పోలవరం గట్టెక్కుతుందా?

ABN , First Publish Date - 2022-03-02T07:25:32+05:30 IST

పోలవరం ప్రాజెక్టుకు మంచిరోజులొచ్చేనా.. అనే చిన్న ఆశ మొలకెత్తుతోంది. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ప్రగతి ఏమీ లేదు. నిధుల లేమితో కుదేలైంది. కానీ ఈనెల 4న కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రాజెక్టును సందర్శించనున్నారు.

పోలవరం గట్టెక్కుతుందా?

నిధుల లేమితో కుదేలైన ప్రాజెక్టు

4న  కేంద్రజలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

సీఎం  జగన్‌ రాక..  ప్రాజెక్టు, కాలనీ పరిశీలించిన కలెక్టర్‌

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టుకు మంచిరోజులొచ్చేనా.. అనే చిన్న ఆశ మొలకెత్తుతోంది. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ప్రగతి ఏమీ లేదు. నిధుల లేమితో కుదేలైంది. కానీ ఈనెల 4న కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయనతోపాటు సీఎం జగన్‌ కూడా రానున్నారు. ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజల్లో కొన్ని ఆశలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రివైజ్డ్‌ అంచనా రూ.55 వేల కోట్లను ఆమోదిస్తేనే ఈ ప్రాజెక్టు ఒక దరికి చేరుతుంది. లేకపోతే కేవలం బ్యారేజీ మాదిరిగా స్పిల్‌వే నుంచి గ్రావెటీ ద్వారా నీటిని కిందకు వదలాడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తికావడంతో స్పిల్‌వే పనులు ఇంచుమించు  పూర్తికావచ్చాయి. స్పిల్‌వేకు 48 గేట్లు అమర్చవలసి ఉండగా, ఇంకా ఆరుగేట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కనీసం ఇవి పెట్టినా అక్కడ నీరు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మాదిరిగా కొంతైనా నిల్వ ఉండే అవకాశం ఉండేది. కాఫర్‌డ్యామ్‌ వల్ల నీరు ఆగినా, చాలావరకూ స్పిల్‌కు బిగించిన ఆరుగేట్ల వద్ద నుంచి కిందకు వెళ్లిపోతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కాస్త నీటిమట్టం ఎక్కువైతే  గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. నీరు వృఽథా అవుతోంది. అందువల్ల స్పిల్‌ వే గేట్లు పూర్తిగా బిగించవలసి ఉంది. ఇక దిగువ కాఫర్‌ పనులు ఓ మోస్తరుగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే ఎగువ, దిగువ  కాఫర్‌ డ్యామ్‌ల మధ్య గత ప్రభుత్వం నదిలోపల నిర్మించి డయాఫ్రంవాల్‌ మీదుగా ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మిస్తారు. ఇక్కడ డయాఫ్రం వాల్‌ కూడా కాస్త దెబ్బతింది. దానిని తిరిగి నిర్మించాల్సి ఉంది.  ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యామ్‌ నిర్మిస్తేనే ప్రాజెక్టు పూర్తయినట్టు. కానీ కేంద్రం ఇంతవరకూ రివైజ్జ్‌ అంచనాల ప్రకారం నిధులు ఇవ్వకపోవడంతో మొత్తం పనులు నత్తనడక నడుస్తున్నాయి. మరోపక్క పవర్‌ప్రాజెక్టు పనులు ఓ మోస్తరుగా జరుగుతున్నాయి. అంతే కాక ఇంకా ఎగుమ ప్రధాన కాలువ పనులు చాలావరకూ పెండింగ్‌లో ఉన్నాయి.  కుడి ప్రధాన కాలువ పనులు చాలావరకూ పూర్తయ్యాయి. ఈ రెండు కాలువల పను లు  పూర్తయితేనే పోలవరం ప్రాజెక్టు నీళ్లు కాలువల గుండా పొలాలకు, ఊళ్లకు చేరతాయి. కానీ ఈ పనులన్నీ వెంటనే జరిగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. దానికి ప్రధాన కారణం నిధుల లేమి. ఈ పరిస్థితుల్లో కేంద్రజలశక్తి మంత్రి షెకావత్‌ వస్తున్నారు. పోలవరం వద్ద సమీక్ష కూడా నిర్వహించనున్నారు. ఏదైనా శుభవార్త చెబుతారా, సమీక్షతోనే సరా అనే చర్చ నడుస్తోంది. అదేరోజు దేవీపట్నం మండలం లోని ఇందుకూరిపేట-1 కాలనీని సందర్శించనున్నారు. ఇక్కడ 352 ఇళ్లు నిర్మించారు. వీరి రాకకోసం ఇక్కడ రెండు హెలిఫ్యాడ్‌లను నిర్మించారు. కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ రవీంద్రబాబు తదితరులు మంగళవారం ఇక్కడ సందర్శించారు.

పునరావాసం ప్రధానం

 ప్రాజెక్టు నిర్మాణం, ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాస కాలనీ, ఇతర లబ్ధి కూడా పూర్తిగా చేకూర్చాల్సి ఉంది. ఇంకా కొండమొదలు గ్రామాలు ఖాళీ కాలేదు. దేవీపట్నం మండలంలోని చాలా గ్రామాలను ఖాళీ చేయించారు. కానీ అందరికీ పునరావాసం కల్పించలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కూడా పూర్తిగా ఇవ్వలేదు. ముంపు బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం రావలసినవన్నీ వచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేయాలనే డిమాండు ఉంది. నిధులొస్తేనేగాని ఈ సమస్యలు పరిష్కారం కావు. కనీసం పునరావాసం కూడా కల్పించకపోతే కష్టమే. ఇప్పటికీ నిర్వాసితులు అద్దె ఇళ్లలో ఉంటున్నారు.

Updated Date - 2022-03-02T07:25:32+05:30 IST