డిష్యూం.. డిష్యూం

ABN , First Publish Date - 2020-08-09T11:27:24+05:30 IST

నిర్వాసితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తాం.. జూలై నెలాఖరుకు తొలి దశ పూర్తిచేస్తాం.

డిష్యూం.. డిష్యూం

 పోలవరం నిర్వాసితుల వివాదం

సర్దుబాటు, సమన్వయం లేక ఘర్షణలు

తరలింపువేళ సరికొత్త రగడ

యంత్రాంగం ఆచితూచి అడుగులు


(ఏలూరు - ఆంధ్రజ్యోతి): నిర్వాసితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తాం.. జూలై నెలాఖరుకు తొలి దశ పూర్తిచేస్తాం. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ ఆరు నెలల క్రితం ప్రకటించారు. ముంపు గ్రామాలన్నింటిని ఖాళీ చేయించడమే ప్రభుత్వ లక్ష్యంగా కన్పించింది. ఆఘమేఘాలపై అధికారులు రంగంలోకి దిగి పరిహారం చెల్లింపు కోసం రీ సర్వే చేపట్టారు. కానీ నిర్వాసితుల తరలింపు ప్రక్రియలో కొంత జాప్యం తొంగిచూసింది. ఈలోపే పరిహార భూముల విషయంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణకు తావిచ్చింది. ఇరువర్గాలను సర్దుబాటుచేసి, ఇదే క్రమంలో ఖాళీ చేయించే అంశపై ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాల్సిందిపోయి చూసీచూడనట్లు వదిలేయడంతో ఈ ఘర్షణలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయా అనే ఆందోళన నెలకొంది. శాంతియుత వాతావరణానికి ప్రయత్నించాల్సిన ప్రజాప్రతినిధుల తడబాటు, ప్రభుత్వం వైపు నుంచి సరైన డైరెక్షన్‌ లేకపోవడం భరోసాలేని నిర్వాసితుల మధ్య ఘర్షణలకు తావిస్తోంది.


ఎందుకిలా జరుగుతోంది.. 

పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో దశాబ్దాల కాలంగా ఎన్నో అభ్యంతరాలు. మరెన్నో వివాదాలు. అధికారు జోక్యం చేసుకున్నవి కొన్ని. ఇరు వర్గాల మధ్య రాజీ కుదరకుండా వివాదం రాజేసేవారు ఇంకొందరు.  ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో ఈ తరహా వివాదాలు తెరముందుకు వస్తున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు కానీ ఏ ఒక్కరూ గిరిజనులు, గిరిజనేతరుల మధ్య అవగాహన కల్పించి పరిస్థితిని అదుపులోకి పెట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ లేవు. కొందరు స్థానిక నేతలు ప్రయత్నించినా పెద్దగా ఫలించలేదు.


ముంపు భూములకు ఇప్పటికే పరిహారం పొందారు కదా, ఈ భూములన్నీ ప్రభుత్వానివే అందువల్ల తాము సాగు చేసుకునే హక్కు ఉందంటూ గిరిజనులు పట్టుబడుతున్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు 41.5 కాంటూరు వద్ద నీటి నిల్వ సామర్ధ్యం కల్గేలా నిర్మాణం పూర్తైతే ఆయా ప్రాంతాల్లో భూములన్నీ పూర్తిగా జలమయమై సాగుకు అవకాశం ఉండదు. గత ఏడాది కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం కారణంగా గోదావరి వరద ముంపు మండలాల వైపు ఎగదన్నింది. పంట భూములు నీట మునగడం అక్కడ వారందరికీ తెలుసు. అయినప్పటికీ భూముల విషయంలో పట్టుదలకు పోకూడదని కొందరు పెద్దలు వారిస్తున్నా ఏ ఒక్కరూ శాంతించ లేదు. గత నెలాఖరునాటికి మొదటి దఫా వందల కుటుంబాలను ఖాళీ చేయించి జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తోన్న కాలనీలకు చేర్చాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వర్షాకాలానికి ముందు తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ గ్రామ స్థాయిలో రీ సర్వేలో వివరాలు నమోదు చేయడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అప్పటికే వారికి సహకరించాల్సిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు.


కరోనా దెబ్బతో రీ సర్వే ఎక్కడికక్కడే నిలిచింది. ముంపు ప్రాంతాల నుంచి నిర్వాసితుల తరలింపు ప్రక్రియ సందిగ్ధంలో పడింది. గడచిన మూడేళ్ళుగా కుక్కునూరు మండలంలో పోలవరం పరిహారం పొందిన భూములపై రగడ సాగుతూనే ఉంది. అమరవరం, ఉప్పేరు, తొండిపాక పంచాయతీల పరిధిలో రెండు వర్గాలుగా విడిపోయి కొందరు వివాదాలకు, ఘర్షణలకు దిగుతున్నారు. గిరిజనులను బుజ్జగించి పరిష్కార మార్గంవైపు కదులుదామనుకుంటే వారికి దూరమవుతామని, అలాగే గిరిజనేతరులను కూడా ఒప్పించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిద్దామన్నా ఈ వర్గంతో నుంచి తెగతెంపులు చేసుకున్నట్లు అవుతుందేమోనని ప్రజా ప్రతినిధులు, మరోవైపు అధికారులు చొరవ చూపడం లేదు. పోలవరం ముంపు ప్రాంతాల నుంచి నిర్వాసితులను తరలించడమే ప్రధాన లక్ష్యం కాగా దీనికి భిన్నంగా ఘర్షణలు, వివాదాలు చోటు చేసుకోవడం అధికారులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారపక్షంలోనూ దీనిపై భిన్న స్వరాలున్నాయి. అసలు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఖాళీ చేయించేందుకే ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి నాన్చివేత ధోరణితో వివాదాలు ముదురుతున్నాయని స్పష్టమవుతోంది.


ఏం చేయబోతున్నారు..

పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో కాలనీల నిర్మాణం జరగలేదు. పునరావాసానికి అనుకూలంగా ఏర్పాట్లు పూర్తి కాలేదు. ఇంతకుముందే ఇవ్వాల్సిన, హామీ ఇచ్చిన పరిహారం వారి చేతికంద లేదు. ఎన్నికలకు ముందు జగన్మోహన్‌రెడ్డి నిర్వాసితుల్లో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత పరిహారం, భూముల పరిహారం మరింత పెంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. దీనిని నమ్ముకునే అత్యధికులు అప్పట్లోనే వైసీపీకి కొమ్ముకాశారు. తమ భూములన్ని ముంపుకు గురవుతాయి కాబట్టి పరిహారం సంపూర్తిగా చేతికందితే చాలనుకున్నారు. తాజాగా ఈ డిమాండ్‌ తెరముందుకు వచ్చింది. వ్యక్తిగత పరిహారం ఆరున్నర లక్షలు చెల్లించేలా చూడాలని, తమ బిడ్డల భవిష్యత్‌ కోసం ఇదంతా జరగాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడు భూ వ్యవహారం కాస్త ఎదురు తిరిగింది. కొందరు పరిహారాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికే అందుకుంది చాలంటూ వివాదాలకు దిగడం, దీనికి ప్రతిగా ఇంకొకరు వాదులాటకు దిగడం అశాంతికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వచ్చిపడింది. కరోనా పరిస్థిలు లేకుంటే ఈ పాటికే పరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వ వ్యవహారం బట్టబయలై ఉండేది. ఎవరెవరికి ఎంత మొత్తంలో చేతికందేది తేలిపోయి ఉండేది. ఇచ్చిన మాటకు కట్టుపడి పరిహారం చెల్లించేవారా, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కోతలు పెట్టేవారా అనేది తేలిపోయేది.


ఎవరూ ఊహించని స్థాయిలో వివాదాలు ముదిరేవి కాదు. ముంపు మండలాల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచి, ఎవరూ దూకుడుగా వ్యవహరించకుండా సమన్వయపరిచే యంత్రాంగం కనిపించడం లేదని, రానురాను పరిస్థితి ఆందోళనకరమేనని ముంపు మండలాల వారు వ్యాఖ్యానిస్తున్నారు. సజావుగా సాగాల్సిన నిర్వాసితుల తరలింపు ప్రక్రియ మరింత ముదరబోతోందని కొందరు భయపడుతున్నారు.

Updated Date - 2020-08-09T11:27:24+05:30 IST