నిద్రపోతున్న నిఘా..!

ABN , First Publish Date - 2022-08-06T06:11:15+05:30 IST

ఇటీవల మాదాపూర్‌ పరిధిలో తుపాకీ కాల్పుల ఘటన కలకలకం సృష్టించింది.

నిద్రపోతున్న నిఘా..!

పాత నేరస్థుల కదలికలపై దృష్టి పెట్టని పోలీసులు

జైలు నుంచి బయటకు వచ్చి  ముఠాలుగా ..

నేరాలు జరిగినప్పుడే హడావిడి

జియో ట్యాగింగ్‌ ఉత్తమాటేనా?


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి):  జైల్లో జతకట్టిన రౌడీషీటర్లు బయటకు వచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ రౌడీషీటర్‌ మరో రౌడీషీటర్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. వారు పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చాక తుపాకుల వంటి మారణాయుధాలతో తిరుగుతున్నా పోలీసులు గుర్తించలేకపోయారు.

జైలు నుంచి వచ్చిన 4 రోజులకే.. 

కొద్దిరోజుల క్రితం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించి నిందితున్ని పట్టుకున్నారు.. కట్‌ చేస్తే అతనో పాత ఘరానా దొంగ. జైలు నుంచి బయటకు వచ్చి సరిగ్గా నాలుగు రోజులైంది. వచ్చిన వెంటనే రెక్కీ చేసి భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అప్పటికే అతనిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. భారీ చోరీ జరిగితే తప్ప.. జైలు నుంచి బయటకు వచ్చిన ఆ ఘరానా దొంగ ఏం చేస్తున్నాడు..? ఎక్కడుంటున్నాడు..? అన్న విషయంపై పోలీసులు దృష్టి సారించడం లేదు. 

జైల్లో జతకట్టి ముఠాలుగా..

ఇటీవల ఓ గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి నగరానికి స్మగ్లింగ్‌ చేసి కస్టమర్స్‌కు సప్లై చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల ముఠాను అరెస్టు చేసి విచారించగా వారంతా జైల్లో పరిచయం అయినట్లుగా తేలింది. ఇలా ఎన్నో ముఠాలు తయారవుతున్నాయి.

మారణాయుధాలతో సంచారం

ఇటీవల ఓ యువకుడు మారణాయుధాలను దుస్తుల్లో దాచుకొని బైక్‌పై తిరుగుతుండగా రాచకొండ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అతను గతంలో ఓ హత్యాయత్నం కేసులో జైలుకెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ప్రత్యర్థులు దాడి చేస్తారేమోననే భయంతో మారణాయుధాలతో తిరుగుతున్నట్లు విచారణలో తేలింది. ట్రై  కమిషనరేట్స్‌ పరిధిలో ఇలాంటి పాత నేరస్థులు వందలాది మంది ఉన్నట్లు అంచనా. వారిపై పోలీస్‌ నిఘా కొరవడడంతోనే ముఠాలుగా ఏర్పడి రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత నేరస్థులే మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నా పోలీసులు వారి కదలికలపై దృష్టి సారించడంలేదని తెలుస్తోంది. 

జియోట్యాగింగ్‌ మాటేంటి?

నేరస్థులు, రౌడీషీటర్స్‌, గూండాల ఇళ్లకు జియోట్యాగింగ్‌ చేశామని పోలీసులు ఎన్నికల సమయంలో చెబుతుంటారు. అంటే వారి కదలికలపై పూర్తి నిఘా ఉంటుందన్న మాట. ఎన్నికలు ముగిసిన తర్వాత యథా పోలీస్‌.. తథా నేరస్థులు అన్నట్లుగా వదిలేస్తున్నారు. దాంతో నేరస్థులు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జియోట్యాగింగ్‌ను అలాగే కొనసాగించి ప్రత్యేక సిబ్బందితో నేరస్థుల కదలికలపై దృష్టి సారిస్తే.. సాంకేతిక దన్నుతో ఎన్నో నేరాలను ముందస్థుగా నివారించొచ్చని పలువురు పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు.




మధ్యప్రదేశ్‌లో తుపాకీ కొనుగోలు

నగరంలో అమ్మకానికి

నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లో తుపాకీ కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు యత్నిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. దేశవాళీ తుపాకీ, 8 లైవ్‌ రౌండ్‌ బుల్లెట్స్‌, మొబైల్‌ స్వాధీనం చేసుకున్నారు. జవహర్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాకేష్‌ త్యాగి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జవహర్‌నగర్‌ దమ్మాయిగూడలో ఉంటున్నాడు. అతడి తండ్రి రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి. హైదరాబాద్‌లో దేశవాళీ తుపాకీలకు డిమాండ్‌ ఉందని తెలుసుకున్న త్యాగి.. తన బావమరిది సహకారంతో మధ్యప్రదేశ్‌లో రూ. 50 వేలు వెచ్చించి తుపాకీ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చాడు. నగరంలోని దానిని విక్రయించాలని అనుకున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తన బృందంతో జవహర్‌నగర్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా త్యాగి ఇంటిపై దాడిచేశారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. జవహర్‌నగర్‌ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. అతని బావ మరిది ఆశిష్‌ త్యాగి పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2022-08-06T06:11:15+05:30 IST