గంజాయి విక్రయిస్తున్న తొమ్మిది మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-03-07T05:41:39+05:30 IST

చిన్న వయసులోనే గంజాయికి అలవాటుపడి బానిసలుగా మారిన యువకులు అందుకు అవసరమైన డబ్బు లేకపోవటంతో చివరకు గంజాయినే వ్యాపారంగా మార్చుకుని పోలీసులకు పట్టుబడ్డారు.

గంజాయి విక్రయిస్తున్న తొమ్మిది మంది అరెస్టు

ఏడు కిలోల గంజాయి..  రెండు కార్లు స్వాధీనం



గుంటూరు, మార్చి 6: చిన్న వయసులోనే గంజాయికి అలవాటుపడి బానిసలుగా మారిన యువకులు అందుకు అవసరమైన డబ్బు లేకపోవటంతో చివరకు గంజాయినే వ్యాపారంగా మార్చుకుని పోలీసులకు పట్టుబడ్డారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి ఏడు కిలోల గంజాయి, రెండు కార్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి తెలిపారు. శనివారం పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. తాడేపల్లికి చెందిన గోలి నాగ శివ వెంకట దేవి నీలేష్‌, బ్రహ్మానందపురానికి బొల్లా మంజునాథ్‌,  వెంకటపాలేనికి చెందిన కామినేని చరణ్‌సాయి, ఆయన తమ్ముడు పూర్ణఆకాష్‌, పెనుమాకకు చెందిన పరిశపోగు దేవకుమార్‌, కాజ గ్రామానికి చెందిన దొడ్డక పవన్‌కుమార్‌, ఎర్రబాలేనికి చెందిన కోరాకుల తేజ, తాడేపల్లికి చెందిన కొమ్మతోటి ప్రవీణ్‌కుమార్‌, తాడేపల్లికి చెందిన కొండా మహేష్‌కుమార్‌ అనే నిందితులను తాడేపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. సీతానగరం పుష్కరఘాట్‌ సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ బాలకృష్ణ, సిబ్బంది వెళ్లేసరికి ఆయా యువకులు రెండు కార్లలో పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఏడు కిలోల గంజాయి లభ్యమైంది. విశాఖపట్నం పరిధిలోని నర్సీపట్నం ఏజెన్సీలో గల అరకు, సీలేరు తదితర ప్రాంతాల్లో కిలో గంజాయి రూ.వెయ్యికి కొనుగోలు చేసి ఇక్కడ రూ.5 వేలకు విక్రయిస్తూ డబ్బు సంపాదించటమేకాక అందులో కొంత తాము వినియోగిస్తున్నామని వెల్లడించారు. అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ పట్టుబడిన తొమ్మిది మందిపై రౌడీషీట్‌ తెరుస్తున్నట్టు తెలిపారు.  

Updated Date - 2021-03-07T05:41:39+05:30 IST