పోలీసు కమిషనరేట్ నుంచి ‘తూర్పు’ ఔట్
ఆప్షన్లపై ఉద్యోగుల్లో డైలమా
ఎటు వెళ్లాలో తేల్చుకోలేక తర్జనభర్జన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొత్త జిల్లాల ఏర్పాటుకు సమయం దగ్గర పడుతోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కమిషనరేట్ రూపురేఖలు కూడా మారనున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఉన్న తూర్పు మండలం మొత్తాన్ని మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే కృష్ణాజిల్లాలో విలీనం చేయనున్నారు. గన్నవరం, ఆత్కూరుతోపాటు పమిడిముక్కల వరకు మొత్తం తొమ్మిది పోలీస్ స్టేషన్లను కృష్ణాజిల్లాకే అప్పగించాలి. ఈ స్టేషన్లతోపాటు ఇక్కడ పనిచేస్తున్న సివిల్ పోలీసు సిబ్బందిని కూడా అటే పంపాల్సి ఉంటుంది. అయితే ముందుగా ఆయా స్టేషన్లలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది తాము వెళ్లాలో ఉండాలో తేల్చుకోలేక తర్జనభర్జన పడుతున్నారు. ఇంకొందరు పిల్లల చదువులు, ఇతరత్రా కారణాలతో విజయవాడ కమిషనరేట్‌లోనే కొనసాగాలని యోచిస్తున్నారు. ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్‌ను బట్టి అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. విజయవాడ కేంద్రంగా ఏర్పడే ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోకి కొత్తగా 15 పోలీసు స్టేషన్లు కలవనున్నాయి. ఆయా స్టేషన్ల సిబ్బంది కొందరు కమిషనరేట్‌కు రావడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా ఇన్స్పెక్టర్ల బదిలీ వ్యవహారం డీఐజీ పరిధిలో ఉన్నందున ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.