పోలవరానికీ ‘హోదా’ గతేనా?

ABN , First Publish Date - 2022-04-30T06:49:14+05:30 IST

ప్రత్యేక హోదాకు క్రమానుగతంగా కేంద్ర ప్రభుత్వం పట్టించిన దుర్గతే చట్టబద్ధత గల పోలవరం ప్రాజెక్టుకు తప్పేట్టు లేదు.

పోలవరానికీ ‘హోదా’ గతేనా?

ప్రత్యేక హోదాకు క్రమానుగతంగా కేంద్ర ప్రభుత్వం పట్టించిన దుర్గతే చట్టబద్ధత గల పోలవరం ప్రాజెక్టుకు తప్పేట్టు లేదు. ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన రెండవ డిపిఆర్‌ను ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. రాష్ట్ర విభజన చట్టం మేరకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మించాలి. ఆ స్పష్టత లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వముంది. వినతి పత్రాలు సమర్పించడంతోనే ముఖ్యమంత్రి సరిపెడుతున్నారు. తాజాగా ఇద్దరూ కలసి కొత్త నాటకానికి తెరలేపారు. గోదావరి నదీ గర్భంలో 2020లో వచ్చిన వరదల కారణంగా పడిన గుంటతో పాటు దెబ్బతిన్నదని చెబుతున్న డయాఫ్రమ్ వాల్‌ను చర్చకుపెట్టి అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. 2020లో దుర్ఘటన సంభవిస్తే– ప్రాజెక్టు పూర్తికి ఈలోపు కాల పరిమితులు ఎలా ప్రకటించారు?


ఇప్పుడు డిపిఆర్‌తో పాటు పెట్టుబడి అంశం తేల్చాల్సివచ్చేసరికి కొత్త అంకానికి తెరలేపి కీలకమైన అంశాలను పక్కదారి పట్టిస్తున్నారు. నదీగర్భంలో పడిన గుంట దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సమస్యకు పోలవరం ప్రాజెక్టు పెట్టుబడి డిపిఆర్ ఆమోదానికి ఏమాత్రం సంబంధం లేదు. ప్రాజెక్టు రెండవ డిపిఆర్ పెట్టుబడి అంశాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఆమోదం పొందితే మిగిలిన సమస్యలు కాలక్రమంలో పరిష్కారమౌతాయి. అయితే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వాటి గురించి మాట్లాడకుండా 2020లో జరిగిన దుర్ఘటనతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చేతులెత్తేయడమంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని నిస్సహాయ స్థితిలో ఉండి రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే.


ఇటీవల అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల్లో ఒకేసారి నీరు నింపలేరని, దశలవారీగా నిల్వ చేస్తారని చెప్పి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు విఫలయత్నం చేశారు. అయితే ప్రాజెక్టు ఎన్ని దశలుగా నిర్మించినా ఎవరికీ అభ్యంతరం లేదు. కీలకమైన 2017–18 నాటి షెడ్యూల్ రేట్ల ప్రకారం రెండవ డిపిఆర్‍తో పాటు పెట్టుబడి అంశం కేంద్రం నుంచి అనుమతి పొందాలి. ప్రాజెక్టు పురోగతికి అత్యంత కీలకమైన ఈ అంశాల గురించి మంత్రి రాంబాబు మాట్లాడలేదు.


పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తారని ప్రచారంలో ఉంది. వాస్తవంలో ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ఎత్తు ఎవరూ తగ్గించలేరు. స్పిల్‌వే ఈ పాటికే నిర్మాణం జరిగినందున సాంకేతికంగా ఇది అసాధ్యం. కాని నీటి నిల్వ సామర్థ్యానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని ఎసరు పెడుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.72 మీటర్లతో కూడిన 2017–18 నాటి షెడ్యూల్ రేట్ల ప్రకారం డిపిఆర్ ఆమోదం పక్కన బెట్టి నీటి నిల్వ సామర్థ్యం 41.15 మీటర్లకే పరిమితం చేయటానికి యత్నాలు సాగుతున్నాయి. ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు ఒక పెద్ద బ్యారేజీగా మిగిలిపోతుంది. రిజర్వాయర్ కథ ముగిసిపోతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 194.60 టియంసిలు కాగా లైవ్ కెపాసిటీగా ఉంటే 75.20 టియంసిల గురించి మరచిపోవాలి. ప్రాజెక్టు ద్వారా వినియోగం లోనికి వచ్చే 322 టియంసిలు హుష్‌కాకి అవుతాయి. వరద రోజుల్లో తప్ప కుడి ఎడమ కాలువల నుంచి గ్రావెటీ ద్వారా గోదావరి జలాల తరలింపు వీలు కాదు. అందుకేనేమో ఈ పాటికే ముఖ్యమంత్రి ఎత్తిపోతల పథకం ప్రకటించారని భావిస్తే తప్పు కాదేమో! అంతే కాదు. 2020లోనే ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుపై చేసిన ఒక సమీక్షా సమావేశంలో ముందు జాగ్రత్త చర్యగా డ్యాం సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ప్రొటొకోల్ సిద్ధాంతాన్ని వ్యక్తం చేశారు. దాన్నే ఇటీవల మంత్రి అంబటి రాంబాబు మరో రూపంలో చెప్పారు.


రెండవ డిపిఆర్ ఆమోదం పొందకుండా 41.15 మీటర్ల వరకే నీరు నిల్వ చేయడానికి అంగీకరిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఉద్దేశించిన 62.2 టియంసిలు విశాఖ తాగునీటికి కేటాయించిన 24 టియంసిలు సరఫరా వీలుకాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్నాడు ఎత్తిపోతలతో పాటు రాయలసీమ జిల్లాలకు గోదావరి జలాలు సరఫరాకు అవకాశం ఉండదు. నానాటికి కృష్ణలో నీటి లభ్యత తగ్గిపోవడం, పైగా అంతర్ రాష్ట్ర జల వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మిగులు జలాలు ఉన్న గోదావరియే రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాల దాహార్తిని తీర్చగలదు. విషాదకరమైన అంశం ఏమిటంటే అప్పుడూ ఇప్పుడూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాల దాహార్తి తీర్చే బహులార్థ సాధక ప్రాజెక్టుగా అన్ని ప్రాంతాల ప్రజల్లో భావన కలిగించలేకపోవడం శాపంగా మిగిలింది.


2010–11 నాటి షెడ్యూల్ రేట్ల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి డిపిఆర్‌ను 16,010.45 కోట్లతో కేంద్ర జల సంఘం ఆమోదించింది. ఇందులో సాగునీటి వ్యయం 9,307.34 కోట్లు. అయితే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు రెండవ డిపిఆర్‌ను కేంద్రం ఆమోదించలేదు. టీడీపీ హయాంలోనే 2017–18 నాటి షెడ్యూల్ రేట్ల ప్రకారం 2019 జనవరిలో ప్రాజెక్టు అథారిటీ 57,297.42 కోట్ల రూపాయల అంచనాలతో కేంద్ర జల శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే ఫిబ్రవరిలో సమావేశమైన సాంకేతిక సలహా మండలి 55,548.87 కోట్ల రూపాయలకు అంచనాలను కుదించింది. తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కాంట్రాక్టర్ మార్పు, టీడీపీ హయాంలో జరిగిన అవినీతి వెలికితీయడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలం గడపడంతో అసలుకే మోసం వచ్చింది. తిరిగి 2020 జూన్ నెలలో గాని రివైజ్డ్ కాస్ట్ అంచనాల కమిటీ సమావేశం జరగలేదు. అంటే ఒక సంవత్సరకాలానికి పైగా వృథా అయింది. ఫలితంగా పలు విధాలుగా ప్రాజెక్టు భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకొన్నాయి. ఈ మధ్య కాలంలోనే నదీగర్భంలో గొయ్యి పడిన దుర్ఘటనలు సంభవించాయి. 


2020 జూన్ నెలలో సమావేశమైన రివైజ్డ్ కాస్ట్ అంచనాల కమిటీ 2017–18 నాటి షెడ్యూల్ రేట్ల ప్రకారం అంచనాలను 47,725.24 కోట్లకు కుదించి అదే సమయంలోనే 2013–14 షెడ్యూల్ రేట్ల ప్రకారం మరొక డిపిఆర్‌ను ప్రతిపాదించింది. 2017లో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందనే తీర్మానం చూపెట్టి 2013–14 షెడ్యూల్ రేట్ల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం వ్యయం 29,027.95 కోట్ల రూపాయలకు గాను అందులో సాగునీటి వ్యయం 20,398.81 కోట్లుగా అంచనా వేసి కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ డిపిఆర్ ఆమోదించుతుందో తేలాల్సి ఉంది. కాని జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని రుద్ది చివరకు మొత్తంగా ఎగనామం పెట్టిన విధంగానే, పోలవరం విషయంలోనూ ప్రాజెక్టు రెండవ డిపిఆర్ ఆమోదించకుండా, రానున్న ఎన్నికల్లో మాయ చేసేందుకు 41.15 మీటర్ల వరకు నీటి నిల్వకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితం కానున్నాయి.


ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధంగా వున్న ఈ దుర్ఘటనలపై కూడా పరస్పరారోపణలు సాగుతున్నాయి. స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయకుండా కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టినందున వరద ఉధృతికి గొయ్యి పడి డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతిన్నదని రాష్ట్ర ప్రభుత్వం టీడీపీపై నెపం నెడుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాదిపాటు ప్రాజెక్టు పనులు నిలిపి వేయడం కారణం కావచ్చనే అంశం మరుగుపర్చుతున్నది. అయినా ఈ దుర్ఘటన 2020లో జరిగితే 2022లో చర్చకు పెట్టడం వెనక కారణాలేమిటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే తెలియాలి.


వి.శంకరయ్య 

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2022-04-30T06:49:14+05:30 IST