ప్రాజెక్టులకు పైసా లేదు!

ABN , First Publish Date - 2022-01-30T08:08:15+05:30 IST

మెండుగా వర్షాలు... నిండుగా నీళ్లు! కానీ... వాటిని ఒడిసిపట్టుకునే ప్రాజెక్టుల్లేక కన్నీళ్లు! సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి జగన్‌ సర్కారు నీళ్లొదిలేసింది. ఇది విపక్షాల ఆరోపణ కాదు.

ప్రాజెక్టులకు పైసా లేదు!

  • 80% పైన పూర్తయినవీ ఇంకా పెండింగ్‌
  • మూడేళ్లుగా రూపాయి విడుదలకూ నోచుకోని ప్రాజెక్టులు ఎన్నో 
  • జగన్‌ సర్కారు పెట్టిన ఖర్చు 9,323 కోట్లు
  • 2021-22లో దారుణంగా 1323 కోట్లే
  • నిధుల్లేక నీరసించిన పోలవరం నిర్మాణం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మెండుగా వర్షాలు... నిండుగా నీళ్లు! కానీ... వాటిని ఒడిసిపట్టుకునే ప్రాజెక్టుల్లేక కన్నీళ్లు! సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి జగన్‌ సర్కారు నీళ్లొదిలేసింది. ఇది విపక్షాల ఆరోపణ కాదు. అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు స్వయంగా సాగునీటి శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పిన సమాధానాన్ని పరిశీలిస్తేనే ఈ విషయం స్పష్టమవుతుంది. 80 శాతానికి పైగా నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులకు కూడా పైసా రాల్చకపోవడంతో... అవి ఇప్పటికీ పెండింగ్‌లోనే పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఒకవిధంగా చెప్పాలంటే... 2021-22 జల వనరుల శాఖకు ‘శూన్య కాలం’ అని చెప్పవచ్చు.


నిధులన్నీ నీటి మూటలే...

‘సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ప్రాధాన్యం ప్రకారం పూర్తి చేస్తాం’... ఇవన్నీ వట్టి మాటలే. నిధుల విడుదల దాకా వచ్చేసరికి ఇవన్నీ నీటి మూటలవుతున్నాయి. జల వనరుల శాఖకు బడ్జెట్‌లో ఏటా రూ.11 వేల కోట్ల నుంచి రూ.13వేల కోట్లు కేటాయిస్తున్నారు. అంటే, ప్రాజెక్టుల నిర్మాణంపై ఈ మూడేళ్లలో 30వేల కోట్లకుపైగా ఖర్చు చేసి ఉండాలి. కానీ... అంతా కలిసి ఖర్చు చేసింది రూ.9323 కోట్లు మాత్రమే. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను సంపూర్ణంగా విడుదల చేసి ఉంటే... పోలవరం ప్రాజెక్టు 2021 డిసెంబరు నాటికి పూర్తయి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. 


అరకొర పనులూ చేయలేక...

చంద్రబాబు హయాంలోనే నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు వచ్చిన ప్రాజెక్టులనూ జగన్‌ సర్కారు పూర్తిచేయలేకపోతోంది. 2019  సార్వత్రిక ఎన్నికల నాటికే 85 శాతం వరకూ పూర్తయిన నెల్లూరు, సంగం బ్యారేజీలు నేటికీ పూర్తికాలేదు. జగన్‌ అధికారంలోకి వచ్చేనాటికే  దాదాపు 87 శాతం పనులు పూర్తయిన వంశధార స్టేజ్‌-1, ఫేజ్‌-2 పనులను పూర్తి చేయలేకపోతున్నారు. తోటపల్లి, జంఝావతి, మడ్డువలస ప్రాజెక్టులకూ అతీగతీ లేకుండా పోయింది. గాలేరు నగరి సుజల స్రవంతి ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులు 2019 నాటికే 95 శాతం మేర పనులు పూర్తయ్యాయి. చిత్రావతి, గండికోట పనులూ 94 శాతం మేర పూర్తయ్యాయి. సోమశిల హెలెవల్‌, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ  85 శాతం మేర పూర్తయ్యాయి. వాటిని గత ఏడాది జనవరిలో ప్రారంభించాలని ఒకసారి .. జూన్‌లో ప్రారంభించాలని మరోసారి సీఎం జగన్‌ సాగునీటి పథకాలపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయించారు. కానీ.. ఇప్పటివరకూ పురోగతే లేదు. 


పైసాకు నోచుకోని ప్రాజెక్టులు...

వంశధార స్టేజ్‌ 1 ఫేజ్‌2, మహేంద్ర తనయ, తోటపల్లి, జంఝావతి, వంశధార-నాగావళి వరద కాలువలు, వంశధార-నాగావళి అనుసంధానం, నాగావళి, చంపావతి అనుసంధానం, కళింగపట్నం వద్ద వంశధార రక్షణ పనులు, గోదావరి పరీవాహక ప్రాంత డెల్టా ఆధునీకరణ, తాటిపూడి ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి,  వేదాద్రి ఎత్తిపోతల, పాలేరు రిజర్వాయరు, కొరిశపాడు ఎత్తిపోతల, వెలిగొండ, గండికోట ఎత్తిపోతల, ఎస్‌ఆర్‌బీసీ, సిద్దాపురం ఎత్తిపోతల, టీబీపీ ఎత్తిపోతల, కర్నూలు వరద కాలువ, పీఏబీఆర్‌-2, ఎంపీఎ్‌సఈ ఆధునీకరణ, చాగల్లు నుంచి జాజికొండ వాగుకు  వరద కాలువ, సంగం బ్యారేజీ, నెల్లూరుబ్యారేజీ, పెన్నా నది కాలువ ఆధునీకరణ, కాన్పూర్‌ కెనాల్‌ సిస్టమ్‌, నెల్లూరు జిల్లాల వరద రక్షణ... ఈ ప్రాజెక్టులపై 2021-22లో రూపాయి కూడా ఖర్చు చేయలేదు.


మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ప్రాజెక్టులు

పెదంకలాం, ఒట్టిగడ్డ, వెంగళరాయ సాగర్‌ ఆధునీకరణ, పెద్దగెడ్డ ఆధునీకరణ, వరద నారాయణమూర్తి, ఆండ్ర రిజర్వాయరు, ఏలూరులో తమ్మిలేరుకు రక్షణ గోడ, తాండవ ఎత్తిపోతల, గుంటూరు ఛానెల్‌ విస్తరణ, వైకుంఠపురం ఎత్తిపోతల, నల్లమల కాలువ ఆధునీకరణ, ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో బ్యారేజీ, పోతురాజు నాలా అభివృద్ధి, వీఆర్‌ కోట ఆనకట్ట అభివృద్ధి, మోపాడు రిజర్వాయరు అభివృద్ధి, పాలేరు మూసీ డ్రెడ్జింగ్‌, ఎన్‌ఎ్‌సపీ చిన్నతరహా ఆయకట్టు కేఎల్‌ఐఎ్‌సతో లింకు, మైలవరం కాలువల ఆధునీకరణ, జీఎన్‌ఎ్‌సఎస్‌, హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌, కుందు ఎత్తిపోతల, గండికోట సీబీఆర్‌, గండికోట పైడిపాలెం ఎత్తిపోతల, పీబీసీ, సీబీఆర్‌ కుడికాలువ ఎత్తిపోతలు, జీఎన్‌ఎ్‌సఎస్‌ అవుకు రిజర్వాయరు నుంచి గండికోట వరకు విస్తరణ, గండికోట టన్నెల్‌ నుంచి రిజర్వాయర్‌కు పదివేల క్యూసెక్కుల తరలింపు, జెర్రికోన రిజర్వాయరు నుంచి పెద్దచెరువుకు నీటి తరలింపు, రాజోళిబండ డైవర్షన్‌, రాయలసీమ ఎత్తిపోతల, జీడిపల్లి నుంచి భైరవానితిప్పకు ఎత్తిపోతల, నంద్యాల వరద కాలువ... ఈ ప్రాజెక్టులపై గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పైసా ఖర్చు పెట్టలేదు.

Updated Date - 2022-01-30T08:08:15+05:30 IST