పాలకుని కక్షకు పోలవరం బలి!

ABN , First Publish Date - 2022-05-01T08:20:58+05:30 IST

2021 జూన్‌లో పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తాం! 2022లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2023 నాటికి పోలవరం పూర్తి. ఇప్పుడు... పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. అంతా కేంద్రం చేతిలో ఉంది!

పాలకుని కక్షకు పోలవరం బలి!

ఎప్పుడో పూర్తవ్వాల్సిన ‘జల జీవనాడి’

23 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది

సిక్కోలు నుంచి సీమ దాకా జలకళ

విశాఖ పరిశ్రమలకూ నీరు పారేది

కలలన్నీ కల్లలు చేసిన జగన్‌

విపక్షంలో ఉండగా తప్పుడు ఆరోపణలు

మూడేళ్లయినా రుజువుకాని అక్రమాలు

కేంద్రం వద్దంటున్నా ‘రివర్స్‌ టెండర్లు’

పరుగులు తీసిన పనులకు బ్రేకులు

ఎప్పటికప్పుడు డెడ్‌లైన్లు పొడిగింపు

‘ఎప్పుడు పూర్తవుతుందో’ అంటూ నేడు హ్యాండ్సప్‌

పోలవరం విద్యుత్కేంద్రంపైనా ‘రివర్స్‌’ అడుగులు

960 మెగావాట్ల చౌక విద్యుత్తు దూరం


పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని యథావిధిగా కొనసాగించి ఉంటే.. 960 మెగావాట్ల విద్యుత్తు యూనిట్‌ రూపాయికే అందుబాటులోకి వచ్చేది. రాష్ట్రంలో విద్యుత్తుకు దాదాపుగా కొరత ఉండేది కాదు.


పరుగులు తీస్తున్న పోలవరం ప్రాజెక్టును ‘రివర్స్‌’ బాట పట్టించారు. రివర్స్‌ టెండరింగ్‌తో అప్పటి కాంట్రాక్టు సంస్థను మార్చేశారు. వందలకోట్లు మిగిలాయని గొప్పలకు పోయారు. ఏటా డెడ్‌లైన్లు పొడిగిస్తున్నారు కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తి కావడంలేదు.


వెరసి.. పాలకుడి కక్ష కారణంగా జల జీవనాడి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

2021 జూన్‌లో పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తాం!

2022లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 

2023 నాటికి పోలవరం పూర్తి.

ఇప్పుడు... పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. అంతా కేంద్రం చేతిలో ఉంది!


రాష్ట్రానికి జల జీవనాడిగా భావించిన పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వరుసగా చేస్తున్న ప్రకటనలు ఇవి! కాసులు కురిపించే మట్టిపనులు తప్ప... తట్టెడు కాంక్రీట్‌కూడా ఎరుగని పోలవరం ప్రాజెక్టును టీడీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గేట్లు ఏర్పాటు చేసేదాకా  నిర్మాణం పూర్తయింది. వైసీపీ అధికారంలోకి రాగానే... అంతా క్లోజ్‌! ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని విపక్షంలో తాను చేసిన ఆరోపణలు నిరూపించేందుకు... అధికారంలోకి రాగానే ‘విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’తో విచారణకు ఆదేశించారు. అయితే... అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా, వీసమెత్తు అక్రమం కూడా రుజువు చేయలేకపోయారు. చివరికి... రివర్స్‌ టెండరింగ్‌ పేరు పెట్టి కాంట్రాక్టు సంస్థను మాత్రం మార్పించగలిగారు.


తుప్పు పట్టిన ఆరోపణలతో...

2017-18లో పోలవరం సవరించిన అంచనా రూ.55,548 కోట్లకు పెరిగింది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం పెరగడమే దీనికి ప్రధాన కారణం. కానీ... అంచనాలను రూ.16,010 కోట్ల నుంచి రూ.55 వేల కోట్లకు పెంచారంటూ గోల చేశారు. వేల కోట్లను దోచేశారని ఆరోపించారు. పాదయాత్రలో,  ఎన్నికల ప్రచారంలో పదేపదే ఇదేపాట పాడారు. కేంద్ర ప్రభుత్వంలో లేని అనుమానాలను సృష్టించారు. చివరికి...  మూడేళ్ల తర్వాత రూ.55,656.87 కోట్ల అంచనాలను ఆమోదించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాశారు. 


‘వెలుగులు’ పోయి... చీకట్లు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు జల విద్యుత్కేంద్రం నిర్మాణ పనులనూ అర్ధంతరంగా నిలిపివేసి... రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లారు. దీంతో అప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనివల్ల పోలవరం జల విద్యుత్కేంద్రం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత కొత్త సంస్థ పనులు ప్రారంభించి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ ఒప్పందం చేసుకుంది. ఈ పనులు 2023 నాటికి పూర్తి చేయాలి. పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని యథావిధిగా కొనసాగించి ఉంటే.. 960 మెగావాట్ల విద్యుత్తు యూనిట్‌ రూపాయికే అందుబాటులోకి వచ్చేది. రాష్ట్రంలో విద్యుత్తుకు దాదాపుగా కొరత ఉండేది కాదు.


వద్దన్నా వినకుండా... 

పోలవరం జాతీయ ప్రాజెక్టు! ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేతిలో పెడితే ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. దీంతో... అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది. ఆర్థిక, సాంకేతిక, పునరావాస అడ్డంకులన్నింటినీ తొలగించింది. ‘సోమవారం పోలవరం’ అంటూ చంద్రబాబు ప్రతివారం సమీక్షలు నిర్వహించారు. అనేకసార్లు నేరుగా ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులు పర్యవేక్షించారు.  పనులను పరుగులు పెట్టించారు. ఎన్నికల అనంతరం మొత్తం పరిస్థితి మారిపోయింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ 2019 నవంబరులో పోలవరం హెడ్‌వర్క్స్‌, జల విద్యుత్‌కేంద్రానికి మళ్లీ టెండర్లు పిలిచి మరో సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. కొత్తగా టెండర్లు పిలవొద్దని, సాఫీగా సాగుతున్న పనులకు ఆటంకం కలిగించవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సూచించింది. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినా, అంచనా వ్యయం పెరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. అయినా జగన్‌ పట్టించుకోలేదు. తాను అనుకున్నదే చేశారు. 


ఎప్పుడో పూర్తయ్యేది...

జగన్‌ కక్షతో కాకుండా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించి ఉంటే... 2020 ఖరీఫ్‌ నాటికే పోలవరం హెడ్‌వర్క్స్‌ పూర్తయ్యేవని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. సంక్లిష్టమైన డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం అప్పటికే పూర్తయింది. దానిపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను నిర్మించి... ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లనూ పూర్తి చేస్తూ... అప్పటికే గేట్ల బిగింపు దశకు వచ్చిన స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులను కూడా ఏకకాలంలో చేపట్టాలని అప్పటి ప్రభుత్వ ప్రణాళిక. అదే జరిగి ఉంటే... దశాబ్దాల పోలవరం కల సాకారమయ్యేది. 7.20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది. ఏకంగా 23 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందేది. గోదావరి జలాలను ఆంధ్ర ప్రాంతమంతా పారిస్తే... కృష్ణా జలాలను అచ్చంగా రాయలసీమకు ఉపయోగించే అవకాశం కలిగేది. వెరసి... రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉండేది. రైతులు ఏటా పదివేల కోట్ల రూపాయల దిగుబడులను సాధించేవారు. ఈ కలలన్నింటినీ జగన్‌ కూల్చేశారు.


కేంద్రాన్ని ఒప్పించలేక... 

2019 ఫిబ్రవరి 25న 2017-18 సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం, సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ)లు ఆమోదించాయి. దీనిని కేంద్ర కేబినెట్‌ ఆమోదించాల్సి ఉంది. అధికారం చేపట్టి మూడేళ్లు సమీపిస్తున్నా జగన్‌ దీనిని సాధించలేకపోతున్నారు. 


అనుసంధానానికి అడ్డంకి

పోలవరం సాగు నీటి ప్రాజెక్టు అనుకున్న లక్ష్యం మేరకు పూర్తయితే.. గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ ఈపాటికే మొదలయ్యేది. దీనివల్ల దశాబ్దాలుగా కరువు కోరల్లో చిక్కుకున్న ప్రకాశం జిల్లా సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేదని నిపుణులు పేరర్కొంటున్నారు. 


ఆగిన ‘సుజల స్రవంతి’

పోలవరం సాగునీటి ప్రాజెక్టు సకాలంలో పూర్తయితే.. ఈపాటికి  శ్రీకాకుళం జిల్లా చివరి ఆయకట్టుకూ నీరందించడంతో పాటు విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులూ పూర్తయ్యేవి. ప్రస్తుతం సుజల స్రవంతి పనులు దాదాపుగా నిలిచిపోయాయి.

Updated Date - 2022-05-01T08:20:58+05:30 IST