Rajnath: పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో భాగమే

ABN , First Publish Date - 2022-07-24T23:49:41+05:30 IST

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్‌లో భూభాగమేనని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ..

Rajnath: పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో భాగమే

శ్రీనగర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్‌లో భూభాగమేనని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. 1994 పార్లమెంటు తీర్మానాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక రోజు పర్యటన కోసం ఆదివారంనాడు ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం పాక్ ఆక్రమణలో పీఓకే ఉన్నప్పటికీ ఒక్క కుటుంబం కూడా నష్టపోనీయమని, దేశ అభివృద్ధిలో వారు గణనీయమైన పాత్ర పోషించారని చెప్పారు.


శారదా పీఠాన్ని రక్షణ మంత్రి ప్రస్తావిస్తూ, పీఓకేలోని ముజఫరాబాద్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని నీలుమ్ వ్యాలీలో ఈ పీఠం ఉందని, కశ్మీర్ పండిట్లకు మతపరమైన ప్రాధాన్యం కలిగిన ప్రాంతమిదని అన్నారు. శారదామాతకు ప్రార్థనలు చేసేందుకు కర్తార్‌పూర్ తరహా కారిడార్‌ను కశ్మీర్ పండిట్లు కోరుతున్నారని చెప్పారు. బాబా అమర్‌నాథ్ ఇక్కడ ఉంటే, మాత శారద అక్కడ ఎందుకు ఉంటుంది? అని ఆయన ప్రశ్నించారు. ''పాక్‌కు వివేకం మేలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. మన శక్తి ఏమిటో మన పొరుగువారికి (పాక్) బాగా తెలుసు'' అని రాజ్‌నాథ్ అన్నారు. దురాక్రమణతో సాధించుకున్న జమ్మూకశ్మీర్‌లోని ప్రాంతాలను ఖాళీ చేయాలని కోరుతూ 1994 ఫిబ్రవరిలో పార్లమెంటు ఒక తీర్మానం చేసిందని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి చేసే అన్ని ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆ తీర్మానం స్పష్టం చేస్తోందని మంత్రి తెలిపారు. పాకిస్థాన్‌తో మైత్రీ సంబంధాలను భారత్ కోరుకుంటోందని, కానీ పొరుగుదేశం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పాక్‌ తీరును ఆయన తప్పుపట్టారు.


స్వాతంత్ర్యానంతరం జమ్మూకశ్మీర్ ఒక వార్ థియేటర్‌గా మారిందని, అయితే భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నాలన్నింటినీ మన వీర సైనికులు, ఇతర భద్రతా బలగాలు అసాధారణ త్యాగాలతో తిప్పికొట్టారని రాజ్‌నాథ్ చెప్పారు. పండిట్ జవహర్ లాల్ ప్రధానిగా ఉన్నప్పుడు 1962 యుద్ధ సమయంలో లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. ''ఆయన (నెహ్రూ) ఉద్దేశాలను నేను ప్రశ్నించడం లేదు. ఉద్దేశం మంచిదే కావచ్చు, అయితే దానిని రాజకీయాలకు వర్తింపచేయకూడదు. ఇవాళ ప్రపంచదేశాల్లోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది'' అని రాజ్‌నాథ్ అన్నారు.

Updated Date - 2022-07-24T23:49:41+05:30 IST