Advertisement

అడవులు జల్లెడ.. మావోయిస్టుల కదలికలపై పోలీసుల డేగ కన్ను

Mar 5 2021 @ 23:34PM
కరకగూడెం మండలంలో కూంబీంగ్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక బలగాలు(ఫైల్‌)

వలస ఆదివాసులతో మాట్లాడుతున్న ఏడుళ్ళ బయ్యారం సిఐ రమేష్‌, ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌కుమార్‌


భద్రాద్రి జిల్లాల్లో గ్రేహౌండ్స్‌ బలగాల కూంబింగ్‌

బిక్కు బిక్కు మంటున్న ఏజెన్సీ పల్లెలు

కరకగూడెం/గుండాల, మార్చి 5 : మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులు, గ్రేహౌండ్స్‌ ప్రత్యేక బలగాలు డేగ కన్ను వేశాయి. అడవులను జల్లెడ పడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి మణుగూరు డివిజన్‌, గుండాల, ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరు నాగారం, మహబూబాబాద్‌ అటవీ ప్రాంతాలలో మావోయిస్టు బలగాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. కరకగూడెం మండలంలోని అంగారుగూడెం, లిమ్మగూడెం, నీలాద్రిపేట, అశ్వాపురంపాడు వలస ఆదివాసీ గ్రామాలతో పాటు పినపాక మండలంలోనూ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఏటూరు నాగారం, తాడ్వాయి, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో దట్టమైన అటవీప్రాంతాలు ఉండగా.. ఆయా ప్రాంతాల్లో మావోయిస్టులు ఆశ్రయించి ఉండొచ్చన్న అనుమానాలతో పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. గతేడాది మార్చిలో కరకగూడెం మండలంలోని నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామ ప్రాంతంలో, మణుగూరు, కరకగూడెం సరిహద్దు మల్లెతోగు ప్రాంతంలో, పినపాక మండలంలోని అమరారం పిట్టతోగు ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టులు తలపడిన సందర్భాలున్నాయి. 

మూడురోజులుగా తనిఖీలు..

తాడ్వాయి మండలం కొడిశాల ఒడ్డుగూడెం, లింగాల, మహబూబాబాద్‌జిల్లాలోని గంగారం, పోపుగొండ్ల, కామరం నెర్సుగూడెం, దుబ్బగూడెం ప్రాంతాల్లోని అడవులను ప్రత్యేక గ్రేహౌండ్స్‌ పోలీసులు బలగాలు మూడు రోజులుగా జల్లెడ పడుతున్నారు. మావోయిస్టు యాక్షన్‌ టీం సంచరిస్తున్నట్టు సమాచారంతో పాటు కేకేడబ్ల్యూ కార్యదర్శి బడే చొక్కరావు అలీయాస్‌ దామోదర్‌తో పాటు మరో 20 మంది గ్రూపులుగా విడిపోయి పలు గ్రామాల్లో సంచరిస్తున్నట్టు ఉప్పందుకున్న పోలీసులు అడవులను ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి మావోయిస్టుల కదలికలున్నట్టు సమాచారంతో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునిల్‌దత్‌ గుండాల మండలంలో ఇటీవల పర్యటించారు. ములుగు, ఏటూరునాగారం, ఇల్లందు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఓఎస్డీ తిరుపతి నేతృత్వంలో రాష్ట్రంలో మావోయిస్టులు ఉండొద్దన్న లక్ష్యంతో పోలీసులు నిత్యం గాలింపు చర్యలకు దిగుతున్నారు. 

దాడులు.. ప్రతిదాడులు..

మూడు నెలల క్రితం హరిభూషణ్‌ అంగరక్షకుడు శంకర్‌ను మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు దేవలగూడెం వద్ద మట్టుపెట్టారు. ఓఎస్డీ తిరుపతి గన్‌మెన్‌ను ప్రతిఘటన గ్రూపుకు చెందిన భూపతి దళం మంగపేట మండలం కమలాపురంలో కాల్చి చంపారు. దీంతో రగిలిపోయిన పోలీసులు మావోయిస్టు న్యూడెమోక్రసి, జనశక్తి పార్టీలు గుండాల, పస్ర అడవుల్లో ఓ గుట్టపై సంచరిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ప్రతిఘటన పార్టీకి చెందిన దళ కమాండర్‌ భూపతిని మట్టుపెట్టారు. మావోయిస్టు పార్టీతో పాటు న్యూడెమోక్రసీ చంద్రన్న, రాయల వర్గం దళాలను కూడా మట్టుపెట్టేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల న్యూడెమోక్రసీ లీగల్‌ కార్యకర్తలు కూడా ఇల్లందు మండలంలోని మాణిక్యారం వద్ద అరెస్టు చేసి ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా వలస ఆదివాసీ గ్రామాలలో ఏడూళ్లబయ్యారం సీఐ రమేష్‌, కరకగూడెం ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌ కుమార్‌, గుండాల సీఐ సురేష్‌, ఎస్‌ఐ రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివాసులతో మాట్లాడి మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నారు. అనుమానితులుగా కనిపిస్తే వెంటనే సచాచారం అందించాలని కోరుతున్నారు. ‘సమాచారం మాకు.. బహుమతి మీకు’ అంటూ తొమ్మిది మంది మావోయిస్టుల ఫొటోలతో ముద్రించిన పోస్టర్లను మారుమూల గ్రామాల్లో అంటించారు. 

రెండు రాష్ట్రాల మధ్య ఆధిపత్య పోరు..?

తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ రాష్టానికి రావడంతో అక్కడ సమస్య తీవ్రమవుతోందని, రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు తెలంగాణలో పట్టు సాధించేందుకు దృష్టి సారించి అక్కడ క్యాడర్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా.. రెండువేల మంది మావోయిస్టులు నినాదాలు చేస్తూ.. ముగ్గురు మృతదేహాలను అడవి మార్గంలో తరలించి మరీ వాటిని ఖననం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దేవళ్లగూడెం సరిహద్దు ప్రాంతంలో మృతి చెందిన శంకర్‌ హరిభూషణ్‌కు అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. వైద్యం కోసం పట్టణ ప్రాంతానికి వెళ్తున్న ఆయన్ను పట్టుకొని బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని కొత్తగూడెం నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి శాంత ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు కొట్టిపడేశారు.

Follow Us on:
Advertisement