పోలవరం గట్టుకు తూట్లు!

ABN , First Publish Date - 2021-03-01T09:27:59+05:30 IST

పోలవరం కుడికాల్వ గట్టు అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. రాత్రి, పగలు తేడా లేకుండా గట్టును గుట్టుగా తవ్వేస్తున్నారు.

పోలవరం గట్టుకు తూట్లు!

యథేచ్ఛగా కుడికాల్వ పొడవునా తవ్వకాలు

వందల టిప్పర్ల మట్టి అమ్మకం.. అధికార పక్ష నేత కనుసన్నల్లో దందా

పెదకడిమిలో అడ్డుకున్న గ్రామస్థులు.. సినీనటుడి బంధువు ఫోను.. దాంతో స్థానికులూ వెనక్కి


పెదవేగి, ఫిబ్రవరి 28: పోలవరం కుడికాల్వ గట్టు అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. రాత్రి, పగలు తేడా లేకుండా గట్టును గుట్టుగా తవ్వేస్తున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో పోలవరం కాల్వ పొడవునా గట్టును తవ్వి వందల కొద్దీ టిప్పర్ల మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చార నిరంతరం పొక్లయిన్లతో తవ్వేస్తూ టిప్పర్లతో తరలిస్తున్నారు. లక్ష్మీపురం, కవ్వగుంట, కొప్పాక, పెదకడిమి, భోగాపురం తదితర ప్రాంతాల్లో.. పెదకడిమికి చెందిన అధికార పార్టీ యువనాయకుడు ఇలా కొల్లగొట్టేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి రెండు పొక్లయిన్లతో తవ్వుతూ పది టిప్పర్లతో మట్టిని నింపుతుండగా.. అదే గ్రామస్థులు కొందరు అడ్డుకున్నారు. దీనిపై ఇరువర్గాల మధ్య వివా దం జరిగింది. అయినప్పటికీ గ్రామస్థులు వెనక్కి తగ్గలేదు. వారు పట్టుకున్న కొన్ని టిప్పర్లను అధికార పార్టీ నాయకుడు దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయాడు.


రెండు పొక్లయిన్లు, ఒక టిప్పర్‌ను గ్రామస్థులు ఆపగలిగారు. చివరకు ఓ ప్రముఖ సినీనటుడి బంధువు ఒకరు వారికి ఫోన్‌ చేయడంతో  వారూ వెనక్కి తగ్గారు. మట్టి తవ్వకం విషయం తెలిసి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి సదరు యువనాయకుడిని  మందలించినట్టు సమాచారం. గట్టు తవ్వకాలు కొనసాగితే కొంతకాలానికి గట్టు పటిష్టానికి మట్టికోసం వెంపర్లాడే దుస్థితి వస్తుందని స్థానికులు అంటున్నారు.

Updated Date - 2021-03-01T09:27:59+05:30 IST