వారాంతపు సెలవు ఏమైనట్టు..?

ABN , First Publish Date - 2022-05-15T06:08:12+05:30 IST

పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటిస్తున్నాం. అందరు ఉద్యోగుల మాదిరిగానే వారాంతపు సెలవులు తీసుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నాం. ఈ మాట 2019లో సీఎం జగన్‌ నోట నుంచి వచ్చింది. ఈ ప్రకటనతో పోలీసు సిబ్బంది సహా వారి కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రెండేళ్లు పూర్తయినా క్షేత్రస్థాయిలో ఈ ఉత్తర్వులు అమలు కావడంలేదు. ప్రారంభంలో కొన్నిచోట్ల అమలైనప్పటికీ ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా అమలవుతున్న దాఖలాలులేవు. దీంతో పోలీసులు సర్కార్‌పై రగిలిపోతున్నారు.

వారాంతపు సెలవు ఏమైనట్టు..?

  • పెరిగిన పని భారం.. తీవ్ర ఒత్తిడిలో పోలీసులు
  • హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంపై రగిలిపోతున్న ఖాకీలు
  • ప్రభుత్వ ఆదేశాల అమలులో అధికారుల వెనకడుగు

తుని, మే 14: పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటిస్తున్నాం. అందరు ఉద్యోగుల మాదిరిగానే వారాంతపు సెలవులు తీసుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నాం. ఈ మాట 2019లో సీఎం జగన్‌ నోట నుంచి వచ్చింది. ఈ ప్రకటనతో పోలీసు సిబ్బంది సహా వారి కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రెండేళ్లు పూర్తయినా క్షేత్రస్థాయిలో ఈ ఉత్తర్వులు అమలు కావడంలేదు. ప్రారంభంలో కొన్నిచోట్ల అమలైనప్పటికీ ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా అమలవుతున్న దాఖలాలులేవు. దీంతో పోలీసులు సర్కార్‌పై రగిలిపోతున్నారు.

జిల్లాల విభజనతో...

సిబ్బంది కొరత కారణంగా కొన్నిచోట్ల.. సిబ్బంది ఉన్నా మరికొన్నిచోట్ల మొత్తంగా అన్నిచోట్లా పోలీసులకు వారాంతపు సెలవు అమలు కావడం లేదు. పెరిగిన పనిభారం కారణంగా ముఖ్యంగా కానిస్టేబుల్‌ స్థాయిలో తీవ్ర ఒత్తిడిలో నలిగిపోతున్నారు. కానిస్టేబుల్‌ స్థాయి నుంచి సీఐ స్థాయి వరకు వీక్లీ ఆఫ్‌ వర్తించేలా ప్రభుత్వం 2019, జూన్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. స్టేషన్‌లోని మొత్తం సిబ్బందిలో ప్రతి ఏడుగురిలో ఒకరు చొప్పన ప్రతిరోజూ వీక్లీ ఆఫ్‌ తీసుకోవాలి. సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నచోట కూడా స్టేషన్‌ అధికారి దయపైనే వారాంతపు సెలవు ఆధారపడి ఉంటోంది. జిల్లాల విభజనకు ముందు రాజమహేద్రంవరం మినహాయిస్తే మొత్తం 2755మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. విభజన అనంతరం కాకినాడ జిల్లాకు 1141, కోనసీమ జిల్లాకు 941, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరులో కలిసిపోవడంవల్ల 539మంది, రాజమహేంద్రవరం జిల్లాకు 134మందిని విభజించారు. దీంతో సిబ్బంది సంఖ్య బాగా తగ్గిపోయింది. కరోనా సమయంలో పోలీసుల ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు. అలాంటి విపత్కర సమయాల్లో కూడా రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరాయంగా డ్యూటీ చేశారు. అధికారుల సైతం సిబ్బందితో విశ్రాంతి లేకుండా పనిచేయిస్తున్నారు.  

సిబ్బంది కొరత కారణంగా..

తుని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 55మంది సిబ్బందికిగాను 44మందే ఉన్నారు. అన్నిస్థాయిల్లో 11మంది కొరత ఉంది. ఈ కారణంగా వీరికి వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఉన్న సిబ్బందిలో బయట డ్యూటీలు, ఇతర స్టేషన్‌ అటాచ్‌మెంట్‌లకు 10 మంది విధులు నిర్వర్తిస్తారు. దీంతో సిబ్బంది కొరత మరింత పీడిస్తుండడంతో ఉన్నతాధికారులు సెలవుకు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సమస్య జిల్లాలో చాలా చోట్ల ఉంది. సిబ్బంది కొరత ఉన్నా స్టేషన్‌లోని ప్రతి ఏడుగురిలో ఒకరికి వారానికోసారి వీక్లీ ఆఫ్‌ అమలు చేయాలన్నదే నిబంధన. అది అమలు కావడం లేదు.

వీక్లీ ఆఫే కాదు.. లీవూ లేదు..

వీక్లీ ఆఫ్‌ ప్రకటించి రెండేళ్లవుతున్నా మా వరకు వచ్చేసరికి అమలు కావడం లేదు. వీక్లీ ఆఫ్‌ అటుంచితే వ్యక్తిగత సెలవు పెట్టాలన్నా, మా విధుల్ని మరొకరికి అప్పగించి రావాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుంటే పర్సనల్‌ లీవ్‌ దొరకడం కష్టం. వారానికి ఒకసారి కూడా భార్యా పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నాం. వీక్లీ ఆఫ్‌ల గురించి ప్రభుత్వం ఇచ్చిన జీవోను అధికారులు క్షేత్రస్థాయిలో అమలు చేయాలి.

- తుని పట్టణానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ ఆవేదన ఇది

Updated Date - 2022-05-15T06:08:12+05:30 IST