తాజా పరిమళాల కవిత్వం

Published: Mon, 09 May 2022 03:03:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తాజా పరిమళాల కవిత్వం

కవిత్వానికి వస్తుశిల్పాలు ముఖ్యం. ఒక వస్తువును తీసికొని దానిని కవిత్వమెలా చెయ్యాలి, భాష ఎలా ఉండాలి, భావమెలా పదునుదేలాలి - అంటే యార్లగడ్డ రాఘవేంద్రరావు కవిత్వం చదవాలి. సంతకం అక్కరలేని కవిత్వం ఆయనది. ఎలాంటి భావాన్నైనా వ్యక్తీకరించే భాష ఆయన సొంతం. అక్షయతూణీరం నుంచి వచ్చే బాణాల్లా పదాలు, వాక్యాలు దూసుకొస్తాయి.  


ఆధునిక వచన కవిత్వంలో విభిన్న ధోరణులున్నాయి. సామాజిక కవిత్వం, పర్యావరణ కవిత్వం కొందరు రాస్తే, రైతుల పక్షాన కలం పుచ్చుకొని వారి వెతల బతుకు చిత్రాలను చిత్రించిన కవి యార్లగడ్డ. ‘బహుముఖం’, ‘మట్టిపువ్వు’, ‘ముంతపొగ’, ‘మునిమాపు’, ‘చివరంచు’, ‘పచ్చికడుపువాసన’ వీరి కవితా సంపుటాలు. రాఘవేంద్రరావుగారిది బహుసున్నితమైన హృదయం. కడుపున పుట్టిన కన్నబిడ్డల ఆదరణకు నోచుకోక ఒంటరి ద్వీపాల్లా మిగిలిన వృద్ధుల్ని చూసినా; అందరి కంచాల్లో అన్నంముద్దలై, తమకి మాత్రం మెతుకులు కరువై, ఉరికంబాలకు వేలాడిన రైతుల్ని చూసినా; కరోనాలో ఉన్న వూళ్ళో ఉపాధిలేక కన్న ఊళ్ళకు చేరుకోవడానికి కాలిబాటలుపట్టిన వలసకూలీలను చూసినా... కదిలిపోతారు, కవిత్వమై ప్రవహిస్తారు. 


వీరి తొలి కవితాసంపుటి ‘బహుముఖం’ 1991లో వచ్చింది. ‘‘గుండెను చేరే చౌరస్తాలో/ గిరికీలుకొట్టే జనం పాట కావా లని/ వీధి ముద్దాడే ఊరేగింపులో ఒక పాదాన్నై పునీతమవ్వాలని/ ప్రజాస్మృతి పచ్చబొట్టునై పదికాలాలు నిలవాలని’’ తన లక్ష్యాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుత వ్యవస్థ పట్ల, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ ధోరణులు పోయే రాజకీయ నాయకులపట్ల ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతారు. ‘ఫలించీ ఫలించని స్వప్నం’లో ‘‘జీవితం జీవితంలా ఉండదు/ జీవితమంటే వ్యాపకం కాదు/ తప్పించుకోలేని ఒక అనుభవం/ జీవితమంటే సిద్ధాంతాల సంత కాదు వైరుధ్యాల కూడలి/ ఇప్పుడిక్కడ జీవితం/ జీవితంకాక మరెన్నో అవుతోంది/ జీవితా న్నివ్వని నినాదమవుతోంది/ ఉద్యమమవుతోంది/ యుద్ధమవుతోంది’’ అని ఆధునిక మానవ జీవితాన్ని ఆవిష్కరిస్తారు.  


రెండవ సంపుటి ‘మట్టిపువ్వు’. ఈ సంపుటిలోని కవితల్లో ‘మట్టిపువ్వు’ ముఖ్యమైన కవిత. ‘‘నాన్నను చూస్తే నాకెందుకో ఎప్పుడూ ఊడ్పులెరగని పొలాన్ని చూసినట్లుంటుంది/ నాన్న కళ్ళు తడింకిపోయిన పంటకాలవల్లా/ నా గుండెను పిండేస్తుంటాయి,’’ అని నాన్న కష్టాల జీవితాన్ని తలచుకొని బాధ పడతారు. బాగున్నప్పటి తండ్రిని వర్ణిస్తూ, ‘‘అప్పుడెప్పుడో వానమబ్బు వంగి నేలను వాటేసుకున్నప్పుడల్లా/ నాన్న మట్టి పరిమళమై గుబాళించేవాడు’’ అంటూ పంటలు పండక బాధ పడే నాన్న స్థితిని ‘‘ఎక్కడ కోతలైపోయిన మడి చూసినా/ ఎక్కడ బీడు పడ్డ చేను చూసినా/ నాకెందుకో/ ఈ నేల నాలుగు చెరగులా ఉన్న నాన్నలందర్నీ చూసినట్లుంటుంది’’ అని నాన్న గురించి నిలువెల్లా కురిసిన దుఃఖమవుతారు. 


ఈ కవిత మొదట్లో కవి సేద్యం చేసే వాళ్ల నాన్న గురించి చెప్పినట్లుంటుంది. కానీ చివర్లో కోతలైపోయిన పంట పొలాల్ని చూసినప్పుడల్లా నాన్నలందర్నీ చూసినట్లే వుంటుందని బాధపడినప్పుడు పాఠకుల మనసు చెమ్మగిల్లుతుంది. వ్యక్తిగతాంశాన్ని సామాజికాంశంగా మార్చాలంటే కవికి అపారమైన ప్రతిభ ఉండాలి. ‘‘అపారే కావ్య సంసారే కవి రేవః ప్రజాపతి’’ అన్నట్లు సృష్టికర్త బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించినట్లు కవిబ్రహ్మ కూడా తన ప్రతిభతో అద్భుతమైన కావ్య ప్రపంచాన్ని సృష్టిస్తాడు.  


ఏ వస్తువునైనా కవిత్వం చేయగల పరుసవేది కవికి ఉంది. చిన్నపిల్లల చిరునవ్వులు, కేరింతలు, పెద్దవాళ్లని పరవశింప చేస్తాయి. ‘దీపం పడవ’లో ‘‘నీ బోసినవ్వుల్లో తడిసిముద్దయిన ప్పుడల్లా/ మైలబడ్డ బతుకుని కడుక్కుని/ చైత్రమాసపు వెన్నెల్లో/ సన్నజాజి చెట్టుకింద కూర్చున్నట్లుంటుంది/ చివరిపేజీ చది వేసి/ పుస్తకం మూసేశాకకూడా/ మిగిలివుండే అనుభూతిలా/ నీ పసితనం మాలో పదికాలాలు/ ముద్ర వేసుకొంటుందేమో కాని/ ఇప్పుడు మాత్రం/ కదిలే దీపంపడవలాంటి నువ్వు/ రోజంతగా పెరిగేకొద్దీ/ ఒలికిపోతున్న ఆనందాల్ని ఒడిని కట్టుకోవడానికి/ ఒక్క జీవితం చాలడం లేదు కన్నా/ ...చిలిపితనాల వానవై/ ఇంకా ఇంకా దీవించు కళ్ళ మిసిమి కింద విప్పారే పెదాలతో/ జీవ రహస్యాల జ్ఞానగీతను ఇలాగే బోధించు’’. -ఈ కవితనిండా పసిదనం గురించి వర్ణించే ఉప మానాలు అన్నీ ఒకదాన్నిమించి ఒకటి అందంగా ఉంటాయి.   


2002లో వచ్చిన ‘ముంతపొగ’ కవిగారి మూడవ పుస్తకం. రైతుల కడగండ్ల మీద రాసిన దీర్ఘకవిత ఇది. దీనికి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు వచ్చింది. ఇటీవల కొత్తసాగు చట్టాలు తీసుకువచ్చినపుడు రైతులంతా ఢిల్లీలో పోరాటం చేశారు. ఎండనక, చలనక వీధుల్లోనే సంఘటితంగా ఉద్యమం చేశారు. ఇలాంటి సందర్భంలో ఆలోచనాపరులందరూ ఒకసారి చదవదగిన కావ్యం ఇది. 2000 సంవత్సరంలో జన్యుమార్పిడి పంటలు, హైబ్రిడ్‌ విత్తనాలు రైతు జీవితాన్ని అల్లకల్లోలం చేశాయి. మార్కెట్‌ మాయజాలం, అననుకూల కాలం, శాపమై కాటేసిన వాతావరణం వీటన్నింటి గురించి ఆందోళన పడతాడు కవి. జన్యుమార్పిడి పంటలపై పరిశోధన చేసే పడమటి దేశాలు భారత దేశ రైతును లక్ష్యం చేసుకోవడం కవిని ఆందోళనపరుస్తుంది. కవి. ‘‘మన క్షేత్రంలో/ మనదికాని బీజం నాటుకోవడం/ ఎంత విషాదయోగం’’ అని ఆక్రోశిస్తాడు.  


రైతుల దుస్థితికి కారణమైన కార్పొరేట్ల గురించి ‘‘రాతి పడవలమీద నిలబెట్టి/ ఎరలేని గాలాల్ని విసిరి/ జీవాస్త్రాల్ని సంధించి/ వేటగాడు పొంచి ఉన్నాడు’’ అని యథార్థ స్థితిని వ్యాఖ్యానిస్తాడు. రైతుల దుస్థితిని గురించి ఎన్నో సంకలనాలు, కావ్యాలు వచ్చాయి. కానీ వీటన్నిటిలో విశిష్టమైనది ‘ముంతపొగ’.  


వృద్ధాప్యం గురించిన విషాద కావ్యం ‘మునిమాపు’. మానవ జీవితంలో జననం, మరణం ఎంత సహజమైనవో వృద్ధాప్యం అంత సహజమైనది. ఒకప్పుడు భారతదేశం కుటుంబ వ్యవస్థకు ఆదర్శం. ఉమ్మడి కుటుంబాల్లో తాత, పెదనాన్న, బాబాయి, నాయినమ్మ, పెద్దమ్మ, పిన్ని అందరూ ఉండేవారు. ఇప్పుడు విడి కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అమ్మ, నాన్న, పిల్లలు అంతే. ఒకప్పుడు తల్లిదండ్రుల్ని కావడిలో తీసుకువెళ్ళి తీర్థయాత్రలు చేయించిన శ్రవణకుమారుడు పుట్టిన దేశంలో అడుగడుగునా వృద్ధాశ్రమాలే. 


చివరి దశలో పిల్లల మాటకోసం, స్పర్శకోసం తహతహలాడుతారు వృద్ధులు. కానీ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు. చచ్చిపోయినప్పుడు కూడా రారు సెలవు దొరక్క. గుక్కెడు మంచినీళ్ళిచ్చే దిక్కులేక, తిన్నావా ఉన్నావా అని పలకరించే ప్రాణిలేక ఒంటరితనం గూట్లో రెక్కలు విరిచిన పిట్టల్లా బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఇలాంటి దశ ఎంత భయంకరమైనదో చెప్తూ- ‘‘పసుపు కుంకుమలు వెలసిన గడపలా/ ఇప్పుడా ఇల్లు బోసిగా వుంది/ వలస వెళ్ళిన పక్షులు/ ఇంటి దారి మరచిపోయాయి/ పిల్లలు లేని ఇంట్లో పెద్దల జీవితాలలో/ గుండెల మీద పొర్లిన పసితనాలు/ పెద్దరికాల్ని తన్ని పోయాక/ కమిలిపోయిన పేగుల్లో/ గ్రీష్మానిలమే ప్రాణరాగమవుతుంది’’ అంటారు. ‘‘ఆర్నెల్లకో, ఏడాదికో తలుపుతట్టే సందడి/ వచ్చినంత హడావిడిగానే వెళ్ళిపోతుంది/ అడుగుల్ని కూడదీసుకుంటున్న గుండెలేమో/ ఎక్కడో జారవిడుచుకున్న ఆత్మీయతా నాణెం కోసం/ ఇల్లంతా గాలించుకుంటాయి’’ అంటారు. ఇలా గుండెలు పిండే విషాదాన్ని ఎంతో అలవోకగా చెప్తారు. 


‘చివరంచు’ 2014లో వచ్చిన కవితా సంపుటి. మనుషుల్లో పెరిగిపోయిన స్వార్థం గురించి, పక్కనే పిడుగుపడినా పట్టించుకోని నిర్లిప్తత గురించి, మానవత్వం కొంచెం కొంచెం నశించడం గురించి, బాధపడి బాధపడి కవి పెట్టిన పెనుకేక ఇది. ‘‘ఎక్కడో ఇసుక తీరాల కావల/ గుళ్ళ వాన కురిసి/ పసిగుడ్డులెలా చితికిపోతేనే/ పచ్చని బతుకులెలా మాడిపోతేనేం/ వీధి క్రికెట్‌లో మావాడు/ చిచ్చరపిడుగులా చెలరేగిపోవడం ఎంత చూడముచ్చటేస్తుందో’’. ఎక్కడో ఇరాక్‌లో యుద్ధం జరిగి ఎందరు మరణించినా మనబ్బాయి క్రికెట్‌లో గెలిచాడుగా అని తృప్తిపడేవాళ్లను, పలాయన మన స్తత్వాన్ని గురించి భరించలేక, ‘‘పేచీపడక రోజుకింతగా/ అమ్ముడుపోయే సరుకులం - మరచిపోకు - / గాయాల జ్ఞాపికలం/ మానవతాలిపిని దిద్దుకోవడం మనకెందుకు’’ అని ఆక్రోశిస్తారు. 


2021లో వచ్చిన ‘పచ్చికడుపు వాసన’ కవితా సంపుటిలో ‘నాకిక్కడేం బాగోలేదురా’, ‘పచ్చికడుపు వాసన’ ఈ రెండు కవితలు ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సినవి. ప్రపంచీకరణ ప్రభావం వలన అందరూ రూపాయి చుట్టూ తిరిగే గ్రహాలైపోతున్నారు. డాలర్ల కోసమో, ఉద్యోగాల కోసమో ఇంటికొకరు పరాయి దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇళ్లల్లో వృద్ధులు మిగిలిపోతున్నారు. వారు మరణించినా ఎక్కడో ఉన్న పిల్లలు రారు. వాళ్ళ కోసం భౌతిక దేహాలను మంచుపెట్టెల్లో పెడుతున్నారు. ఆ పెట్టెలో ఉన్నవాళ్ళ  బాధను చిత్రించిన కవిత ఇది. తెలుగు కవిత్వంలో ఇలాంటి వస్తువుపై ఎవరూ రాయలేదు. కుటుంబ సభ్యులు మరణిస్తే రాలేని వాళ్ళు అంత్యక్రియలను వీడియో తీసి పంపమన్న అయ్యప్ప పణికర్‌ ‘వీడియో మరణం’ కవిత గుర్తుకు వస్తుంది ఈ కవిత చదువుతుంటే. ‘‘నాకిక్కడేం బాగోలేదు నాన్నా/ పరుగెత్తడం మరచిపోయిన నదిలా/ ఇలా పడి ఉండడం నచ్చడం లేదు/ ఈ చలి పిడిబాకుల శయ్య మీద ఏమాత్రం కునుకు తియ్యలేకపోతున్నానే తల్లీ/ తొరతొరగా వచ్చి/ నన్నీ దేహాల బందిఖానా నుంచి విడిపించండి/ విడిపించి మనింటికి తీసుకెళ్ళండి/ ఈ ఒక్కసారి నాన్నా... ఇంకెప్పుడూ అడగనుగా/ అమ్మా... ఆఖరిసారి... ఈ ఒక్కసారి... నాలుగడుగులు నాతో నడిచొచ్చి/ నన్నీ పొలిమేర దాటించండి’’. ఈ చివరి వాక్యాలు చదువుతుంటే మానవత్వాన్ని కోల్పోయిన కఠిన వాస్తవం గుర్తుకొచ్చి మనస్సు కలుక్కుమంటుంది. ‘పచ్చికడుపు వాసన’ మరో మంచి కవిత. అడవిని గురించి వర్ణిస్తూ కవి పరవశమైపోతాడు. ‘సురలోకంలో కొలువైన దేవతల్లా/ బారులు తీరిన తరువు తరువొక/ అక్షరమక్షరంగా అల్లుకున్న ఆముక్తమాల్యదల్ని/ ఎవరో ఒడిబియ్యంగా పంపుతున్నట్లుందిక్కడ/అప్పుడే బయటపడ్డ బిడ్డనంటిపెట్టుకొని వచ్చిన అమ్మకడుపు పచ్చివాసనలా/ ఈ అడవి ఎంత కమ్మ కమ్మగా ఉందని’ అని అడవి అందాలను అక్షరీకరించి పరవశిస్తారు కవి.


‘బహుముఖం’ నుంచి ‘పచ్చికడుపు వాసన’ దాకా కవి నడిచిన నడక అబ్బురమనిపిస్తోంది. ఒక్కొక్క పుస్తకానికి సాధించిన పరిణతి అపురూపం. ముఖ్యంగా ఈ ఆరు పుస్తకాలు చదివాక కవిది రైతుహృదయం అని తెలుస్తుంది. పచ్చని పొలాలు, చెట్లు, ప్రకృతి, పిల్లలు అతణ్ణి పరవశింప చేస్తాయి. స్త్రీలపట్ల అతని గౌరవం అపారం. కవితా నిర్మాణ రహస్యం తెలిసిన కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు. కొత్త కొత్త పదబంధాలు, రూపకాలు, పదచిత్రాలు ఆయన కవితలో అసంకల్పితంగా నర్తిస్తాయి. సహజంగా ఇమిడిపోతాయి. ఇన్నేళ్ళలో ఏ అస్తిత్వ ఉద్యమం నీడలూ పడలేదు ఆయన కవిత్వంలో. ఈ ఆరు పుస్తకాల్లో ఎన్నో కవితలు మనను వెంటాడుతాయి. 


కవిత్వానికి ఎత్తుగడ, ముగింపు ప్రధానం. ఈ రెండూ తెలిసిన కవి యార్లగడ్డ. భాష మీద పట్టున్న కవి. దేన్నైనా సరికొత్తగా చెప్పగలరు. రైతు జీవితంలోని విషాదాన్ని చిత్రించాలన్నా, వృద్ధుల మానసిక వేదనను వర్ణించాలన్నా, దానిలో మమేకమైపోతారు. పాఠకుడిని తన వెంట తీసుకువెళతారు. ‘పచ్చికడుపు వాసన’కు ఉమ్మడిశెట్టి పురస్కారం అందుకోబోతున్న సందర్భంగా మనసారా అభినందిస్తూ, మరెన్నో కావ్యాలు రాయాలని కోరుకుంటున్నాను. 

మందరపు హైమవతి

94410 62732


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.