రాజకీయ వేడి

ABN , First Publish Date - 2022-05-11T07:16:06+05:30 IST

జిల్లాలో మండుటెండను సైతం మరిపించే రీతి లో రాజకీయ వాతావరణం పతాకస్థాయికి చేరుకుంటోంది.

రాజకీయ వేడి
పార్టీ నేతలతో సమావేశమైన ఎఐసీసీ నేత ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి ( ఫైల్‌ )

మండుటెండలో జిల్లాలో జోరుగా రాజకీయం 

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల పోటాపోటీ కార్యక్రమాలు 

సోషల్‌ మీడియాను యాక్టివ్‌ చేసేందుకు ‘గులాబీ’ నేతల ప్లాన్‌ 

జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా కార్యవర్గాల ఏర్పాటు 

ఈ నెల 12నుంచి ‘ఊరూరికి మహేశన్న’ కార్యక్రమం

‘పోలింగ్‌ బూత్‌ దర్శన్‌’ పేరిట ప్రజల్లోకి బీజేపీ 

నిర్మల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మండుటెండను సైతం మరిపించే రీతి లో రాజకీయ వాతావరణం పతాకస్థాయికి చేరుకుంటోంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఎండను సైతం లెక్క చేయకుండా పో  టాపోటీ కార్యకలాపాలు చేపడుతూ జనానికి మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుండడం చర్చకు తావిస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, విఠల్‌రెడ్డిలు ఎండను లెక్కచేయకుండా అధికారిక కార్యక్రమాల్లోనే కాకుండా ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ జనందృష్టిని ఆకర్షిస్తున్నారు. సాధారణ అభివృద్ది పనులతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లాంటి కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు బిజీ అవుతున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల్లోల ఉండే పార్టీగా చెప్పుకుంటున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ సైతం తన దూకుడును పెంచేందుకు సిద్ధమైంది. వరంగల్‌లో రాహుల్‌గాంధీ సభ సక్సెస్‌ కావడంతో ఆ పార్టీలో కొత్తఉత్సాహం నెలకొంది. వరంగల్‌లో కాంగ్రెస్‌ చేసిన డిక్లరేషన్‌పై జనాలకు అవగాహన కల్పించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. ముఖ్యంగా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి ఈ నెల 12వ తేదీ నుంచి ఊరూ రికి మహేశన్న పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది. గతంలో మహేశ్వర్‌రెడ్డి చేసిన పాదయాత్ర ఇక్కడి రాజకీయ చరిత్రను తలకిందులు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి అదే తరహాలో చేపట్టబోతున్న ఊరూరికి మహేశన్న కార్యక్రమం రాజకీయ సమీకరణలను మార్చబోతోందంటున్నారు. ఈ రెండు పార్టీలకు ధీటుగా బీజేపీ పార్టీ పట్టణవార్డుల్లోనూ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ పోలింగ్‌బూత్‌ దర్శన్‌ పేరిట చేపడుతున్న కార్యక్రమానికి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీలోని గల్లీల్లో బీజేపీ పోలింగ్‌ బూత్‌దర్శన్‌ పేరిట చేపడుతున్న కార్యక్రమం ద్వారా అనేక సమస్యలను వెలుగులోకి తెస్తోంది. దీంతో పాటు బీజేపీ నాయకులు మండల కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లో పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే స్తానిక నేతల్లో , కార్యకర్తల్లోనూ మనోదైర్యం నింపే విధంగా సమన్వయ సమావేశాలు చేపడుతున్నారు. ఇలా మూడు పార్టీలు పోటాపోటీగా ఈ వేసవిలో వరుస కార్యక్రమాలు చేపడుతూ తమపట్టును నిరూపించుకునే ప్రయ త్నం సాగిస్తుండడం రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురి చేస్తోందంటున్నారు. 

దూకుడు మీదున్న టీఆర్‌ఎస్‌

     నిర్మల్‌తో పాటు ఖానాపూర్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుగా కార్యక్రమాలను చేపట్టి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటూ ఆ దిశగా కార్యకర్తలందరినీ సిద్దం చేసే యోచనతో మండల స్థాయిలో పార్టీ సోషల్‌ మీడియా విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకశిక్షణ తరగతులను సైతం నియమించనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఈ సారి ఎలాగైనా మూడు నియోజకవర్గాల్లో గెలుపు సాధించాలన్న కోణంతోనే ఆ పార్టీ పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. ముఖ్యంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతీ వారంలో నాలుగైదు రోజులు నిర్మల్‌లోనే ఉంటూ ఇక్కడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌, బీజేపీల ఎత్తుగడలను గమనించి ఆ రెండు పార్టీలకు చెక్‌ పెట్టే ప్రయత్నాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమలు చేస్తున్నారు. ముథోల్‌ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా పోటాపోటీ కార్యకలాపాలు చేపడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు దీటైన సమాధానం ఇస్తున్నారు. ఇక్కడి బీజేపీలోని లోసుగులను విఠల్‌రెడ్డి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. దీంతో పాటు ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ కూడా ఇదే తరహా దూకుడును ప్రదర్శిస్తూ ప్రతీరోజూ అధికారిక కార్యకలాపాల తో బీజీగా మారిపోతున్నారు. ప్రతి వారంలో నాలుగైదు రోజులకు పైగా ఆమె ఖానాపూర్‌ సెగ్మెంట్‌లోనే మకాం వేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

12వ తేదీ నుంచి ‘ఊరూరికి మహేశన్న’ కార్యక్రమం

కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాలో ఊపిరి పోసేందుకు ఆ పార్టీకి చెందిన అగ్రనేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలే టీ మహేశ్వర్‌ రెడ్డి మరోసారి రాజకీయ కలకలం రేపేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే ఎన్నికల వరకు ఊరూరికి మహేశన్న పేరిట ఆయన చేపట్టబోతు న్న పర్యటన కార్యక్రమంపై అంతటా ఆసక్తి నెలకొంది. రాజకీయ ప్రచార వ్యూహంలోనూ, కార్యక్రమాల అమలు వ్యూహాంలోనూ దిట్టగా గుర్తింపు పొందిన మహేశ్వర్‌ రెడ్డి ‘ఊరూరికి మహేశన్న’ కార్యక్రమం పేరిట సరికొత్త ప్రణాళికలు రూపొందించడం అంతటా చర్చనీయాంశమవుతోంది. గతంలో మహేశ్వర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టి జనానికి అత్యంత చేరువవ్వడమే కాకుండా వందలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. స్వచ్చంద కార్యక్రమాలు, పాదయాత్రతో ఆయన నిర్మల్‌ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు. ప్రజారాజ్యంపార్టీ నుంచి పోటీ చేసి ఆయన అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటినుంచి రాజకీయ కార్యకలాపాల నిర్వహణలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌, బీజేపీల దూకుడుకు కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో ఊరూరికి మహేశన్న కార్యక్రమాన్ని రూపొందించి.. ఈ నెల 12వ తేదీ నుంచి జిల్లాలో మొదలుపెట్టనున్నారు. 

బీజేపీలో కొత్త ఉత్సాహం

   జిల్లాలో బీజేపీ పార్టీలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. గత కొద్ది రోజుల నుంచి ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడం, పార్టీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేపడుతుండడం లాంటి కార్యక్రమాలు జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని బీజేపీ నేతలు బస్తీ, గల్లీబాట పేరిట పోలింగ్‌ బూత్‌ దర్శన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు. అలాగే పార్టీ పరమైన కార్యకలాపాల నిర్వహణలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఎలాగైనా అధికారం చేపట్టడమే ధ్యేయంగా జిల్లాలో ఇప్పటి నుంచే ఆ పార్టీ నాయకులు ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ రూపొందించినట్లు చెబుతున్నారు. ఆ దిశగా పార్టీ జిల్లా శ్రేణులు పక్కా ప్రణాళకతో ముందుకు సాగుతున్నారు. 

Read more