ప్రవహించిన జీవన కవిత్వం

ABN , First Publish Date - 2022-06-03T06:03:22+05:30 IST

కవి చిత్రకారులైన రచయితల్లో శీలా వీర్రాజు వ్యక్తిత్వం విశిష్టం. ఆయన కృతిత్వం ప్రత్యేకతను సంతరించుకొంది. 60 సంవత్సరాల క్రితం బహుశ 1961–62 మధ్య కాబోలు...

ప్రవహించిన జీవన కవిత్వం

కవి చిత్రకారులైన రచయితల్లో శీలా వీర్రాజు వ్యక్తిత్వం విశిష్టం. ఆయన కృతిత్వం ప్రత్యేకతను సంతరించుకొంది. 60 సంవత్సరాల క్రితం బహుశ 1961–62 మధ్య కాబోలు, నేను మిత్రులు మానేపల్లి హృషీకేశవరావు (నగ్నముని) వెంట వెళ్లి, ఎర్రగడ్డలో ఉన్న టిబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శీలావిని చూసాను. రాజమండ్రి నుంచి వచ్చిన కవి–కథకుడు–చిత్రకారుడిగా ఆయన పరిచయం. ఇక ఆ పరిచయం ఒక సాహిత్యానుబంధంగా బలపడింది. ఆ ఆరు దశాబ్దాలలో ఆయన మారిన అద్దె ఇళ్లు, ఆ తర్వాత సొంత ఇల్లు– నేను ఎప్పుడు వెళ్లినా– వీర్రాజు గారితో పాటు శ్రీమతి శీలా సుభద్రాదేవి స్నేహం–ఆతిథ్యం లభించాయి.


ఆయన ‘కృష్ణా పత్రిక’ (వీక్లీ) ఉపసంపాదకుడిగా ఉన్న కాలంలో (1960–64) మొజంజాహీ పళ్ల మార్కెట్‌ (మెయిన్‌ రోడ్‌) దుకాణాల మధ్య ఉన్న పత్రికా ఆఫీసుకు వెళ్లి కలిసేవాణ్ణి. అక్కడ ఆ అంగడి దుకాణం ప్రవేశ ద్వారం దగ్గర కూచుని శీలావీ ఎడిటింగ్‌ చేసేవారు– సంపాదక యజమాని స్రుబహ్మణ్యం లోపల కూచునేవారు. కె.యాదవరెడ్డిగా నేను రచనలు చేస్తున్న కాలమది. శీలావీ ఎంతో సౌజన్యంతో సూచనలు చేస్తూ, ‘కృష్ణా పత్రిక’లో నా కవితలు, కథ, విమర్శనా వ్యాసాలు, అనువాదాలు ప్రచురించారు.


ఆ తర్వాత కుందుర్తి ఆంజనేయులు గారి మార్గదర్శకత్వంలో మేమంతా వచన కవితా ప్రక్రియలో ప్రయోగాలు చేస్తున్న సమయాన శీలావీతో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. కాలక్రమంలో ఆయన నిర్వహణలో ‘ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌’ కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చాయి– వాటిలో నా భాగస్వామ్యం కూడా కొంత ఉన్నది.


రచనాపరంగా శీలావీలోని సౌందర్యాత్మక భావన, ఆభ్యుదయ దృక్పథం, చిత్రకళాశైలి పాఠకుల్ని ఆకట్టుకున్నాయి. మానవ నైజాన్ని– సంఘర్షణను ఆయన తనదైన పద్ధతిలో చిత్రించారు.


వచన కవితోద్యమ కాలంలోనే, ‘దిగంబర కవుల’ ఆవిర్భావం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక పెద్దమలుపు. అయితే దిగంబర కవుల కవితా ధోరణి– దూకుడు కుందుర్తిగారికి, శీలావీకి నచ్చేవి కాదు– విమర్శనాత్మకంగా చూసేవారు. అయినా శీలావీతో వ్యక్తిగతంగా నాకేనాడూ ప్రతికూలభావం ఏర్పడలేదు. మిత్రులు శ్రీపతి చొరవతో శీలావీ ప్రతిష్టాత్మక నవల ‘మైనా’ ప్రచురించినపుడు, దీర్ఘకావ్యాలతో (వచన కవితలో) ‘కిటికి’, స్వీయచరిత్ర మొదలగు వాటిని మేమంతా ఆహ్వానించాము. వారు వేసిన ముఖచిత్రాల పరంపరలో జ్వాలా రచనలు, నా కవితా సంపుటి కూడా ఉన్నాయి. వారి నిరంతర చిత్రకళా ప్రయాణంలో వేసిన పల్లె జీవన దృశ్యాల చిత్రాల ఆల్బం ఆయన నాకు స్నేహంగా ఇచ్చారు.


శీలావీలో కొందరు కవులు–రచయితలలో లేని మరో పార్శ్వం– వారికున్న పరిమిత ఆదాయంలోంచి ఆర్థికంగా మిత్రులను ఆదుకునేవారు. జ్వాలాముఖి ప్రచురణలకు నేను విరాళాలు సేకరిస్తున్న సమయాన, ఆయన నేను అడగకముందే తమ ఆర్థిక సహాయాన్ని అందజేసారు.


సౌమ్యుడు, సున్నితహృదయుడైన వీర్రాజుగారు ఇలా హఠాత్తుగా వెళ్లిపోయినా, ఆయన తన రచనలలో–చిత్రాలలో–స్నేహంలో నిరంతరం సజీవంగా ఉండిపోతారు. చివరికి ఆయన కవితా పంక్తుల్లోనే–

‘ఎవరైనా సరే

కవిత్వమై ప్రవహించడానికి ఏం కావాలి?

ఒక దృశ్యం కావాలి

ఒక శబ్దం కావాలి

ఒక ఆలోచన కావాలి

ఒక స్పందన కావాలి’.

నిఖిలేశ్వర్‌

Updated Date - 2022-06-03T06:03:22+05:30 IST