రక్షకుల్లో ‘అధికార’ దర్పం!

ABN , First Publish Date - 2022-08-19T05:00:25+05:30 IST

ప్రజల హక్కులకు, ఆస్తులకు ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే గుర్తుకు వచ్చేది పోలీసులే. ఇతరుల నుంచి ఏ కష్టం, నష్టం ఎదురైనా రక్షణ కోసం, న్యాయం కోసం తొలుత తొక్కే గడప పోలీస్‌స్టేషన. అంతటి మహోన్నత గల ఆ శాఖ జిల్లాలో అభాసుపాలవుతోంది.

రక్షకుల్లో  ‘అధికార’ దర్పం!

పోలీస్‌ శాఖపై సన్నగిల్లుతున్న నమ్మకం

వరుస ఘటనలతో మాయని మచ్చలు

అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదం

ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా లాఠీ దెబ్బలు

కమిషన్లు, ఉన్నతాధికారుల చెంతకు బాధితుల క్యూ

వారు ఆదేశిస్తే తప్ప చర్యలు తీసుకోని వైనం



వెంకటాచలం మండలం ఎగువమిట్టకు చెందిన నెల్లూరు చంద్రవేఖర్‌  స్థల వివాదం విషయమై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషనకు వెళ్లారు.  ఆయనకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు తన చేతులతోనే కిటికీ  కమ్మీలు పట్టించి పిరుదులపై, వీపుపైనా లాఠీలతో చితకబాదారని చంద్రశేఖర్‌ విలేకరుల ముందు బావురుమన్నాడు.


ఏఎస్‌ పేట మండలం పెద్దహబీపురంలో ఈ నెల 12వ తేదీన జరిగిన అవినీతిపై పంచాయతీ సమావేశంలో సర్పంచు మాధవరావు నిలదీశారు. ఆ మరుసటి రోజే సర్పంచు తండ్రి వెంగయ్యకు చెందిన మామిడితోటలో చెట్లను నరికేశారు. అధికార పార్టీ నాయకులను ప్రశ్నించినందుకే తమ తోటను ధ్వంసం చేసి ఉంటారని బాధితుడు వాపోయాడు. చివరకు బాధితులు ఆందోళన చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మర్రిపాడు, పొదలకూరు, వెంకటాచలం ఘటనలలో పోలీస్‌ ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఆదేశిస్తే తప్ప పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోలేదు.



నెల్లూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రజల హక్కులకు, ఆస్తులకు ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే గుర్తుకు వచ్చేది పోలీసులే. ఇతరుల నుంచి ఏ కష్టం, నష్టం ఎదురైనా రక్షణ కోసం, న్యాయం కోసం తొలుత తొక్కే గడప పోలీస్‌స్టేషన. అంతటి మహోన్నత గల ఆ శాఖ జిల్లాలో అభాసుపాలవుతోంది. న్యాయం చేయండి మహాప్రభో అంటూ బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషనలను ఆశ్రయిస్తున్నారు. జిల్లా పోలీసు అధికారులను కాదని  రాష్ట్ర ఉన్నతాధికారుల వద్దకూ పరుగులు తీస్తున్నారు. అంటే జిల్లా పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందా!? బాధితులు చేసే అభియోగాల్లో పోలీసు అధికారులే ఎందుకు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు!? సిబ్బందిపై శాఖాపరమైన చర్యల కోసం ప్రజా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎందుకొస్తోంది!? రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశిస్తే తప్ప కిందిస్థాయి అధికారులపై  చర్యలు తీసుకోలేకపోతున్నారు!? అంటే వీరి చేతిలో అధికారాలు లేవనా!? లేదా వీరిపై అధికార పార్టీ అజమాయిషీ చెలాయిస్తోందనుకోవాలా!? స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో జిల్లా ఇనచార్జి మంత్రి అంబటి రాంబాబు జిల్లాలో పోలీసుల పనితీరును ప్రశంసించారు. కేసుల దర్యాప్తులో వంద శాతం పురోగతి కనిపిస్తోందని కితాబిచ్చారు. గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే మంత్రి ప్రశంసలను స్వాగతించాల్సిందే. మరి శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే అశాంతి సృష్టిస్తున్నారనే ఆరోపణల గురించి ఎవరు పట్టించుకోవాలి. ఎవరు ప్రస్తావించాలి. ఎవరు సమాధానం చెప్పాలి.

వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాలెంకు చెందిన శాంతి అనే మహిళ తన భర్తను అజయ్‌ అనే వ్యక్తి తన కళ్లముందే హత్య చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయడంతో ఆమె ఎస్సీ, ఎస్టీ కమిషనను ఆశ్రయించింది. విచారణలో వాస్తవాలు తెలుసుకున్న కమిషన వెంకటాచలం సీఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

పొదలకూరు మండలంలో దళిత కార్మికుడు ఉదయగిరి నారాయణ బలవన్మరణం చేసుకున్నారు. ఈ మరణానికి పొదలకూరు పోలీసుల వేధింపులే కారణమని మృతుడి భార్య పద్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా పట్టించుకోలేదు. చివరికి ఎస్సీ, ఎస్టీ కమిషనకు ఫిర్యాదు చేయడం, వారి రాకతో బాధితురాలికి  న్యాయం జరిగింది. 

మర్రిపాడులో పని చేసిన ఒక ఎస్‌ఐ ప్రజల పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించారో ఒక పుస్తకమే రాయొచ్చు. చిట్టచివరికి ఈయన వేధింపులకు తట్టుకోలేక తిరుపతి అనే దివ్యాంగుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే తప్ప ఈ ఎస్‌.ఐని అక్కడి నుంచి తప్పించలేదు. ఈయన్ను సస్పెండ్‌ పట్ల మండల ప్రజలు పండుగ చేసుకున్నారంటే ప్రజల్లో ఆయన ఎంత పేరు తెచ్చుకున్నారో అర్థమవుతుంది. 

ఇవి ఉదాహరణలు మాత్రమే. రాజకీయ నాయకుల మెప్పు కోసం సామాన్య ప్రజలపై లాఠీల నాట్యం చేయించిన సంఘటనలు జిల్లాలో చాలానే చోటు చేసుకున్నాయి.


పై నుంచి చెబితేనే చర్యలు


ప్రజలకు అర్థం కాని విషయం ఏమంటే రాష్ట్ర ఉన్నతాధికారులో, ఎస్సీ, ఎస్టీ కమిషన స్పందిస్తే తప్ప ఆరోపణలు ఎదుర్కొన్న కిందిస్థాయి అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారులు చెబితే తప్ప మర్రిపాడు, పొదలకూరు ఎస్‌ఐలపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వెంకటాచలం సీఐపై చర్యలకు ఎస్సీ కమిషన ఆదేశించిన క్రమంలో ఒకటీ రెండు రోజుల్లో శాఖ పరమైన చర్యలు తీసుకుంటారేమో. ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొన్న సీఐ, ఎస్‌ఐలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారనే నమ్మకం సన్నగిల్లడంతో బాధితులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారన్న వాదనకు ఈ సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. 


పవర్‌ మొత్తం నేతల చేతుల్లోనే!


ప్రజాప్రతినిధులు తమ పరిధిలో తమకు నచ్చిన ఉద్యోగులను నియమించుకోవడానికి సిఫార్సులు చేయడం సహజం. ఇంతరవకు ఫర్వాలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో నేతలు పరుధులు దాటారు. నియామకాల వరకే కాదు.. వారు తప్పు చేసినా చర్యలు తీసుకోకూడదని జిల్లా ఉన్నతాధికారులకు హుకుం జారీ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు విమర్శలు ఉన్నాయి. తాము ఏం చేసినా తమ నాయకుడు కాపాడుతాడనే నమ్మకం కొంతమంది అధికారుల చేత తప్పులు చేయిస్తోంది. మిగిలిన శాఖల పరిధిలో అయితే పర్లేదు కానీ పోలీసు శాఖలో ఇలాంటి పరిస్థితి రావడం, అధికారాలు మొత్తం అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి ఇచ్చేయడంతో పరిస్థితి చేజారిపోతోంది. పోలీసు శాఖ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. పోలీస్‌ అంటే ప్రజలకు ఒక నమ్మకం. ఆ శాఖకు ఉన్నతాధికారి అంటే మరింత నమ్మకం. ఆ నమ్మకం నిలబడే రోజులు రావాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. 

Updated Date - 2022-08-19T05:00:25+05:30 IST