ఫ్రీగా మందు పోస్తున్నారని గ్రామస్తులంతా ఎగబడ్డారు.. ఆ తరువాత జరిగిన ఘోరం చూస్తే కన్నీళ్లు ఆగవు!

ABN , First Publish Date - 2021-11-08T17:00:28+05:30 IST

బీహార్‌లోని బెతియా పరిధిలోని తెల్హువా గ్రామంలో..

ఫ్రీగా మందు పోస్తున్నారని గ్రామస్తులంతా ఎగబడ్డారు.. ఆ తరువాత జరిగిన ఘోరం చూస్తే కన్నీళ్లు ఆగవు!

బీహార్‌లోని బెతియా పరిధిలోని తెల్హువా గ్రామంలో కల్తీ మద్యం తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో గ్రామమమంతా నిశ్శబ్ధంగా మారిపోయింది. బాధిత కుటుంబాలు సంఘటన జరిగిన తీరును మీడియా ముందు వెళ్లగక్కాయి. గ్రామంలో ఎక్కడ చూసినా పోలీసు వాహనాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఉచితంగా గ్రామస్తులకు మద్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గ్రామస్తులంతా మద్యం పంపిణీ చేస్తున్న ప్రాంతానికి పరుగుపరుగున వెళ్లారు. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం నౌతాన్ పంచాయతీకి నవంబరు 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టేందుకు ఉచితంగా మద్యం పంపిణీ ప్రారంభించారు. 


కల్తీ మద్యం తాగి మృతి చెందిన మదన్ రామ్, ఘనీరామ్‌ల సోదరుడు విక్రమ్‌రామ్‌ మాట్లాడుతూ తన సోదరులకు మద్యం తాగడం ఇష్టం లేకపోయినప్పటికీ ఉచితంగా ఇస్తున్నారని తెలిసి, ఆ మద్యాన్ని తాగారన్నారు. తరువాత వారిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని విక్రమ్ రామ్ తెలిపారు. గ్రామంలో కల్తీ మద్యం మహమ్మారికి బలైనవారంతా ఆ రోజు ఉదయం వరి కోతల పనుల్లో పాల్గొన్నారు. సాయంత్రం హరిజన బస్తీలో ఉచితంగా లభించిన మద్యాన్ని తాగి అనారోగ్యం పాలయ్యారు. గ్రామానికి చెందిన యువకుడు దిలీప్ మాట్లాడుతూ.. మా నాన్న చాలా అలసిపోయాక మద్యం తాగడానికి వెళ్తాడు.. ఆరోజు కూడా అలానే మద్యం తాగాడు. తరువాత అనారోగ్యం పాలయ్యాడని తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిందని ఆరోపించారు. గతంలో కల్తీ మద్యం విక్రయించినవారిని గుర్తించిన పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టేశారన్నారు. హరిజన బస్తీలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నా, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 



Updated Date - 2021-11-08T17:00:28+05:30 IST