స్మృతి సూక్తము, విదురగళము, అనార్కలి, ప్రేమరుక్కులు, చీకటి, ఆత్మోపశమనము వంటి మహత్తర కావ్యాలు సాహితీలోకానికి అందించారు. ఆయన మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసమూర్తి, ఆవుల బసప్ప, నగర అధ్యక్ష, కార్యదర్శులు అయ్యన్న, ఆవుల చక్రపాణియాదవ్‌ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆచార్య బుద్ధన్న గొప్ప సాహితీవేత్త అని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య వేరొక ప్రకటనలో కొనియాడారు.


Updated Date - 2022-06-25T06:34:30+05:30 IST