కేసు రివర్స్‌

ABN , First Publish Date - 2021-11-26T06:25:22+05:30 IST

కొండపల్లి పురపాలక రాజకీయాలు కొత్త నేరం ముందుకు తెచ్చాయి.

కేసు రివర్స్‌
రెండు రోజుల క్రితం కొండపల్లి మునిసిపల్‌ కార్యాలయం వద్దకు దూసుకువచ్చిన వైసీపీ నేతలు.. ఈ అరాచకంపై కేసులే లేవా?

ప్రతిపక్ష నేతలపై ‘కొవిడ్‌ నిబంధలన ఉల్లంఘన’ అస్త్రం

కొండపల్లిలో పోలీసుల ఓవరాక్షన్‌!

ఓటమిని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే

టీడీపీ నేతలపై కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిళ్లు

ఆగమేఘాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు

వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించినా కేసుల్లేవు


కొండపల్లి పురపాలక రాజకీయాలు కొత్త నేరం ముందుకు తెచ్చాయి. మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికలో తమవారిని నెగ్గించుకున్న ప్రతిపక్ష నాయకులను వేధించేందుకు అధికార పార్టీకి ‘కొవిడ్‌ నిబంధనలు’ అస్త్రంగా మారాయి. ఆది నుంచీ ‘ఉల్లంఘనులు’ అధికార పార్టీ నేతలు కాగా, కొండపల్లి ఎన్నికల పరాభవంతో ప్రతిపక్ష నేతలపై రివర్స్‌ కేసు పెట్టడమే విచిత్రం. కొండపల్లి మున్సిపాలిటీని దక్కించుకునేందుకు అన్ని మాయోపాయాలనూ ‘అరాచకం’గా ప్రదర్శించిన అధికార పార్టీ చివరికి అనుకున్నది కాలేదని పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దండనకు దిగింది. వారి ఒత్తిళ్లకు తలవొగ్గిన పోలీసులు ప్రతిపక్ష టీడీపీ నాయకులపై కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేశారు. అదే సమయంలో కార్యాలయం వెలుపల అడ్డువచ్చిన పోలీసులను గాయపరిచి, కార్యాలయంలో విధ్వంసానికి దిగిన అధికార పార్టీ సభ్యుల అరాచకం నేరమే కానట్టు పోలీసులు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో విపక్ష నేతలను వేధింపులకు గురిచేసేందుకు పోలీసులు ‘కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘన’ అస్త్రం ప్రయోగిస్తున్నారు. అధికార పార్టీ నేతలు పాటించని కొవిడ్‌ నిబంధనలు.. ప్రతిపక్ష నాయకులు మాత్రం పాటించాలి. కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీకి ఆధిక్యం లభించినా, దౌర్జన్యంగానైనా తమ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ చేయని ప్రయత్నాలు లేవు. టీడీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టడం మొదలు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరగకుండా చేయడం వరకు అన్ని రకాలుగా ఆయన విఫలయత్నాలు చేశారు. చివరికి కోర్టు జోక్యంతో పెదవి విప్పలేక ‘కోర్టు తీర్పు శిరోధార్యం’ అంటూ పక్కకు తప్పుకున్నారు. అయితే కొద్ది గంటల్లోనే టీడీపీ నాయకులపై తన అక్కసు తీర్చుకునేందుకు పోలీసులపై ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దీంతో పోలీసులు ప్రతిపక్ష నేతలపై కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన పేరుతో కేసులు నమోదు చేశారు. 


నిరసనలో పాల్గొనకపోయినా దేవినేని ఉమపై కేసులు..

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని, జనసమూహంతో బైక్‌ ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్చడం ద్వారా, జాతీయ రహదారిపై ప్రయాణికులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ ఇబ్రహీంపట్నం, భవానీపురం పోలీస్‌స్టేషన్లలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితర టీడీపీ నేతలపై రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. వాస్తవానికి పోలీసులు పేర్కొన్న రెండు ఘటనల్లోనూ దేవినేని ఉమ ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు. కానీ ఆయనపై కేసులు నమోదు చేశారు. నిరసనలు.. ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణగదొక్కడమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. 


వీరికి నిబంధనలు పట్టవా..!

కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలో ప్రతిపక్ష పార్టీ నేతల కంటే అధికార వైసీపీ నాయకులే ముందంజలో ఉన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సోమవారం వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వీరంగం వేశారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికను అడ్డుకునేందుకు కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. కౌన్సిల్‌ హాల్లో బల్లలు, కుర్చీలను విరగ్గొట్టారు. కార్యాలయం వెలుపల వందలాది మంది కార్యకర్తలు గుమిగూడి, పోలీసులపైనా దాడికి యత్నించారు. వారి దాడిలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ గాయపడ్డారు. అయినా వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసే ధైర్యం పోలీసులు చేయలేకపోయారు. కేవలం రాజకీయ ఒత్తిళ్లతో ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా పోలీసులు ‘కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన’ అస్త్రాన్ని వాడుకుంటున్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక సజావుగా జరగకుండా వైసీపీ నాయకులు రెండు రోజులపాటు వీరంగం వేసినా పోలీసులు నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయారే తప్ప వారిని అడ్డుకోలేదు. హైకోర్టు అక్షింతలు వేస్తేగానీ పోలీసులకు తమ విధులు గుర్తుకు రాలేదు. 


సీఎం నోట కొండపల్లి మాట!

‘దేవుడి దయతో ఆ కొండపల్లి కూడా వస్తే మరో బీసీ పెరుగుతారు అధ్యక్షా..! అక్కడ టై అయింది అధ్యక్షా..’ గురువారం అసెంబ్లీలో సీఎం జగన్‌ నోట వెలువడిన మాటలివి. కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం దక్కినా, ఆ విషయాన్ని మరుగునపర్చి, అసెంబ్లీ సాక్షిగా సీఎం అవాస్తవాలు చెప్పడం ఏమిటని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఎంపీ కేశినేని నాని ఎక్స్‌ అఫిషియో ఓటు హక్కుపై న్యాయస్థానంలో సానుకూలంగా తీర్పు వస్తే సీఎం జగన్‌ క్షమాపణ చెబుతారా? అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. 

Updated Date - 2021-11-26T06:25:22+05:30 IST