పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కాకు మిస్ వరల్డ్ 2021 కిరీటం

ABN , First Publish Date - 2022-03-17T16:31:57+05:30 IST

పోలాండ్‌ దేశానికి చెందిన అందాలభామ కరోలినా బిలావ్స్కా మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని గెలుచుకుంది...

పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కాకు మిస్ వరల్డ్ 2021 కిరీటం

ప్యూర్టోరికో: పోలాండ్‌ దేశానికి చెందిన అందాలభామ కరోలినా బిలావ్స్కా మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని గెలుచుకుంది. ప్యూర్టోరికోలో జరిగిన 70వ ప్రపంచ సుందరి పోటీల్లో పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా విజేతగా నిలిచింది. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లోని కోకా-కోలా మ్యూజిక్ హాల్‌లో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి.‘‘మా మిస్ వరల్డ్ 2021 పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా’’ అని మిస్ వరల్డ్ సంస్థ గురువారం ట్వీట్ చేసింది. కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది.తాను పీహెచ్‌డీ చదవాలని భావిస్తున్నట్లు కరోలినా పేర్కొంది. కరోలినా మోడల్‌గా కూడా పనిచేస్తోంది. ప్రపంచ సుందరిగా ఎంపికైన కరోలినాకు స్విమ్మింగ్, స్కూబా డైవింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడటం అంటే ఎంతో ఇష్టమట.


 ఏదో ఒకరోజు మోటివేషనల్ స్పీకర్ కావాలని ఆశ పడుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రపంచ సుందరిగా ఎంపికైంది.యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన శ్రీ సైనీ మొదటి రన్నరప్‌గా నిలవగా, కోట్ డి ఐవరీకి చెందిన ఒలివియా యాస్ రెండో రన్నరప్‌గా నిలిచింది.69వ ప్రపంచ సుందరి టోనీ-ఆన్ సింగ్ నుంచి కరోలినా కిరీటం పొందింది. మిస్ వరల్డ్ కిరీటం పొందిన తర్వాత కరోలినా కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘ ప్రపంచ సుందరిగా నా పేరు విన్నప్పుడు నేను షాక్ అయ్యాను, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించడం నాకు గౌరవంగా ఉంది. ప్యూర్టో రికోలోని ఈ అద్భుతమైన ఘట్టాన్ని నేను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను.’’ అని పోలండ్ ముద్దుగుమ్మ కరోలినా వివరించింది. 


ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ప్రసారం చేశారు. కొవిడ్ -19 వ్యాప్తి కారణంగా గత ఏడాది డిసెంబర్ నెలలో జరగాల్సిన ఫైనల్‌ పోటీలను వాయిదా వేయాల్సి వచ్చింది. మిస్ వరల్డ్ పోటీల కోసం 40 మంది సెమీ-ఫైనలిస్టులు ప్యూర్టో రికోకు తిరిగి వచ్చారు.



Updated Date - 2022-03-17T16:31:57+05:30 IST