పోలీసుల గుట్టు

ABN , First Publish Date - 2022-07-07T06:51:36+05:30 IST

నగరంలో సంచలనం సృష్టించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై హత్యాయత్నం కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది.

పోలీసుల గుట్టు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై హత్యాయత్నం కేసులో వివరాలు వెల్లడించని అధికారులు

ఇప్పటికే నలుగురి అరెస్టు

మహిళా మెజిస్ర్టేట్‌, మహిళా ఎస్‌ఐ ప్రమేయం ఉన్నట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం 

రూ.5 వేలు దోపిడీ కేసుకే సమావేశాలు ఏర్పాటుచేసే అధికారులు...హత్యాయత్నం అందుకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు 

కీలక నిందితుల అరెస్టులో తాత్సారం

మహిళా ఎస్‌ఐ పరారీలో ఉన్నారంటూ సమాధానం


విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

నగరంలో సంచలనం సృష్టించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై హత్యాయత్నం కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. గాజువాకలో ఇటీవల రూ.5 వేలు దోపిడీ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేసినప్పుడు విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ వివరాలు వెల్లడించిన పోలీసులు, సుపారీ గ్యాంగ్‌తో జరిగిన హత్యాయత్నం...అందులోనూ ఒక మహిళా మెజిస్ర్టేట్‌, మరో మహిళా ఎస్‌ఐ ప్రమేయం వున్నట్టు తేల్చిన కేసులో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కనీసం ఆ వివరాలను కూడా మీడియాకు వెల్లడించకపోవడం విశేషం. పైగా హత్యాయత్నానికి పురిగొల్పడంతోపాటు సహకరించిన మరికొందరిని ఇంతవరకూ అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కలెక్టరేట్‌ డౌన్‌లోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్న పెంకి రాజేష్‌పై గత నెల 18న హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టు ప్రకారం...రాజేష్‌కు భీమిలి కోర్టులో మెజిస్ర్టేట్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మితో విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో రాజేష్‌ను అంతమొందించాలని విజయలక్ష్మి తన కారు డ్రైవర్‌ అప్పలరెడ్డికి చెప్పారు. అతను తనకు తెలిసిన భీమిలికి చెందిన మరుపల్లి తరుణ్‌కుమార్‌ ద్వారా నగరానికి చెందిన రామస్వామి, రాజులకు సుపారీ ఇచ్చాడు. ఇందుకోసం విజయలక్ష్మి నగరంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న తన సోదరి నాగమణితోపాటు ఆమె వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఉడికల ప్రమోద్‌కుమార్‌ సహాయం కూడా తీసుకున్నారు. ఎస్‌ఐ నాగమణి నేరుగా రాజేష్‌కు, అతని భార్యకు ఫోన్‌ చేసి తన సోదరిని కలవాలని ఆదేశించడంతోపాటు, రాజేష్‌ను చంపేస్తానని బెదిరించినట్టు పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అంతటి కీలకమైన కేసును ఛేదించిన పోలీసులు ఆ వివరాలను రహస్యంగా వుంచడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. రాజేష్‌పై హత్యాయత్నానికి పాల్పడిన రామస్వామి, రాజులను ఈ నెల ఒకటిన, కానిస్టేబుల్‌ ప్రమోద్‌కుమార్‌ను, సుపారీ గ్యాంగ్‌ను సమకూర్చిన తరుణ్‌కుమార్‌ను ఈ నెల మూడున అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఆ వివరాలను పోలీసులు కనీసం మీడియాకు వెల్లడించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలావుంటే ఈ కేసులో మెజిస్ర్టేట్‌ను అరెస్టు చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది కాబట్టి జాప్యం జరిగినా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎస్‌ఐ నాగమణితోపాటు కారు డ్రైవర్‌ అప్పలరెడ్డిని అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని పోలీసు అధికారులే ప్రశ్నిస్తున్నారు. దీనిపై మహారాణిపేట సీఐ సోమేశ్వరరావును వివరణ కోరగా మెజిస్ర్టేట్‌ అరెస్టుకు అనుమతివ్వాలంటూ జిల్లా జడ్జికి లేఖ రాశామని, అక్కడ నుంచి హైకోర్టు రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ర్టేషన్‌)కు పంపించారన్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే అరెస్టు చేస్తామన్నారు. ఎస్‌ఐ నాగమణితోపాటు అప్పలరెడ్డి ఫోన్‌లు ఆఫ్‌ చేసి పరారీలో ఉన్నారని, అందుకే అరెస్టులో జాప్యం జరుగుతోందని సమాధానం ఇచ్చారు. ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి వారణాసి వెళ్లిపోయిన దొడ్డి కిరణ్‌ను అరెస్టు చేయగలిన పోలీసులు, ఇప్పుడు అలాంటి నైపుణ్యం ఎందుకు ప్రదర్శించడం లేదనేది అర్థం కావడం లేదు.

Updated Date - 2022-07-07T06:51:36+05:30 IST