ఒరిజినల్‌ కాదని పోలీసులు తేల్చేశారు: మాధవ్‌

ABN , First Publish Date - 2022-08-11T08:26:28+05:30 IST

ఒరిజినల్‌ కాదని పోలీసులు తేల్చేశారు: మాధవ్‌

ఒరిజినల్‌ కాదని పోలీసులు తేల్చేశారు: మాధవ్‌

ఎస్పీ పీసీ ముగియగానే ఢిల్లీలో మీడియా ముందుకు

రాయడానికి వీల్లేని భాషలో చంద్రబాబుపై దూషణలు

కమ్మ సామాజిక వర్గం, ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీపైనా..

వంద శాతం ఫేక్‌ అని చెబుతూనే ఉన్నా ఎంపీ గోరంట్ల మాధవ్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘ఆ వీడియో అసలుదే అని నిర్ధారించలేం. అలాగని... నకిలీదని చెప్పలేం. సోర్స్‌ (ఒరిజినల్‌) వీడియో దొరికితేనే అందులో ఉన్నది మాధవో, కాదో చెప్పగలం’...ఎంపీ గోరంట్ల మాధవ్‌ ‘డర్టీ పిక్చర్‌’పై అనంతపురం ఎస్పీ చేసిన ప్రకటన సారాంశం ఇది! కానీ... ఎంపీ మాత్రం తనకు క్లీన్‌ చిట్‌ వచ్చేసినట్లుగా చెప్పుకొంటున్నారు. ‘అది ఒరిజినల్‌ కాదని పోలీసులు చెప్పారు’ అంటూ సొంత భాష్యం చెప్పుకొన్నారు. ఏమీ లేని వీడియోను పట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారని వాపోయారు. బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా ఎస్పీ ప్రెస్‌మీట్‌ పూర్తికాగానే.. ఢిల్లీలో ఉన్న మాధవ్‌ మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. ‘కమ్మ నా కొడుకులు’ అంటూ ఆ సామాజిక వర్గాన్ని తిట్టారు. తాను ఒకే వైఖరితో ఉన్నానని, 100 శాతం ఫేక్‌ వీడియో తయారు చేశారనే చెబుతున్నానని, కడిగిన ముత్యంలా బయటికి వస్తానన్న విశ్వాసం ఉందని తెలిపారు. తానేమీ టెన్షన్‌ పడలేదని, ఎక్కడా ఇబ్బందులకు గురికాలేదని, మామూలేగానే ఉన్నానని.. పార్లమెంటుకు కూడా వెళ్లానని చెప్పారు. ఆ వీడియో తనది కాదు కాబట్టి విశ్వాసంతో ఉన్నానని, ఎలాంటి క్షోభకూ గురికాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేసిన నేపథ్యంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగలేదన్న ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది కదా అని అడుగగా.. ‘చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఏడేళ్లయింది. దొంగలా దొరికి 10 ఏళ్ల పాటు ఉండాల్సిన హైదరాబాద్‌ నగరాన్ని వదిలి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి పరారై వచ్చి ఇక్కడ పడే. నువ్వు నిజాయితీపరుడివైతే... న్యాయపరీక్షలో నెగ్గిరావాలి కదా! నీ అంతలా నీవే ఫోరెన్సిక్‌కు ఇస్తున్నాను అని చెప్పాలి కదా! సిగ్గూ ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారు’ అని మాధవ్‌ అన్నారు. ఏం చేస్తారు వీళ్లు. నా బొచ్చు పీకుతారా అని వ్యాఖ్యానించారు. టీడీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. చచ్చిపోయిన పార్టీని బతికించుకోవాలనే వాళ్ల దుర్మార్గ, నీచనికృష్టమైన ఆలోచనతో నీచమైన రాజకీయాలకు తెరతీశారని ఆరోపించారు. లోతైన టెక్నాలజీని వాడి ఇలాంటివి చేస్తున్నారని అంటున్నారని చెప్పారు. ‘వీడియో లండన్‌ నుంచి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. లండన్‌లో, విదేశాల్లో మన రాష్ట్రం నుంచి ఏ కులస్తులు ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. నాకు మొదటి రోజే ఒక ఎస్‌ఐ పేర్లను పంపిస్తే.. అందులో అరగుండు అయ్యన్నపాత్రుడి కొడుకు ఉన్నాడు’ అని అన్నారు. మాజీ మంత్రి లోకేశ్‌ను కూడా రాయడానికి వీల్లేని పదజాలంతో దూషించారు. అలాగే, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపైనా అనుచిత దూషణలతో నోరుపారేసుకున్నారు.


Updated Date - 2022-08-11T08:26:28+05:30 IST