వ్యాక్సినేషనకూ రాజకీయ రంగు

ABN , First Publish Date - 2021-05-10T07:06:18+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియ రాజకీయ రంగు పులుముకుంటోంది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా వ్యాక్సినేషనకు అర్హులైన వారికి కూపన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కూపన్లను వైసీపీ అనుకూలురకు మాత్రమే ఇస్తున్నారంటూ వ్యాక్సినేషన కేంద్రాల వద్ద ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు.

వ్యాక్సినేషనకూ రాజకీయ రంగు

  • టీకా పంపిణీలో వైసీసీ నేతలదే ఆధిపత్యం  
  • ముందస్తు వ్యూహాలతో కూపన్ల పంపిణీ
  • ఎమ్మెల్యే సిఫార్సుతో ఆయన బంధువులకు కొవాగ్జిన టీకా మొదటి డోస్‌
  • పి.గన్నవరం ఎంపీడీవో వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి
  • వ్యాక్సినేషన కేంద్రాల వద్ద ఆందోళనకు దిగుతున్న ప్రజలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియ రాజకీయ రంగు పులుముకుంటోంది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా వ్యాక్సినేషనకు అర్హులైన వారికి కూపన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కూపన్లను వైసీపీ అనుకూలురకు మాత్రమే ఇస్తున్నారంటూ వ్యాక్సినేషన కేంద్రాల వద్ద ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. కూపన్ల జారీలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్న తీరు కూడా వివాదాస్పదమవుతోంది. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సిఫార్సుతో  కొవాగ్జిన రెండో డోస్‌ను మొదటి డోస్‌గా ఆయన బంధు వర్గీయులు కొందరికి వేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీడీవో వెంకటేశ్వరరావుపై కలెక్టర్‌ సస్పెన్షన వేటు వేశారు. పి.గన్నవరం హైస్కూలులో కొవాగ్జిన 200 సెకండ్‌ డోసులు విడుదలయ్యాయి. శుక్రవారం వీటిలో 11 టీకాలను ఎమ్మెల్యే చిట్టిబాబు కుటుంబ సభ్యులకు మొదటి డోసుగా వేశారు. మిగిలిన వాటిని సెకండ్‌ డోస్‌గా ఇచ్చారు. నిబంధనలను పక్కపెట్టి ఎమ్మెల్యే సిఫారసుపై మొదటి డోస్‌ వేసిన ఎంపీడీవో వెంకటేశ్వరరావు సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడంతో రసవత్తర రాజకీయం నడుస్తోంది. అమలాపురంలోనూ కొవాగ్జిన టీకా కోసం రాజకీయ నాయకుల సిఫార్సు వున్న వారికే అధిక ప్రాధాన్యం లభించింది. వలంటీర్లకు సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా వార్డుల్లో కౌన్సిలర్లకు, వైసీపీ కీలక నాయకులకు టోకెన్లను ముందుగా విడుదల చేశారు. వాటిని వారికి అనుకూలురైన వ్యక్తులకు పంపిణీ చేయడంతో రెండో డోస్‌ కోసం క్యూలో వేచి ఉన్న బాధితులకు అన్యాయమే జరిగింది. గడువు ముగుస్తున్నప్పటికీ పట్టించుకునే అధికారులే కరువయ్యారు. సిఫారసులతోనే టీకా అమలైంది. అల్లవరంలో కూడా రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. కొత్తపేట హైస్కూలులో 130 డోస్‌ల కొవాగ్జిన టీకా పంపిణీ రసాభాసగా ముగిసింది. గ్రామంలో రెండో డోస్‌ వేయించుకోవాల్సిన వారు 1500 మంది ఉండగా, వైసీపీ నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులకు 130 కూపన్లు ముందస్తుగా పంపిణీ చేశారు. ఈ విషయం తెలియని జనం పెద్ద సంఖ్యలో వాక్సినేషన కేంద్రానికి తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 25 సంవత్సరాల వారికి కూడా టోకెన్లు పంపిణీ   చేయడం, వారంతా వచ్చి క్యూలో నిలుచోవడంతో అధికారులు కంగుతిన్నారు. గడువు ముగిసి 60 ఏళ్లు దాటి ఉన్నవారు లైన్లో ఉండాలని, మహిళలు వేరే లైన్లో ఉండాలని.... ఇలా రకరకాలుగా వందల సంఖ్యలో వ్యాక్సినేషన కోసం వచ్చిన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. తోపులాటలు, తొక్కిసలాటలు కూడా జరిగాయి. వైసీపీకి అనుకూలురైన వ్యక్తులకే రెండో డోస్‌ టీకాలు వేశారంటూ సామాన్య ప్రజలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కొందరు శాపనార్థాలు కూడా పెట్టారు. కొవాగ్జిన రెండో డోస్‌ గడువు ముగుస్తున్న వారు వాడపాలెంలో వందల మంది ఉన్నప్పటికీ వారికి టీకా అర్హత కల్పించలేని, అధికారుల తీరుపై కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ఆ గ్రామానికి చెందిన త్సామా ఆదినారాయణమూర్తి (బాబు) చెప్పారు. 


వ్యాక్సిన్‌ టోకెన్ల దుర్వినియోగం ఆరోపణ... 

ఇరిగేషన్‌ ఉద్యోగి సూర్యప్రకాష్‌ సస్పెన్షన్‌

రాజమహేంద్రవరం, మే 9 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టోకెన్ల దుర్వినియోగం వ్యవహారంలో ఒక ఉద్యోగి సస్పెన్షనకు గురయ్యారు. వివరాలు ఇలా వున్నాయి... ధవళేశ్వరం ఈశ్వర్‌నగర్‌లోని యూపీహెచసీలో ఆదివారం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేపట్టారు. ఇరిగేషన్‌ హెడ్‌వర్క్‌, సప్లయి సబ్‌ డివిజన్‌కు చెందిన సీనియర్‌ అసిస్టెంట్‌ డి.సూర్యప్రకాష్‌ నిర్ణయించిన వారికి కాకుండా వేరేవారికి టోకెన్లు ఇచ్చాడనే ఆరోపణలొచ్చాయి. దీంతో కలెక్టర్‌ మురళీధరరెడ్డి ఆదేశాల ప్రకారం సూర్యప్రకాష్‌ను సస్పెండ్‌ చేస్తూ ఇరిగేషన్‌ ఎస్‌ఈ  ఆర్‌.రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.


Updated Date - 2021-05-10T07:06:18+05:30 IST