పోలీసు వ్యవస్థ – రాజ్యాంగ నిర్దేశాలు

ABN , First Publish Date - 2020-06-03T09:17:30+05:30 IST

అమెరికా రగిలిపోతోంది. జార్జి ఫ్లాయిడ్ అనే ఒక నల్ల జాతీయుడిని ఒక పోలీసు అధికారి గొంతుపై కాలు తొక్కిపెట్టి చంపినందుకు నిరసనగా గత వారం రోజులుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ ముందు కూడా సైన్యానికీ...

పోలీసు వ్యవస్థ – రాజ్యాంగ నిర్దేశాలు

ప్రభుత్వాలు తమ వైఫల్యం కప్పి పుచ్చుకునేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కద్దు. అమెరికా అధ్యక్షుడి నుంచి మన దేశంలో ఒక రాష్ట్ర సీఎం వరకూ పోలీసు వ్యవస్థను తమ ప్రయో జనాలకు ఉపయోగించుకుంటున్నారు. ఎటొచ్చీ అమెరికా వంటి దేశాల్లో పోలీసు అఘాయిత్యాలపై ప్రజా నిరసన కనపడుతుంది. మన దేశంలో ప్రతి రోజూ అనేక ప్రాంతాల్లో ప్రజలపై పోలీసు దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. మన పోలీసులు ప్రజలను మోకాళ్లపై వంచుతారు కాని, అమెరికాలో వలె వారు వంగి క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవు.


అమెరికా రగిలిపోతోంది. జార్జి ఫ్లాయిడ్ అనే ఒక నల్ల జాతీయుడిని ఒక పోలీసు అధికారి గొంతుపై కాలు తొక్కిపెట్టి చంపినందుకు నిరసనగా గత వారం రోజులుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ ముందు కూడా సైన్యానికీ, ప్రదర్శన కారులకూ మధ్య ఘర్షణలు జరిగాయి. కనీసం 25 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరసన కారులపై సైన్యాన్ని ఉసికొల్పుతూ అణిచివేస్తానని హెచ్చరిస్తున్నారు. అనేక చోట్ల జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లపై కూడా పోలీసులు, సైన్యం దాడులు చేస్తున్నారు. లిండా టిరాడో అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు కంటికి గురిపెట్టి పోలీసులు రబ్బర్ బుల్లెట్ కాల్చడంతో ఆమె కన్నును కోల్పోయారు. ఈ విషయం ఆమె ట్విట్టర్‌లో పెట్టినప్పుడు అనేక దేశాలనుంచి స్పందనలు వచ్చాయి. 


అమెరికా వంటి ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపడం, అమెరికా అధ్యక్షుడినే నిలదీయడం, మీడియా అధికారులను, నేతలను తూర్పారబట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. వైట్‌హౌస్‌లోనే విలేఖరులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ వాదనలకు దిగుతుంటారు. భారత దేశానికి ట్రంప్ ప్రత్యేక విమానంలో వచ్చిన విలేఖరులే ఆయనపై వ్యంగ్యమైన వ్యాఖ్యానాలు చేశారు. ‘మీ చరిత్ర మాకు తెలుసులే..’ అని ఒక విలేఖరి ట్రంప్ ముఖానే అన్నారు. ‘నిర్మాణాత్మకంగా మీరు మాట్లాడేది ఏమీ లేకపోతే నోరు మూసుకోండి,’ అని హ్యూస్టన్ పోలీసు అధికారి ట్రంప్‌కు స్పష్టంగా చెప్పారు. చాలా చోట్ల పోలీసులు మోకాళ్లపై వంగి ప్రజలను క్షమాపణ కోరారు. నల్లజాతీయుడిని చంపిన అధికారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్ల జాతీయుడి దురంతంపై ట్రంప్ వ్యవహరించిన తీరు స్పష్టంగా ఆయనలో కనపడుతున్న అభద్రతా భావాన్ని స్పష్టం చేస్తున్నది. జరుగుతున్న పరిణామాలు త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న భయం ఆయనలో కనపడుతున్నది. అందుకే తాను సర్వసైన్యాధిపతినని, ఏమైనా చేయగలనని వీరంగం వేస్తున్నారు. 


మన దేశంలో ప్రజలు అంత చైతన్యంగా ఉన్నారా, మీడియా అంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదా అన్న విషయం చెప్పడం కష్టం. ఇక్కడ పేరుకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులో ఉన్నప్పటికీ వ్యక్తి ఆధారిత ప్రజాస్వామ్యం నడుస్తున్నది. వ్యక్తి చుట్టూ వ్యవస్థలు తిరగడం, వారి కొమ్ము కాయడం స్పష్టంగా కనపడుతున్నది. కార్మిక చట్టాల విషయంలో అంతర్జాతీయ ఒడంబడికలకు తగ్గట్లు నడుచుకుంటామని ప్రభుత్వం చెబుతుంది కాని శాంతి భద్రతలకు, పోలీసు హింసకు సంబంధించిన విషయాలపై అంతర్జాతీయ ఒడంబడికలేవీ ఇక్కడి ప్రభుత్వం పాటించదు. కొన్ని బిల్లుల విషయంలో రాష్ట్రాల ప్రమేయం లేకుండా రాష్ట్రాల అధికారాలను చేజిక్కించుకుంటూ చట్టాలు చేసే కేంద్రం పోలీసుల హింసను నిరోధించే బిల్లు విషయంపై రాష్ట్రాలు మౌనం పాటించినా ఏమీ చేయదు. కస్టడీల్లో హింసాకాండను నిరోధించేందుకు ప్రతి ప్రభుత్వమూ చట్టపరమైన, పరిపాలనా పరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, అమానుష వ్యవహార శైలి, శిక్షలను వ్యతిరేకించాలని చెప్పే ఐక్యరాజ్యసమితి ఒడంబడికపై భారత దేశం సంతకం చేసింది. గత డిసెంబర్‌లో ఈ విషయాన్ని పార్లమెంటులో ఒక సభ్యుడు ప్రశ్నించినప్పుడు ఈ ఒడంబడిక గురించి వివరించిన హోం శాఖ, నిందితుల నుంచి తాము అనుకున్నది రాబట్టేందుకు వారిపై హింస ను ప్రయోగించడం భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 330, 331 క్రింద శిక్షార్హమని అంగీకరించింది. లా కమిషన్ తన 273వ నివేదికలో చెప్పిన ప్రకారం హింసాకాండను నిరోధించే బిల్లు, 2017ను ప్రవేశపెట్టాలనుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాఖ్యల కోసం ఆ బిల్లును పంపామని చెప్పింది. కాని 2017 నుంచి ఇప్పటి వరకూ కేవలం నాలుగు రాష్ట్రాలనుంచే అంగీకారం వచ్చినా కేంద్రం ఏమీ చేయకుండా మౌనం పాటించింది. 


నిజానికి ఈ బిల్లు ఇప్పటిది కాదు. 2010 లోనే ఒకసారి ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీ సవరణలను ప్రతిపాదించింది. కాని 15వ లోక్‌సభ రద్దు కావడంతో దానికి కాలదోషం పట్టింది. ఐక్యరాజ్యసమితి ఒడంబడికకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మాజీ న్యాయమంత్రి అశ్వనీకుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేంద్రం లా కమిషన్‌కు నివేదించింది. హింసాకాండ అనేది బలహీనమైన వ్యక్తిపై బలమైన వ్యక్తి ప్రయోగించే ఆయుధమని, అది మానవ నాగరికతలో చీకటి కోణాన్ని తెలియజేస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ ఒడంబడికలపై సంతకం చేయకముందే మన రాజ్యాంగంలో అధికరణలు 20, 21, 22 నిందితుడిపై బలప్రయోగాన్ని, జీవించే హక్కును, అరెస్టు నుంచి కాపాడుకునే హక్కును కల్పించాయని; సాక్ష్యాధారాల చట్టం, శిక్షా స్మృతిలో కూడా హింసాకాండకు వ్యతిరేకమైన అంశాలున్నాయని లా కమిషన్ గుర్తు చేసింది. పోలీసు అత్యాచారాలను సహించడమంటే చట్టపరమైన పాలనను కాలరాయడాన్ని అంగీకరించడమేనని కమిషన్ స్పష్టం చేసింది.


నిజానికి పోలీసుల హింసాకాండకు సంబంధించి సరైన చట్టాలు లేనందువల్లే వారు బహిరంగంగా హింసాకాండకు దిగినా, ప్రజలను భౌతికంగా శిక్షించే హక్కును తీసుకున్నా ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ను అమలుచేసే విషయంలో చాలా చోట్ల పోలీసులు అతిక్రూరంగా వ్యవహరించిన దృశ్యాలు బయటపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో పాలకోసం వెళ్లిన ఒకవ్యక్తిని పోలీసులు కొట్టి చంపడంతో అతడు మరణించాడు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసులను పట్టించుకునే పరిస్థితి కనపడడం లేదు. ఈ పరిణామాలవల్ల పోలీసులకూ రాజకీయ పార్టీల కార్యకర్తలకూ తేడా లేకుండా పోతోంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అనుగుణంగా పోలీసులు నడుచుకుంటే వారి ప్రయోజనాలు కూడా నెరవేరుతాయని తేలినప్పుడు ఏ పోలీసులు అధికార పార్టీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారు? పోలీసుల నేరాలకు శిక్ష పడాలని ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కోరుకుంటుంది? అందుకే దేశంలో చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ప్రభుత్వం వారిని రక్షించడం స్పష్టంగా కనపడుతోంది. విశాఖపట్టణం జిల్లాలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో సస్పెండ్ చేయడంతో సరిపెట్టుకోకుండా పోలీసులు అతడిని హింసించిన తీరు, అతడిని పిచ్చాసుపత్రికి పంపించిన తీరు అధికార పార్టీకీ, పోలీసులకూ ఉన్న కుమ్మక్కుకు నిదర్శనం. ఈ విషయంపై హైకోర్టు తీవ్రంగా స్పందించినందువల్లే పోలీసులపై కేసులను నమోదు చేయమని, సుధాకర్ కేసును సిబిఐకి అప్పగించమని ఆదేశించాల్సివచ్చింది. కాని క్రియాశీలక న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజలకెవరు న్యాయం చేస్తారు?


టాటా ట్రస్ట్ తరఫున సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య గత ఏడాది ‘ఇండియా జస్టిస్’ పేరిట రూపొందించిన నివేదికను చదివితేనే మన దేశంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుతెన్నులు అర్థమవుతాయి. మన దేశంలో కేవలం 6.4 శాతం మంది పోలీసులకు మాత్రమే సర్వీసులో శిక్షణ లభిస్తుంది. మిగతా వారికి ఎలాంటి శిక్షణా ఉండదు. రిజర్వుడు కేటగరీల్లో పోలీసు ఉద్యోగాల్లో ఖాళీలు అత్యధికం. దేశంలోని 24 లక్షలమంది పోలీసుల్లో మహిళా పోలీసులు కేవలం 7 శాతం మాత్రమే. 2016 నాటికి ఎలాంటి విచారణ లేకుండా కోర్టుల్లో మగ్గుతున్న ఖైదీలు 67.7 శాతం ఉన్నారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి నాలుగు కేసుల్లో ఒక కేసు అయిదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నది. పదేళ్లుగా 23లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నా యి. పోలీసులు, జైళ్లు, న్యాయవ్యవస్థ, న్యాయసహాయం విషయంలో చెప్పుకోదగ్గ, నిర్మాణాత్మక సంస్కరణలు లేనందువల్లే చట్టపరమైన న్యాయానికి విఘాతం కలుగుతోందని, ప్రజలకు పాలనా వ్యవస్థపై విశ్వాసం లేకుండా పోతోందని జస్టిస్ వెంకటాచలయ్య తన నివేదికలో తెలిపారు. అందరికీ అందుబాటులో భరించదగ్గ, నిష్పాక్షికమైన, సమర్థమైన, స్పందించదగ్గ న్యాయవ్యవస్థ లేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ కొద్దిమంది బలమైన, అధికారంగల వారికి మాత్రమే అందుబాటులో ఉన్నదని తెలిపారు.


వ్యవస్థలు కుప్పకూలిపోవడం, ప్రజలకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలం కావడం జరుగుతోందని, నాయకులు మాట్లాడే మాటల్లో పస లేదని, వారు ప్రకటించే ప్యాకేజీలు బూటకమని, వారు ప్రజలను విభజించి, పాలించి పబ్బం గడుపుకుంటున్నారని రోజురోజుకూ తేలిపోతోంది. వ్యవసాయ రంగం మొదలు అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొంటున్నది. ఈ క్రమంలో ప్రభుత్వాలు తమ వైఫల్యం కప్పి పుచ్చుకునేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం సహజం. డోనాల్డ్ ట్రంప్ నుంచీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ అదే ఆయుధంగా ఉపయోగపడుతోంది. ఎటొచ్చీ అమెరికా వంటి దేశాల్లో ఒక వ్యక్తి గొంతు నొక్కితే ప్రజా నిరసన కనపడుతుంది. మన దేశంలో ప్రతి రోజూ అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రజలపై బలప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. మన దేశంలో పోలీసులు ప్రజలను మోకాళ్లపై వంచుతారు కాని వారు వంగి క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవు. పాశ్చాత్య ప్రమాణాలు మన దేశానికి పనికి రావని మన దేశ హోంమంత్రి ఎప్పుడో చెప్పారు కదా!


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-06-03T09:17:30+05:30 IST