టీడీపీ కార్యకర్తపె ౖపోలీసుల దాడి

ABN , First Publish Date - 2022-07-02T05:52:23+05:30 IST

బనగానపల్లె మండలం పెద్దరాజు పాలెం గ్రామంలో అన్నదమ్ముల పంచాయితీ విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన టీడీపీ కార్యకర్త ఉప్పరి చెన్నబోయిన సుబ్బరాయుడును రూరల్‌ ఎస్‌ఐ శంకర్‌నాయక్‌ విచక్షణా రహితంగా కొట్టారు.

టీడీపీ కార్యకర్తపె ౖపోలీసుల దాడి
పెట్రోల్‌ బంకు కూడలిలో ధర్నా చేస్తున్న బీసీ జనార్దన్‌రెడ్డి

భూవివాదంలో చితకబాదిన ఎస్‌ఐ 

నిరసనగా టీడీపీ నేతల బైఠాయింపు 

పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: బీసీ 


బనగానపల్లె, జూలై 1: బనగానపల్లె మండలం పెద్దరాజు పాలెం గ్రామంలో అన్నదమ్ముల పంచాయితీ విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన టీడీపీ కార్యకర్త ఉప్పరి చెన్నబోయిన సుబ్బరాయుడును రూరల్‌ ఎస్‌ఐ శంకర్‌నాయక్‌ విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన పొలం తగాదాలో సుబ్బరాయుడు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. సుబ్బరాయుడు పొలంలోకి ఆయన సోదరుడు ఈశ్వరయ్య కావాలనే నీరు వదిలాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈశ్వరయ్యపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన  సుబ్బరాయుడును ఎస్‌ఐ శంకర్‌నాయక్‌ విచక్షణా రహితంగా కొట్టాడని బాధితుడి భార్య పుల్లమ్మ ఆరోపించింది. ఊపిరి ఆడక పోవడంతో సుబ్బరాయుడును బనగానపల్లె వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లె వైద్యశాలకు చేరుకొని బాధితుడిని పరామర్శించారు. అనంతరం టీడీపీ శ్రేణులతో కలసి వచ్చిన బీసీ జనార్దన్‌రెడ్డి ఎస్‌ఐ శంకర్‌నా యక్‌ తీరుకు నిరసనగా పెట్రోల్‌బంకు కూడలిలో బైఠాయించి ధర్నా చేశారు. ఆ తర్వాత సీఐ సుబ్బరాయుడు అక్కడికి వచ్చి ఎస్‌ఐపై కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో బీసీ ధర్నా విరమించారు. అనంతరం సీఐతో కలసి బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడిని బీసీ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో బాధితుడి భార్యా కుమారులతో కలసి బీసీ జనార్దన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బాఽధితురాలు పుల్లమ్మ మాట్లాడుతూ పొలం విషయంలో తన భర్తపై ఇప్పటికే బనగానపల్లె పోలీసులు అన్యాయంగా మూడుసార్లు కేసులు పెట్టి జైలుకు పంపారని వాపోయింది. బీసీ మాట్లా డుతూ బనగానపల్లె రూరల్‌, టౌన్‌ ఎస్‌ఐలు శంకర్‌నాయక్‌,  రామిరెడ్డి వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు కూడా తమపై కక్ష గట్టలేదని, కానీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నుంచి ఫోన్‌ వస్తే చాలు ఈ ఎస్‌ఐలు టీడీపీ కార్యకర్తలపై దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరులను టార్గెట్‌గా చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల యాగంటిపల్లెలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని దారుణంగా తిట్టి వీరు హింసించారని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడూ వైసీపీ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడలేదన్నారు. ఇటీవల ఎర్రగుడిలో జయజ్యోతి సిమెంట్‌ ప్యాక్టరీ వారు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ వివాదంలో సుమారు 150 మందిపై ఎస్‌ఐ రామిరెడ్డి కేసులు పెట్టారని ఆరోపించారు.  రైతులను బూతులు తిట్టాడని అన్నారు. గతంలో కూడా రాళ్లకొత్తూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తని, ఎర్రగుడికి చెందిన సుధాకర్‌రెడ్డిని బండ బూతులు తిట్టి దాడులు చేశారని అన్నారు. పోలీసు అధికారులు తమ విధులను నిర్వహించకుండా వైసీపీ నాయకుల కంటే ఎక్కువగా బనగానపల్లె నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎస్‌ఐ శంకర్‌నాయక్‌ను సస్పెండ్‌ చేయాలని బీసీ డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులకు ఇరువురి ఎస్‌ఐలపై ఫిర్యాదు చేస్తామన్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు భార్య పుల్లమ్మ తన భర్తపై దాడిచేసిన ఎస్‌ఐ శంకర్‌నాయక్‌పై సీఐ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాహిద్‌హుస్సేన్‌, భూషన్న, బొబ్బల గోపాల్‌రెడ్డి, దొనపాటి భాస్కర్‌రెడ్డి, మౌళీశ్వరరెడ్డి, అల్తాప్‌హుస్సేన్‌, పూల కలాం, సలాం, కాశీం, ఖైరాత్‌వలి, షబ్బీర్‌, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:52:23+05:30 IST