Ap News: పోలీసుల అదుపులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబీకులు

ABN , First Publish Date - 2022-05-21T23:29:36+05:30 IST

ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి...

Ap News: పోలీసుల అదుపులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబీకులు

కాకినాడ (Kakinada): ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం (Post mortem) నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు అనుమతి నిరాకరించారు. రెండు రోజులుగా వైద్యులు, అధికారులు ప్రయత్నించినా సుబ్రహ్మణ్యం (Subrahmanyam) కుటుంబం సంతకాలు పెట్టడంలేదు. ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‎ (Mlc  Uday Bhaskar)ను అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. తాజాగా ఉప్పాడ కోమరగిరి (Komaragiri)లో సుబ్రహ్మణ్యం హత్య జరిగిన ప్రాంతం వద్దకు వెళ్తుండగా ఆయన భార్య.. తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కాకినాడ తీసుకు వెళ్లి జీజీహెచ్‎ (GGH)లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


మరోవైపు కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ (Sravan Kumar) రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోస్టుమార్టంపై సంతకం చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేసిన ఉదయ్ భాస్కర్‎ను అరెస్ట్ చేయకుండా బాధితుడి భార్య ..తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడంపై శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. 


కాగా డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహానికి పోస్ట్‎మార్టం నిర్వహించేందుకు జీజీహెచ్ అనాటమి డాక్టరు ఉదయం నుంచి వేచి చూసి బయటకు వెళ్లారు.  అయిదు దాటాక పాస్ట్‎మార్టం చేయడానికి అనుమతి లేదని అన్నారు. బంధువులు వస్తే వారి సమక్షంలో ఆదివారం అయినా శవ పంచనామా చేస్తామని వెల్లడించారు. మృతుడి శరీరంపై గాయాలున్నాయని.. మృతదేహాన్ని ఐదురోజులు మాత్రమే ఫ్రీజర్‎లో ఉంచగలమన్నారు. బాగా కమిలిపోయిన సుబ్రమణ్యం మృతదేహానికి నాలుగు రోజులులోపే పోస్ట్‎మార్టం చేయాలని అనాటమి డాక్టరు తెలిపారు. 

Updated Date - 2022-05-21T23:29:36+05:30 IST