‘అగ్నిపథ్’ చుట్టూ అబద్ధాల విషం!

ABN , First Publish Date - 2022-06-23T06:58:12+05:30 IST

భారతదేశ సైన్యాన్ని మరింత శక్తిమంతం చేయడానికే ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దురదృష్టవశాత్తు ఇది రాజకీయ విషవలయంలో...

‘అగ్నిపథ్’ చుట్టూ అబద్ధాల విషం!

భారతదేశ సైన్యాన్ని మరింత శక్తిమంతం చేయడానికే ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దురదృష్టవశాత్తు ఇది రాజకీయ విషవలయంలో చిక్కుకుంది. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకున్న యువకులను కొందరు స్వార్థంతో పక్కదారి పట్టించారు. వారిలో లేనిపోని భయాలు రేపి ఉద్యమాలకు ఉసిగొల్పి వారిని కేసుల్లో ఇరికించారు. వారి భవిష్యత్తును మొగ్గలోనే చిదిమేశారు.


ఈ పథకాన్ని లోతుగా పరిశీలిస్తే అసలు వాస్తవాలు విశదంగా తెలుస్తాయి. ఈ పథకం ద్వారా దేశ రక్షణలో యువశక్తి భాగస్వామ్యం పెరుగుతుంది. తద్వారా భారత సైన్యం మరింత శక్తిమంతమవుతుంది. అగ్నిపథ్ పథకంలో చేరిన వారిని ‘అగ్నివీరులు’ అని పిలుస్తారు. ఈ పథకం ప్రకారం– పదో తరగతి లేదా ఇంటరు పూర్తి చేసినవారికి, సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాకా, దేశానికి నాలుగేళ్ల పాటు సేవ చేసే అవకాశం దక్కుతుంది. నాలుగేళ్ల తర్వాత పదవీ విరమణ పొందిన ఈ ‘అగ్నివీరుల’ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం అందించే, పన్ను చెల్లించనవసరం లేని రూ.11,71,000 డబ్బుకుతోడు, ఏదైనా పరిశ్రమ ఏర్పాటుకైనా, లేదా ఇతరత్రా ఉపాధికైనా బ్యాంకుల నుంచి సులభమైన ఋణ సౌకర్యం కూడా ఉంటుంది.


యువత భవిష్యత్తుకు ఎంతో తోడ్పాటు అందించే ఈ అగ్నిపథ్ పథకంపై లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు. వాటిలో ప్రధానమైనది– ఈ పథకం వల్ల యువత జీవితంలో కీలకమైన నాలుగేళ్ల సమయం (18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు) వృథాగా పోతుందన్న, తర్వాత వారు ఉద్యోగావకాశాలకు పోటీపడే సామర్థ్యాన్ని పోగొట్టుకుంటారన్న దుష్ప్రచారం! ఈ దుష్ప్రచారం చేసేవారిని నేను అడగదల్చుకున్న ప్రశ్న ఒక్కటే: ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన 23 ఏళ్లలోపు వయసు వారు నెలకు రూ.30 నుంచి 40 వేల దాకా జీతం పొందుతున్నారు?


ఈ అగ్నివీరులు ఇంత తక్కువ విద్యార్హతలతో ఇంత భారీ జీతం పొందుతారు. పైగా నాలుగేళ్ల తర్వాత కేవలం 23 ఏళ్ల వయస్సులోనే రూ.11,71,000 డబ్బుతో బైటకి వస్తారు. అంతేగాక, సైన్యంలో ఉండగా లభించిన కఠోర శిక్షణతో శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనే ధైర్యం వీరిలో నిండుగా సమకూరుతుంది. ఇదే పలువురు మాజీ సైనికాధికారుల అభిప్రాయం. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ నాలుగేళ్ల కాలంలో వివిధ ఆయుధాల ఉపయోగంలో శిక్షణ పొందిన అగ్నివీరులు రిటైరైన తర్వాత అక్రమంగా ఆయుధాలు సంపాదించి సంఘవిద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉంటుందనడంలో అర్థం లేదు. ఎందుకంటే ఈ నాలుగేళ్లలో కఠిన శిక్షణ తర్వాత వారు పూర్తిగా క్రమశిక్షణ కలిగిన దేశభక్తులుగా తయారవుతారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా సైన్యం బలహీనపడుతుందన్న ప్రశ్నే తలెత్తదు. రెజిమెంటల్ వ్యవస్థలో కూడా మార్పేమీ ఉండదు. ఇలాంటి షార్ట్ టర్మ్ విధానం ఇప్పటికే చాలా దేశాలలో ఉంది. ముఖ్యంగా ఇజ్రాయిలులో 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్నేళ్లపాటు సైన్యంలో పనిచేయాలనే నిబంధన అమల్లో ఉంది. అందుకే అక్కడ ప్రతి ఒక్కరిలో దేశభక్తి మెండుగా ఉంది. చుట్టూవున్న శత్రుదేశాలు ఇజ్రాయిల్ వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉంది.


ఈ ‘అగ్నిపథ్’ పథకం హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదని, కార్గిల్ యుద్ధ సమయంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ కూడా సైన్యంలో గరిష్ఠ వయోపరిమితిని తగ్గించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేసిందని సైనికాధికారులు ప్రకటించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే భారత సైన్యం చేపడుతున్న ఈ పథకంలో చేరాలనుకునే యువత గతంలో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనకూడదని, తమకు ఎలాంటి నేర చరిత్ర లేదనే విషయాన్ని తమ దరఖాస్తులో అభ్యర్థులు స్పష్టంగా తెలియ చేయాలని సైనికాధికారులు పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే నిరసన వ్యక్తం చేయడంలో తప్పు లేదు. కానీ ప్రభుత్వ ఆస్తి అంటే మన అందరి ఆస్తి. దాన్ని ధ్వంసం చేయడం అంటే మనల్ని మనం నష్టపరచుకోవడమే. కాబట్టి యువత, ప్రజలు ఇకముందు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంస్కరణల విషయంలో కూడా పూర్తి వివరాలు, పర్యవసానాలు తెలుసుకోకుండా ఆందోళనలు చేయడం మంచిది కాదు. ఎవరో స్వార్థంతోనో, రాజకీయ లబ్ధికోసమో రెచ్చగొడితే రెచ్చిపోయి ఆందోళనలకు దిగితే నష్టపోయేది మనమే.

శ్యామ్ సుందర్ వరయోగి

బీజేపీ నాయకులు

Updated Date - 2022-06-23T06:58:12+05:30 IST