రాజకీయ వేడి!

ABN , First Publish Date - 2021-01-17T06:00:38+05:30 IST

శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు.. కక్ష సాధింపులు..

రాజకీయ వేడి!
ఎస్పీ అమిత్ బర్డర్‌కు వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నాయకులు.. (ఇన్‌సెట్‌లో: దిమ్మెపై వెలసిన నంది విగ్రహం)

వరుస ఘటనలతో అధికార, విపక్షం మధ్య మాటల యుద్ధం

పోలీస్‌స్టేషన్లలో ఇరువర్గాల ఫిర్యాదు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు.. కక్ష సాధింపులు, వేధింపుల చుట్టూ తిరుగుతున్నాయి. నేతల విగ్రహాల ధ్వంసం, స్వతంత్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు వంటి సంఘటనలు వరుసగా జరుగుతుండడం ఆందోళన కలిగించింది. అధికార,  ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తాజాగా పలాసలో టీడీపీ సోషల్‌ మీడియా సభ్యుడి అరెస్ట్‌, కేసు నమోదుతో మరింత వేడెక్కింది. అక్కడి డీఎస్పీ, సీఐలు మంత్రి ప్రోత్సాహంతో అక్రమ కేసులు బనాయించారంటూ తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఎస్పీ అమిత్‌బర్దర్‌కు ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు


జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. సర్దారు గౌతు లచ్చన్న విగ్రహంపై అనుచిత వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం..ఇటీవల టీడీపీ నేతలపై అక్రమ కేసులతో మరింత ముదిరింది. వరుస సంఘటనల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు విమర్శలకు దిగడం, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. పలాసలో టీడీపీ సోషల్‌ మీడియా సభ్యుడు లక్కోజు వినోద్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేసి కేసులు బనాయించారని టీడీపీ నేతలు ఎస్పీ అమిత్‌ బర్ధర్‌కు ఫిర్యాదుచేశారు. సంతబొమ్మాళిలో నంది విగ్రహ ఏర్పాటుపై టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.  పలాసలో స్వతంత్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన విగ్రహంపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.


అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. పోలీసులు కనీసం స్పందించకపోవడంతో టీడీపీ శ్రేణులు లచ్చన్న విగ్రహం వద్ద నిరసన చేసేందుకు సిద్ధపడినా పోలీసులు అనుమతివ్వలేదు. అటు తరువాత సంతబొమ్మాళిలో దివంగత నేత ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడి విగ్రహాల ధ్వంసం వివాదాస్పదమైంది. ఇది అధికార పార్టీ నాయకుల పనేనంటూ  టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలలో ఒక్కరిని  కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు టీడీపీ సోషల్‌ మీడియా సభ్యుడిపై అక్రమంగా కేసులు బనాయించడంతో పాటు పోలీసుల సమక్షంలోనే మంత్రి అనుచరులు దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 


పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ

పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమపై సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నా పట్టించుకోని పోలీసులు, టీడీపీ శ్రేణులపై మాత్రం అక్రమంగా కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏడాది కిందట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. సాక్షాధారాలతో సహా డీఎస్పీకి వివరించారు. కానీ ఇంతవరకూ బాధ్యులపై చర్యలు లేవు. ఇంకా పోస్టులు కొనసాగుతునే ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల డైరెక్షన్‌లో పోలీసులు పనిచేస్తున్నారని.. టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో పోలీసుల తీరును టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. డీఎస్పీ, సీఐ వ్యవహార శైలి బాగాలేదని చెబుతున్నారు. మంత్రి అప్పలరాజు ప్రోత్సాహంతో కేసులు నమోదుచేస్తూ టీడీపీ శ్రేణులకు భయాందోళనకు గురిచేస్తున్నారని ఎస్పీ అమిత్‌బర్దర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. 


సంతబొమ్మాళిలో విగ్రహ రగడ

సంతబొమ్మాళి: సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో విగ్రహాల ధ్వంసం ఘటన మరువక ముందే...పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్‌లో విగ్రహ రగడ చోటుచేసుకుంది. జంక్షన్‌లోని సిమెంట్‌ దిమ్మెపై శనివారం నంది విగ్రహం వెలిసింది. ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకేనంటూ వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో శనివారం రాత్రి డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వివాదాస్పదమైన సిమెంట్‌ దిమ్మెను తొలగించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కోటబొమ్మాళి-సంతబొమ్మాళి-నౌపడ ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణలో భాగంగా పాలేశ్వర స్వామి జంక్షన్‌ సమీపంలో రోడ్డు మధ్యలో ఎర్రన్నాయుడు విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. సిమెంట్‌ దిమ్మెను ఏర్పాటుచేశారు. ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో విగ్రహ ఏర్పాటు నిలిచి పోయింది.


అయితే ఇటీవల సిమెంట్ దిమ్మెపై వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో అదే దిమ్మెపై రాత్రికి రాత్రి నంది విగ్రహం వెలిసింది. దీనిపై వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారని.. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రోత్సహం తో టీడీపీ నాయకులు ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం సంతబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కాశీబుగ్గ డీఎస్పీ శివరా మిరెడ్డి స్పందించారు. నంది విగ్రహాన్ని గతంలో ఉన్న చోటుకు తరలించారు. వివాదానికి కారణమైన సిమెంట్‌ దిమ్మెను తొలగించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా టెక్కలి సిఐ నీలయ్య, ఎస్‌ఐ గోవింద బందోబస్తు నిర్వహించారు.


సమగ్ర దర్యాప్తు చేయండి: ఎస్పీకి టీడీపీ నేతల వినతి

శ్రీకాకుళం: కొంత మంది అధికారుల వ్యవహార శైలితో పోలీస్‌ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. టీడీపీ సోషల్‌ మీడియా సభ్యుడు వినోద్‌ అక్రమ అరెస్ట్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ జిల్లా  టీడీపీ నేతలు శనివారం ఎస్పీ అమిత్‌బర్దర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. రవికుమార్‌ మాట్లాడుతూ  పలాస డీఎస్పీ శివరామిరెడ్డి కుల అభిమానంతోనో.. ఇతర కారణాలతోనో సీఎంపై అభిమానం చాటుతున్నారన్నారు. అటువంటిదేమైనా ఉంటే ఇడుపులపాయలో చూసుకోవాలన్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు.


ఇటువంటి ఘటనలు పునరావృతమైతే వేలాది మంది టీడీపీ శ్రేణులతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తామన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు చెప్పారన్న కారణంగానే వినోద్‌ను అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని మంత్రి అప్పలరాజు తనకు సవాల్‌ విసిరిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సవాల్‌కు వినోద్‌ స్పందించి ఎంపీ వరకూ ఎందుకు..? తానే పోటీచేస్తానని ప్రతిసవాల్‌ చేశారని చెప్పారు.ఇది మంత్రికి ఆగ్రహం తెప్పించిందని..రౌడీలకు పురమాయించి దాడులు చేయించారని..అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. మంత్రి పదవిని అప్పలరాజు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వినోద్‌కు తెలుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. గౌతు శిరీష, పీరికట్ల విఠల్‌ తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.


సీఐ సమక్షంలోనే దాడి: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

పాతపట్నం: తమ సమక్షంలోనే రౌడీలు తెగబడి దాడులకు పాల్పడుతున్నా అడ్డుకోలేని స్థితిలో పోలీసులు ఉండడం దారుణమని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. టీడీపీ సోషల్‌మీడియా సభ్యుడు లక్కోజు వినోద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పాతపట్నం సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వినోద్‌ను ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషలు శనివారం పరామర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. వినోద్‌ దుస్థితిని చూసి చలించి పోయామని చెప్పారు. వాస్తవాలన్నీ తెలుసుకున్నామన్నారు. పోలీసుల తీరుపై అపోహలు వీడిపోయాయన్నారు. పలాస నియోజకవర్గంలో పోలీసులు అమ్ముడుపోయారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొంతమంది పోలీస్‌ అధికారులతో తీరుతో మిగతా వారికి చెడ్డపేరు వస్తోందన్నారు.


పండుగ పూట అక్రమంగా ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రశ్నించినా సమాధానం కరువైందన్నారు. సీఐ శంకరరావు సమక్షంలోనే వినోద్‌పై మంత్రి అప్పలరాజు మీడియా హెడ్‌ రాకేష్‌ రెడ్డి, బుక్కల లక్ష్మణ్‌, మరో ముగ్గురు దాడిచేశారని చెప్పారు. తొలుత సోషల్‌ మీడియా కేసు అని చెప్పి..తీరా ఎక్సైజ్‌ కేసును బనాయించారని ఆరోపించారు. ఈ విషయంలో వినోద్‌కు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. పార్లమెంట్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తానన్నారు. కోర్టులో ప్రైవేటు కేసు వేయడంతో పాటు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష్‌ వినోద్‌ పరిస్థితిని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి అప్పలరాజుకు డీఎస్పీ సేవకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతమైన పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే అప్పలరాజుకు మంత్రి పదవి ఇవ్వడంతో ఇటువంటి ఘటనలకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.


Updated Date - 2021-01-17T06:00:38+05:30 IST