గ్రామాలపై గరళం

ABN , First Publish Date - 2022-06-24T05:34:08+05:30 IST

పరిశ్రమల వ్యర్థాల నిర్వహణను గాలికొదిలేయడం పల్లెలకు శాపంగా మారింది. పల్లె జనాలకు ప్రాణాంతకంగా పరిణమించింది. రసాయన వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంప్‌ చేస్తుండడంతో అవి చెరువుల్లోకి చేరి, నీరు కలుషితమవుతోంది.

గ్రామాలపై గరళం

పరిశ్రమల వ్యర్థాల నిర్వహణ గాలికి..

ఎక్కడపడితే అక్కడ డంప్‌

చెరువుల్లో కలుస్తున్న రసాయనాలు..

కలుషితమవుతున్న నీరు, గాలి.. 

పట్టించుకోని అధికార యంత్రాంగం

తూతూమంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణలు


హిందూపురంటౌన

పరిశ్రమల వ్యర్థాల నిర్వహణను గాలికొదిలేయడం పల్లెలకు శాపంగా మారింది. పల్లె జనాలకు ప్రాణాంతకంగా పరిణమించింది. రసాయన వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంప్‌ చేస్తుండడంతో అవి చెరువుల్లోకి చేరి, నీరు కలుషితమవుతోంది. పరిశ్రమల నుంచి వెలువడే పొగ మూలంగా పీల్చే గాలి కూడా కలుషితమవుతోంది. ఒకప్పుడు పచ్చటి పంటలతో కళకళలాడిన ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో పారిశ్రామిక వాడకు కేటాయించారు. పరిశ్రమలు కూడా పెద్దఎత్తున స్థాపించారు. నిర్వహణలో నిబంధనలకు నీళ్లొదలడంతో కాలుష్యం వెదజల్లుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు ఎక్కడబడితే అక్కడ పారవేయడంతో వర్షాలు వచ్చినపుడు నీరు  కలుషితం అవుతోంది.


పట్టించుకోని అధికారులు

రసాయన పరిశ్రమల వ్యర్థాల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనపై స్థానికులు, రైతులు ఇప్పటికే అనేక రకాలుగా ఫిర్యాదు చేశారు. తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడలో పదికిపైగా కెమికల్‌ పరిశ్రమలున్నాయి. వీటిలో కొన్ని మూతబడ్డాయి. మరికొన్ని నడుస్తున్నాయి. స్టీల్‌ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. వీటి నుంచి వెలువడే వ్యర్థాలు, పొగ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారు.. పలుసార్లు అధికారులకు విన్నవించుకున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. భూగర్భజలాలు కలుషితమైనా.. తాము అనారోగ్యం బారిన పడినా.. అధికారులకు పట్టదన్నారు. ఒకవేళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినపుడు మాత్రం హడావుడి చేసి, తరువాత గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. బడా కంపెనీల జోలికైతే వెళ్లనే వెళ్లరన్న అపవాదు ఉంది. అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలను వదిలేసి, చిన్నచిన్న కంపెనీలపై అధికారులు దాడులు చేస్తున్నారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినపుడు కొంతమంది ఏజెంట్లు వారికి కావాల్సిన వారిని డబ్బు ఇచ్చి, తీసుకొస్తారు. ఇతర ప్రాంతాల వారిని కూడా తీసుకొచ్చి, స్థానికులేనంటూ సంతకాలు చేయించుకుని, తూతూమంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ ముగిస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


విచ్చలవిడిగా..

హిందూపురం మండలంలోని తూముకుంట, గోళ్లాపురం పంచాయతీల పరిధిలో వందకు పైగా పరిశ్రమలున్నాయి. ఇందులో కొన్ని రసాయన పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఇవి కాలుష్యాన్ని విపరీతంగా వెదజల్లుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను రోడ్లపక్కన, చెరువుల సమీపంలో ఎక్కడబడితే అక్కడ డంప్‌ చేస్తున్నారు. అటుగా వెళ్లే పశువులు.. వ్యర్థాలను తింటున్నాయి. అవి చనిపోవడంతోపాటు రోగాలు ప్రబలుతాయని ఆయా గ్రామాల ప్రజలు జంకుతున్నారు.


తరలింపులో రాజకీయం...

పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ వేస్తుండటంతో కొంతమంది నిలదీస్తున్నారు. దీంతో కెమికల్‌ పరిశ్రమల యజమానులు.. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులకు ఈ పనిని అప్పజెప్పారు. రాత్రిపూట వ్యర్థాలను పరిశ్రమ నుంచి తీసుకెళ్లి, సమీపంలోని ప్రభుత్వ భూముల్లో వదిలేస్తున్నారు. కొంతమంది ఏజెంట్ల అవతారమెత్తి, ఈ వ్యవహారంలో భారీగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది.


భూగర్భజలాలు కలుషితం

పరిశ్రమల వ్యర్థాలు తూముకుంట, గోళ్లాపురం, గుడ్డంపల్లి, కొటిపి, దేవరపల్లితోపాటు మరికొన్ని చెరువుల్లోకి చేరుతుండడంతో భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. ఇక్కడ నీరుకూడా రంగు మారింది. వర్షం వచ్చినపుడు వ్యర్థాలు కలుస్తుండడంతో నీరు ఎర్రగా, నల్లగా, పసుపుగా రంగురంగుల్లో ప్రవహిస్తోంది. ఈ నీటిని పశువులు తాగుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో బోరు వేస్తే వెలువడే నీరు ఓ రకమైన వాసన వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బావులు, బోర్లలో నీరు నురగ కక్కుతోంది. ఇలాంటి జలాలతో పంటలు కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు అంటున్నారు. వర్షాధార పంటలు సాగుచేసినా ఏపుగా పెరగడంలేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయి, జీవనాధారాన్ని కోల్పోతున్నారు.


ప్రమాదకర రసాయనాలు 

పరిశ్రమల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని గాలికి వదిలేస్తున్నాయన్న విమర్శలు మూటగట్టుకుంటున్నాయి. తమ పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ ప్లాంట్లను పరిశ్రమల్లో ఏర్పాటు చేసుకోవాలి. తూముకుంట ప్రాంతంలో ఒకట్రెండు పరిశ్రమల్లో మినహా ఎక్కడా ఇలాంటివి కనిపించలేదు. అలాంటి ప్లాంటు ఏర్పాటు చేయాలంటే రూ.కోటికిపైగా ఖర్చవుతోంది. దీంతో యాజమాన్యాలు వాటిని పట్టించుకోవట్లేదు. కాసులకు కక్కుర్తి పడి తూముకుంట పారిశ్రామికవాడలోని కొన్ని కెమికల్‌ ఫ్యాక్టరీల్లో వెయ్యి అడుగులకుపైగా బోర్లువేసి, ఆ వ్యర్థాలను వాటిలోకి వదులుతున్నట్లు తెలిసింది.


ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు..

పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంప్‌ చేస్తుండడంతో వర్షం పడినపుడు అవి పొలాల్లోకి చేరి, భూమి లో కలిసిపోతున్నాయి. దీంతో పంటలు పండట్లేదు. అధికారులకు మాత్రం మా ఆరోగ్యం పట్టదు. తూతూమంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఏ పరిశ్రమ వద్ద కూడా మొక్కలు నాటరు.

తిమ్మప్ప, జి.గుడ్డంపల్లి


చెరువుల్లో నీరు కలుషితం..

తూముకుంట పారిశ్రామికవాడలోని కొన్ని పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో వర్షం వచ్చినపుడు నీరు కలుషితమై, చెరువుల్లోకి చేరుతోంది. ఆ నీటిని తాగితే పశువులతోపాటు మనుషులకు కూడా రోగాలు వస్తాయి. పలుసార్లు అధికారులకు విన్నవించినా.. పరిశ్రమల యజమానులకు చె ప్పుకున్నా.. ఫలితం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి.

చిన్నవీరప్ప, తూముకుంట


Updated Date - 2022-06-24T05:34:08+05:30 IST