అతను మిగతా దొంగల్లా కాదు.. ఇంట్లోకి కూడా వెళ్లడు.. అతని టార్గెట్ ఏంటో తెలిస్తే షాకవడం ఖాయం!

ABN , First Publish Date - 2022-01-03T19:04:43+05:30 IST

సాధారణంగా దొంగలంటే డబ్బులు, నగలు దోచుకుంటారు.. కొందరు బైక్‌లు దొంగిలిస్తుంటారు..

అతను మిగతా దొంగల్లా కాదు.. ఇంట్లోకి కూడా వెళ్లడు.. అతని టార్గెట్ ఏంటో తెలిస్తే షాకవడం ఖాయం!

సాధారణంగా దొంగలంటే డబ్బులు, నగలు దోచుకుంటారు.. కొందరు బైక్‌లు దొంగిలిస్తుంటారు.. అయితే ఓ వ్యక్తి మాత్రం అలాంటి ఖరీదైన వాటి జోలికి వెళ్లడు.. కేవలం ఇనుప గేట్‌లను మాత్రమే దొంగిలిస్తుంటాడు.. ఇనుప గేట్‌లు పోయినా ఎవరూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వరని అతని ధీమా. దీంతో అతను రాజస్థాన్‌లోని బిల్వారా ప్రాంతంలో ఎన్నో ఇళ్ల, ఫామ్ హౌస్‌ల గేట్లను ఎత్తుకుపోయాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. 


బిల్వారాకు సమీపంలోని కరోయ్, గంగాపూర్, రాయ్‌పూర్, రష్మి మొదలైన ప్రాంతాల్లో రాజేష్ చంద్ర అనే వ్యక్తి 30కి పైగా దొంగతనాలకు పాల్పడ్డాడు. ఉదయం టెంపోలో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రికి వెళ్లి ఇనుప గేట్లను దొంగిలిస్తాడు. ఇంటి లోపలికి మాత్రం వెళ్లడు. బద్రీలాల్ శర్మ అనే వ్యక్తి గత గురువారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఇంటి ఇనుప గేట్ పోయిందని ఫిర్యాదు చేశాడు. ఇటీవలి కాలంలో అన్నీ ఇలాంటి ఫిర్యాదులే రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా నిఘా పెట్టారు.


రాజేష్ ఉదయం పూట టెంపో నడుపుతుంటాడు. రాత్రి సమయాల్లో తను దొంగిలించిన ఇనుప గేట్లను రవాణా చేసేందుకు దానిని ఉపయోగిస్తుంటాడు. ఆ టెంపోలోనే కట్టర్స్, బ్లేడ్లు మొదలైనవాటిని ఉంచుకుంటాడు. టెంపో బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చి కట్టర్‌తో సునాయాసంగా గేట్‌ను కట్ చేస్తుంటాడు. ఆ గేట్లను అమ్మేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఒక వ్యక్తి అందించిన సమాచారం మేరకు పోలీసులు రాజేష్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. అతని నుంచి 15 ఇనుప గేట్లను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-01-03T19:04:43+05:30 IST