నిండామునిగారా.

ABN , First Publish Date - 2020-10-27T07:02:16+05:30 IST

పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధుల కోత విధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో తమది పర్యవేక్షణ బాధ్యత మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో పునరావాసం అగమ్యగోచరంగా మారింది.

నిండామునిగారా.
పోలవరం ప్రాజెక్టు ప్రాంతం..

పోలవరం నిధుల కోతతో పునరావాసం అడియాసే

గ్రామాలు ఖాళీ చేసిన నిర్వాసితుల మనుగడ ప్రశ్నార్థకం

జాతీయ ప్రాజెక్టుకు పర్యవేక్షణ మాత్రమే రాష్ట్రానిదని తేల్చిచెప్పిన సీఎం

కేంద్ర, రాషా్ట్రల దోబూచులాటలో నిర్వాసిత గ్రామాల్లో అయోమయం

(రంపచోడవరం-ఆంధ్రజ్యోతి)

పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధుల కోత విధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో తమది పర్యవేక్షణ బాధ్యత మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో పునరావాసం అగమ్యగోచరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇంతవరకు ఆయా గ్రామాల నుంచి తరలించిన సుమారు మూడు వేల నిర్వాసిత కుటుంబాలను పునరావాసం పేరుతో ప్రయోజనాలను చేకూర్చకుండానే నిండా ముంచినట్టయ్యింది. దీంతో ఈ ప్రాజెక్టు పునరావాస చర్యలకు గండి పడి నిర్వాసితుల మనుగడే ప్రశ్నార్థకం కాబోతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి 2013-14 అంచనాల ప్రకారం 57 వేల 940 కోట్లుగా నిర్ధేశించిన విషయం తెలిసిందే. ఇందులో కేవలం పునరావాసానికే సుమారు రూ.33 వేల కోట్లు అవసరమని తేల్చారు. ఆ దిశగా ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం కాకపోయినా పునరావాస చర్యలను కూడా కొత్త అంచనాలతోనే అధికారులు అమలుచేస్తున్నారు. 2020-21 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో నిర్వాసితులను గ్రామాలను ఖాళీ చేయించే దిశగా అఽధికారులు నడుంబిగించారు. పునరావాస ప్రయోజనాలు కల్పించకుండానే నిర్వాసితులను ఖాళీ చేయించేందుకూ ఇటీవల ప్రభుత్వం వరద ముంపు సాకుతో కొంత ప్రయత్నం చేసింది.  వాస్తవానికి ఈ ప్రాజెక్టు కింద గోదావరి జిల్లాల్లో ఎనిమిది గిరిజన మండలాల్లోని 373 ఆ వాసాలు ముంపునకు గురవుతుండగా, సుమారు 1 లక్షా 5 వేల కుటుంబాలు నిర్వాసితులు కానున్నారు. కానీ ఇంతవరకు 17 ఆవాసాలలోని సుమారు మూడు వేల మంది నిర్వాసిత కుటుంబాలను వారి గ్రామాల నుంచి ఖాళీ చేయించారు. పునరావాస చర్యలను పూర్తి చేస్తేగాని ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ దానిని వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి చట్టబద్ధంగా నిర్ధేశించడం జరిగింది.. 2020-21 నాటికి ప్రాజెక్టును పూర్తి  చేయాలనుకున్న పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రిత్వశాఖ 2013-14 అంచనాలను కాకుండా 2010-11 అంచనాల మేరకు మించి సుమారు 20 వేల కోట్లకు మించి ప్రాజెక్టు వ్యయాన్ని భరించలేదని తేటతెల్లం చేసింది. దీనివల్ల ముందుగా నష్టపోయేది నిర్వాసితులే. పునరావాస చర్యలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే 2010-11 అంచనాల ప్రకారం పునరావాస చర్యల కోసం రూ.3 వేల కోట్లు అంచనా వ్యయంగా మాత్రమే అప్పట్లో ఆ మోదించారు. కాగా 2013 భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం పునరావాస అంచనా వ్యయం సుమారుగా 33 వేల కోట్ల రూపాయలకు చేరింది. 

ఇదీ తాజా పరిస్థితి..

ఇంతవరకు సాధించిన పునరావాస ప్రగతిని చూస్తే నిర్దేశిత లక్ష్యంలో పది శాతం ప్రగతిని కూడా సాధించని పరిస్థితి నెలకొంది. నిర్వాసితుల కోసం గోదావరి జిల్లాల్లో 214 పునరావాస  కాలనీలను నిర్మించాల్సి ఉండగా కేవలం 26 కాలనీలను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 188 కాలనీలను పూర్తి చేయాల్సివుంది. ఇంకా పునరావాస, ఆర్థిక విషయాలకొస్తే సుమారు 18 వేల కోట్ల రూపాయలు కేవలం పునరావాస చర్యలకు మాత్రమే అవసరమవుతుండగా, ఇంత వరకు రూ.464 కోట్లు మేర మాత్రమే చర్యలను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద +45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేయాలన్నది లక్ష్యం కాగా, ప్రస్తుతానికి +41.15 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసి ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేయాలన్నా 20,800 నిర్వాసిత కుటుంబాలను 98 ఆవాసాల నుంచి తరలించాల్సి ఉంది. +41.15 కాంటూరు స్థాయిలో ఇంకా తరలించాల్సిన సుమారు 17,700 వందల నిర్వాసిత కుటుంబాలకు అన్ని ప్రయోజనాలను భూసేకరణతో కలిపి అమలు చేయడానికి రూ.3,380 కోట్లు అవసరమవుతాయి. కాగా ఇంతవరకు రూ.1550 కోట్లు బడ్జెట్‌ విడుదలైంది. కాగా ఇంతవరకు భూసేకరణ, పునరావాస చర్యల కోసం సుమారు రూ.248 కోట్లు మేర 195  బిల్లులను తయారు చేసి పంపించగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో అత్యధిక బిల్లులు  రూ.120 కోట్లు మేర పునరావాస కాలనీలకు చెందినవే. నిర్వాసితులకు ఆర్థిక ప్యాకేజీ కింద సుమారు రూ.57 కోట్ల మేర 20 బిల్లులు రంపచోడవరం ఆర్‌అండ్‌ఆర్‌కు చెందినవే ఉన్నాయి.  ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సమాంతరంగా పునరావాస చర్యలు అమలైతేగాని ప్రాజెక్టుకు సార్థకత చేకూరని పరిస్థితి. పది శాతం కూడా ప్రగతి లేని ఈ ప్రాజెక్టు పునరావాసం, నిధుల కొరత కారణంగా నిర్వాసితులు తమ మనుగడ ఏమవుతుందోన్న అందోళనలో ఉన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ముంపు ప్రాంతాల్లో అభివృద్ధిని గాలికి వదిలేసిన అధికారులు నిర్వాసితులను ఏదోవిధంగా మభ్యపెట్టి గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది కేవలం పర్యవేక్షక బాధ్యత మాత్రమేనని, పునర్విభజన చట్టం ప్రకారం అంతా కేంద్ర మే చూసుకోవాలని సీఎం జగన్‌ స్పష్టంచేయడంతో పునరావాస చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే గ్రామాలను ఖాళీ చేసిన 3 వేల మంది నిర్వాసితుల మనుగడ మరీ అయోమయంగా మారింది.


\

Updated Date - 2020-10-27T07:02:16+05:30 IST