జిల్లా వ్యాప్తంగా పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-10-24T05:10:44+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కిరాణాలు, పాన్‌షాపులు, ఇతర దుకాణాలపై శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పోలీసులు దాడులు నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా పోలీసుల దాడులు
గద్వాల పట్టణంలోని కిరాణం దుకాణంలో తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ

- కిరాణ, పాన్‌ షాపుల్లో తనిఖీలు

- పలు చోట్ల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం 

- నిందితులపై కేసులు నమోదు

గద్వాల క్రైం/అయిజ/రాజోలి/గట్టు/అలంపూర్‌ చౌరస్తా, అక్టోబరు 23 : జిల్లా వ్యాప్తంగా కిరాణాలు, పాన్‌షాపులు, ఇతర దుకాణాలపై శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాలలో గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని గాంధీచౌక్‌ సమీపంలో ఉన్న ప్రహ్లాద్‌ దుకాణంలో, గంజిపేట కాలనీలోని ప్రకాష్‌శెట్టి దుకాణంలో, కృష్ణారెడ్డి బంగ్లా సమీపంలో ఉన్న దీపక్‌రావు దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. దాదాపు రూ. 30 వేల విలువైన గుట్కాపాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యజమానులపై కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు ఉన్నా, విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసినా, వెంటనే 100 కాల్‌ చేయాలని, లేదా 9494921100 నెంబర్‌ వాట్సాప్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు వారికి తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు. 


- అయిజ పట్టణంలోని కిరాణం దుకాణాలు, పాన్‌ షాపులపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పట్టణంలోని 15 దుకాణాలలో ఎస్‌ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో ట్రైనీ ఎస్‌ఐ బాలరాజు, పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అందులో రెండు దుకాణాల్లో గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దుకాణాదారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ముత్తయ్య తెలిపారు. 


- రాజోలిలోని కిరాణాలు, ఇతర దుకాణాల్లో శనివారం ఎస్‌ఐ లెనిన్‌  ఆధ్వర్యంలో తనిఖీలు కార్యక్రమంలో ట్రైనీ ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


- ఉండవల్లి మండలంలోని బొంకూరు, అలంపూర్‌ చౌరస్తా ప్రాంతాల్లో ఎస్‌ఐ జగన్‌మోహన్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అలంపూర్‌ చౌరస్తాలోని బాలాజీ కిరాణం దుకాణంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభించాయి. దీంతో షాపు యాజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-10-24T05:10:44+05:30 IST