వెంకయ్యపేటలో విష జ్వరాలు

ABN , First Publish Date - 2022-08-08T05:42:06+05:30 IST

పురపాలక సంఘం పరిధి 23 వార్డు వెంకయ్యపేటలో విష జ్వరాలు ప్రబలాయి. గ్రామంలో దాదాపు 50మంది వరకు బాధితు లు ఉన్నారు. వీరిలో ఎక్కువమందికి ప్లేట్‌ లెట్స్‌ పడిపోతున్నాయి.

వెంకయ్యపేటలో విష జ్వరాలు
గ్రామంలోని పాఠశాల సమీపంలో పేరుకుపోయిన చెత్త


 50 మంది బాధితులు 

  పలువురికి డెంగ్యూ లక్షణాలు 

  కానరాని వైద్య శిబిరం

 పట్టించుకోని  అధికారులు

ఆమదాలవలస, ఆగస్టు 7: పురపాలక సంఘం పరిధి 23 వార్డు వెంకయ్యపేటలో విష జ్వరాలు ప్రబలాయి. గ్రామంలో దాదాపు 50మంది వరకు బాధితు లు ఉన్నారు. వీరిలో ఎక్కువమందికి ప్లేట్‌ లెట్స్‌ పడిపోతున్నాయి.  కొంతమంది  ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే విద్యార్థినికి జ్వరం రావడంతో  ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయి.  ఈమె శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందింది. అంబటి పార్వతి కూడా జ్వరంతో ఆసుపత్రిలో చేరింది.  గొండు తవిటినాయుడు, తన ఇద్దరు పిల్లలు ప్రణీత్‌, నిఖిల్‌కు జ్వరం రావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా డెంగ్యూగా  నిర్థారణ అయ్యింది. తవిటినాయుడు భార్య కుసుమకుమారి కూడా జ్వరంతో బాధపడుతోంది. గ్రామంలో సచివాలయ వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన దాఖలాలు లేవు. కనీసం రక్త పరీక్షలు కూడా చేయడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గత కొన్ని రోజులుగా గ్రామానికి పారిశుధ్య సిబ్బంది రావడం లేదు.  దీంతో గ్రామంలోని కాలువలు పూడికపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి.  అనేక చోట్ల చెత్త పేరుకు పోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. మునిసిపల్‌, వైద్యశాఖ అధికారులు స్పందించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు గ్రామంలో ఇంటింటా రక్త పరీక్షలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.  ఈ విషయంపై సచివాలయ ఏఎన్‌ఎం పి.తులసీబాయి వద్ద ప్రస్తావించగా.. గ్రామంలో విషజ్వరాలు ఉన్న మాట నిజమేనని చెప్పారు. ఈ విషయం వైద్య అధికారులు, మునిసిపల్‌ కమిషనర్‌  దృషికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.


Updated Date - 2022-08-08T05:42:06+05:30 IST